Home Blog Page 4

అనగనగా ఒక రాజ కుమారి

అనగనగా ఒక రాజ కుమారి

మనుషులైనా, వస్తువైనా ఉన్నప్పుడు వాటి విలువ ఎవరూ గుర్తించరు. గడిచిన చరిత్ర మీద ఉన్న ఆసక్తి, కుతూహలం జరుగుతున్న వాస్తవాల గురించి అంతగా ఉండదు. ఇక ప్రముఖుల సంగతి సరే సరి. ఏ మనిషి నుండైనా నేర్చుకోవలసిన మంచో, చెడో కొంచం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పే రాకుమారి జీవితం మొత్తం స్ఫూర్తిదాయకమే. తన విజయాల నుండి తెలుసుకోవలసినవి, తప్పులనుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఎన్నెన్నో. జయలలిత, పేరు వినగానే గంభీరమైన భారీ విగ్రహం, చూపులతోనే ఆమడ దూరం పెట్టె మనిషి గుర్తొస్తాయి. జీవితం పూల బాటగా చేసుకోగలిగే అవకాశాము ఉన్నప్పటికీ ఎంతో క్లిష్టమైన మార్గాన్ని ఎంచుకుని, అందులో ఆటుపోట్లని అధిగమించి ఒక జాతిపై బలమైన ముద్ర వేయగలిగారు.

రాజకుమారి అనగానే అపురూపమైన జీవితం అనుభవించే ఒక అపరంజి బొమ్మ గుర్తొస్తుంది. ఈ అపరంజి బొమ్మ కూడా తన జీవితం అపురూపమైనది అని భావించేది. అమ్మకి దూరంగా వున్న బాల్యంలో చిన్నారి “అమ్ము” ఎంతగానో బాధపడింది.బహుశా తన జీవితంలో ఎక్కువ భాగం ఎవరి తోడు లేకుండా ఉండవలిసి వస్తుందేమో అని అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు.

ఆ సమయంలోనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని సమకూర్చుకుంది. అదే తన చదువు, భాషపై పట్టు. ఒక మనిషి జీవితంలో చదువు ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో జయ లలిత జీవితం చక్కని ఉదాహరణ. మద్రాస్ మొత్తానికి మెట్రిక్యులేషన్ లో “టాపర్” గ నిలిచారంటే తన ప్రతిభా పాటవాలు ఏంటో అక్కడే తెలుసుకోవచ్చు.

స్కూలింగ్ అయినవెంటనే తన జీవితం అంతా పూలపాన్పు కాదని తెలుసుకుంది.తన స్కాలర్షిప్ ని కూడా పక్కనపెట్టి, తాను లాయర్ కావాలనే కల పక్కన పెట్టి ఇష్టం లేని రంగంలోకి అడుగు పెట్టింది. కుటుంబం కోసం ఇష్టం లేక పోయినా సినిమాలలో చేరవలసి వచ్చింది.
ఈ రాకుమారి కలలు చెదిరి వాస్తవం లోకి రావడం అంతటితో మొదలు. పదహారు సంవత్సరాల ప్రాయంలో రంగుల లోకం లోకి అడుగుపెట్టింది. సకలకళా కోవిదురాలికి అక్కడ కూడా అఖండ విజయం ఎదురైంది.

అంతా బాగుందన్న సమయాన తన తల్లి మరణం తనను ఒంటరిని చేసింది. లంకంత ఇంటిలో ఏకాకి. బంగారు పంజరం లోని చిలుక. అప్పటి తన పరిస్థితి తలుచుకుంటే గుండెల్లో చెప్పలేని భాధ. ఎంత భాధ పడివుంటుంది. మంచి చెడులని చెప్పే పెద్దవారు లేక, ఎవరిని నమ్మాలో తెలియక తన చుట్టూ ఒక గిరి గీసుకుందేమో అనిపించక మానదు.
బహుశా ఆ సమయంలో జయ తల్లిగారు ఉండివుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ విధి వేరే పని కోసం ఆమెను సిద్ధం చెయ్యసాగింది.

ఒంటరి తనం ఓదార్పు కోరుకుంటుంది. తనకి తెలియకుండానే తన జీవితం ఇంకొకరి చేతిలో పెట్టేసింది.అమ్మ చెప్పింది వినటం తప్ప ఇంకోటి తెలీని అమ్మాయి, ఇప్పుడు తన గురువు చెప్పింది వినటం మొదలుపెట్టింది. తనకి తెలియకుండానే రాజకీయ రంగం లో ప్రవేశించింది. ఎక్కడ అడుగు పెట్టినా విజయం పై గురి పెట్టే తనకి, విజయం అక్కడ కూడా పలకరించింది.

తన చదువు తన వ్యక్తిత్వం ఇవే తన ఆయుధాలు. పార్టీ తన చేతిలో ఉన్నప్పుడు అసెంబ్లీ లో తన చీరని లాగి, జుట్టు పట్టి హేళన చేసిననప్పుడు తాను చూపిన నిబ్బరం చూస్తే “శభాష్” అనక తప్పదు. ఈ సంగతి తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఒక ఆడదాన్ని అవమానిస్తే యుద్ధాలు జరిగి, అవి కావ్యాలుగా మారి, మన సంస్కృతికి అద్దంపట్టే గ్రంధాలు అయిన సమాజం మనది.కానీ అవి వేరే యుగం కథలు.

కానీ ఇది మన కళ్ళముందు జరిగిన కథ. అక్కడ “స్త్రీ” నిస్సహాయంగా తనని కాపాడే వారికోసం ఎదురు చూసింది. కానీ ఇక్కడ ఈ “స్త్రీ”తానే శక్తి అయి తన కష్టం తానే ఎదుర్కొంది. తనకి జరిగిన అవమానానికి “మహా భారత “యుద్ధం చేసి ఓడినచోటే గెలిచి చూపించింది జయలలిత. ఇక్కడ తన యుద్ధం తానే చేసింది. ఈ రాకుమారికి ఏ రాజకుమారుడి అవసరం రాలేదు.తనకి జరిగిన అనుభవాలు తనని మొండి చేసినా, నియంతని ముద్ర వేసినా, ఎక్కడా వెను దిరగక మళ్ళి మళ్ళి విజయాలను సాధించింది.

ఒక స్త్రీ ని ఫలానా వ్యక్తి కూతురిగానో, భార్యగానో,అమ్మగానో అనే హోదాలు లేకుండా, కేవలం తానే తన ఉనికిగా తన పేరే ఒక పరిచయం అవసరం లేని చరిత్రగా మలుచుకున్న తీరు చూస్తే గర్వాంగా అనిపించక మానదు. ఇవన్నీ కూడా స్త్రీ చుట్టు ఆంక్షలు అల్లుకున్న 1970-80 ల్లో
. ఎవరిని ఒకపట్టాన నమ్మని మనుషులని, నమ్మిన సిద్ధాంతాలని గుడ్డిగా ఆచరించే జనాల అభిమానం చూరగొనడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.

తన గురించి తన ప్రస్థానం గురించి తెలుసుకున్నప్పు ఇలాంటి ఒక మనిషిని నేను ఎరుగుదును అని నాకు గర్వం గా అనిపించింది.

అనగనగా కధలు ఎన్నో చదివాను.అన్నిట్లో రాకుమారి ఎవరిమీదో ఒకరి మీద ఆధారపడేది. కానీ ఈ రాకుమారి ప్రత్యేకం. తన కష్టం తానే ఎదుర్కొంది.తన రక్షణ తానే చూసుకుంది.తన శపథం తానే నెరవేర్చుకొంది. తన యుద్ధం తానే చేసి గెలిచింది. ఆ గెలుపు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.
తనంటే ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన గురించి తెలుసుకున్న ప్రతి విషయం నన్ను ఆశ్చర్య పరిచింది. తన చదువు, అందం,తెలివితేటలు, వాటిని తగినవిధంగా ఉపయోగించ గలిగే చాకచక్యం.ఓహ్ ఎంతైనా నేర్చుకోవచ్చు,తన నుండి.

ఇలాంటి ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం అనిపించింది. కష్టాల దారిలో ఎంతో ఇష్టం గా నడిచి, రాళ్లు పడ్డచోటే పూలు వేయించుకున్న మనిషి.
ఝాన్సీరాణి, రుద్రమదేవి వీరందరూ నాకు చరిత్ర. నాకు తెలీని చరిత్ర.
నేను చుసిన వీరవనిత “ఈ అమ్ము” “అమ్మ”.
ఇకపై అనగనగా కథల్లో నేను చెప్పబోయే ఓ రాకుమారి కధ.

ఆనందో బ్రహ్మ

మనుషులు పలు రకాలు. కాకపోతే , ఈ రోజు నేను మొదలు పెట్టిన అంశం కోసం, మనుషులని రెండు రకాలుగా విభజిస్తున్నాను. ఆ హక్కు నాకెవరు ఇచ్చారని మీరు అడగకూడదు. పవిత్ర భారత దేశంలో పుట్టిన ప్రజాస్వామ్య బిడ్డగా, ఏ  విషయాన్నయినా నా ఇష్టం వచ్చి చీల్చి చెండాడి, నా వాదనలని అవతలి వారిపై బలవంతంగా రుద్దగలిగే హక్కుని పొందాను కాబట్టి.

అంచేత  నే  చెప్పొచ్చేదేంటంటే మనుషులు రెండు రకాలు:

1.తినడానికి కోసం బ్రతికేవాళ్ళు

2.బ్రతకడం కోసం తినే వాళ్ళు.

anandveg.com_మొదట ప్రతి ఒక్కరు బ్రతకడం కోసం మాత్రమే  తింటారు.ఇక తినేంత సంపాదించాక తినడం కోసం బ్రతుకుతారు, అని నా ఉద్దేశ్యం.సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనుషులు కోతుల్లాగా ఈ రెండు రకాల లోకి గెంతుతూ ఉంటారు.ఎంత గొప్పవారైన కూడా ఈ రెండు రకాల చుట్టూ తిరగ వలసిందే.

ఈ జ్ఞానోదయం నాకు ఎప్పుడు కలిగిందంటే, ఈ మధ్య మేము అమెరికాలో ఉంటున్న ఊరు నుండి వేరే ఊరికి మారవలసి వచ్చింది.అక్కడ ఆనంద భవన్ అని మోడ్రన్ టిఫిన్ సెంటర్ వుంది.మా పాత ఊర్లో, మాగొప్ప అనుభవం వల్ల నాకు బయట తిండి అంటే దడ మొదలైంది.పొద్దున్న తింటే రాత్రి దాకా అరగకుండా , కడుపులో ఇంత బండ రాయి వేసినటువంటి ఒక వింత అనుభూతి కలిగేది అక్కడ.చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న చందంగా, దొరికిందే పరమాన్నం అనుకుని తినే వాళ్ళం.

ఇక్కడ కూడా మొదటి రోజు స్వయంపాకం కుదరక దగ్గరలో వున్న ఇండియన్ రెస్టరెంట్ కి వెళ్ళవలసి వచ్చింది. “ఆనంద భవన్”, పేరులో వున్న ఆనందం తిన్న తరువాత ఎలాగు ఆవిరై పోతుందని ఇన్నాళ్ళ అనుభవంతో నమ్మకంగా వెళ్ళాను.

మా పాత ఊరు ఒక కుగ్రామం అవడం చేత అక్కడ మన దక్షిణ భారత వంటకాలు రుచి చూసే భాగ్యం దక్కలేదు. ఇక్కడేమో ఈ హోటల్లో ఇడ్లి లో ఓపది రకాలు,దోశలలో ఓ ఇరవై రకాలు, ఇంకా రకరకాల వడలు, పాయసాలు, రవ కేసరులు ఓయబ్బో మనం మరచిపోయిన మన వంటలన్నీ వాడి మెనూలో ఎక్కిన్చేసాడు.

ఇంటి కోడి, పులుసుకి పనికి రాదు అన్న విధంగా, సగటు తెలుగు వాడిగా నేను కూడా, “ఓస్ ఇడ్లి వడ తినడానికి కూడా హోటల్ రావాలా”, అనుకున్నాను.జాతి లక్షణాలు అంతా తొందరగా పోవన్డోయ్…వెటకారం మన ఇంటి పేరు, అహంకారం మన ఒంటి పేరు కదా మరీ.

imagesఇంతలో స్టీలు ప్లేట్లలో (సౌత్ ఇండియన్ ఎఫెక్ట్ )పొగలు కక్కే ఇడ్లీలు నా ముందుకి వచ్చాయి. విడిపోయిన స్నేహితుడిని మళ్ళి చూసుకున్న ఫీలింగ్.

“ఛ..ఇంట్లో ఇడ్లీలు చేసుకోమా?”, అని అనకండి…వచ్చీ రాని వంటతో, మీకు నచ్చే విధమైన వంటలు దొరకక, దొరికిన రకాలనే, “ఏఖో నారాయణా”, అనుకుంటూ, కొన్ని సంవత్సరాలు గడిపితే…చివరికి మజ్జిగ కూడా అమ్రుతం లాగానే వుంటది.పైగా పొరుగింటి పుల్ల కూర రుచి, డబ్బులు వదిలించుకుని మరీ బయట తినడంలో వున్న మజా చెప్పాలటోయ్ .

హ..ఇడ్లీలు వచ్చాయా…అబ్బ అదేంటో మినీ ఫ్రై ఇడ్లి అట…ఇడ్లిలకి పుట్టిన పిల్లల్లాగా వున్నాయ్…చిన్ని చిన్ని తెల్ల చేమంతుల్లాగా వున్నాయ్…కాసేపు పరీక్షించాక తెలిసింది. వాటిని చక్కగా కాసింత నేతితో దోరగా వేయించి, వేడి పైనే కంది పొడి..ఏంటి కంది పోడండీ బాబూ, దట్టంగా తగిలించి …మూడురంగుల చట్నీలతో ఇచ్చాడు.

చాన్నాళ్ళకి కంటికి ఇంపైన దేశవాళి రుచులు చూడడం తో ఒకలాంటి ఉద్వేగం కలిగింది. ఇది exaggeration కాదండీ, ఎంత రుచికరమైన బిర్యానీలు, పాస్థాలూ, పిజ్జాలు  తిని “yo yo man” అన్నా, మనవి, మనది అనుకునే వాటిని చాన్నాళ్ళ తర్వాత చూస్తే ఇలాంటి అనుభూతే కలుగుతుంది.అది ఇడ్లి అవ్వొచ్చు, సాంబ్రాణి ధూపం అవ్వొచ్చు.మనిషికి, మనసుకి, అనుభూతులకి మధ్య సంబంధం బహు చిత్రమైనది సుమీ…..

IMG_2651ఇహ ముక్క తుంచి నోట్లో పెడుదును కదా…అబ్బో బ్రహ్మాండం…అంతే..చిన్ని కృష్ణుడి నోట్లో 14లోకాలు కనిపించినట్టు..ఇడ్లితో నాకు ఉన్నటువంటి అనుభవాలు మొత్తం ఈస్ట్ మాన్ కలర్ లో కనిపించాయి.మొత్తానికి నా అస్థిత్వాన్ని నాకు మళ్ళి జ్ఞాపకం తెచ్చింది ఈ ఇడ్లి…

హోటల్ నుండి వచ్చాక అప్పుడు నాకీ విషయం బోధపడింది.తిండికి మనకి వున్న అవినాభావ సంబంధం. ఈ కాలంలో అంత ఓపికలు లేవు పిల్లలకి..కానీ అలా అని చెప్పి మన వంటలను మర్చిపోకూడదు. అమ్మమ్మ చెప్పిన జేవిత సత్యం ఇప్పుడు అర్ధం ఐంది…”కడుపు నిండా తిని, ఒంటి నిండా పని చెయ్యాలి ” అని.అప్పుడు ఆనందంతో పాటూ ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే.

గురజాడ వారి మాటలు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి కదా..

“తిండి కలిగితే కండ కలుగును
 కండ కలవాడేను మనిషోయి

                                       యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌”

 

Political satire

పిట్ట కధ

అప్పుడు:

“ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్ళతో దున్నిస్తా. పంట భూములని తిరిగి సాగులోకి తెస్త.”

ఇప్పుడు:

“ఫిల్మ్ సిటి ఒక అద్భుత కళా ఖండం. మా నగరానికే కాదు,  రాష్ట్రానికే కాదు మొత్తందేశానికే  గర్వకారణం.”

ఎప్పుడూ:

అక్కా ఈ వార్త విన్నావా? మరీ ఇంతలా….

మనకెందుకులే అక్కా, దొంగోడు దొంగోడు కలిసి ఊర్లు పంచుకున్నారట.

రేపు పండక్కి నువ్వు ఎన్ని చుక్కల ముగ్గు పెడుతున్నావ్?

రమ షకినాలు చుట్టడానికి మధ్యాహ్నం రమ్మంది, గోంగూర పచ్చడి నేర్పించమని అడిగింది. తర్వాత సాయంత్రం ఉమా వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు ప్రసాదం ఇస్తాము రమ్మనమని చెప్పారు.

ఎన్ని పనులు , పద పద .

దీపావళి

DSC00409దీపానికి, భారతీయతకు విడదీయని బంధం వుంది.దేవుని ముందు దీపం వెలిగించి నమ్మకంతో ప్రార్ధిస్తే అది మనకి ఎంతో మనో ధైర్యాన్ని,శాంతిని ఇస్తుంది.మన మనసులో వుండే భయం,అజ్హ్ఞానం అనే చీకట్లను తొలగించి మనలో వెలుగుని నింపుతుంది.

అటువంటి దీపాల పండుగ మన దీపావళి.చెడుపై మంచి గెలుపుని,చీకటి పై వెలుగు యొక్క గెలుపుని తెలియజేసే పండుగ.అమావాస్య చీకట్లలాంటి మన చెడు ఆలోచనలని తన వెలుగులలో అంతం చెయ్యమని చెప్పే పండుగ.

 

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

downloadపురాణం: నరకాసురుడనే రాక్షసుణ్ణి శ్రీ కృష్ణుడు, సత్య భామా సమేతంగా వధించిన రోజు నరక చతుర్దశి.ఆ మరుసటి రోజు అమావాస్య .లోకకంటకుడైన రాక్షసుడు చనిపోవడం తో ప్రజలు తమ ఆనందాన్ని తెలియజెయ్యడానికి దీపాలతో ఇళ్ళను అలంకరించారని చెప్తారు.

ఇదే రోజు శ్రీ రాముడు లంక పై విజయం సాధించి సీతమ్మతో సహా అయోధ్యకి వచ్చాడని,అందుకు జనమంతా సంతోషంతో దీపావళి జరుపుకున్నారని కూడా చెప్తారు.

కారణం ఏదైనా పిల్లలకి పెద్దలకి సంతోషాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ దీపావళి.మనుషులంతా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ,మిటాయిలు పంచుకుంటూ,ఒకరికి ఒకరు సంఘం లో తోడుగా ఉంటామని తెలియజేసే పండుగ.images (2)

ఈ పండుగ రోజు దైవ భక్తితో పాటు సంఘం పట్ల భాద్యతను,జీవితం పట్ల నమ్మకం మరియు గౌరవం కూడా కలిగి ఉండాలని.ఈ దీపావళి అందరి జీవితాల్లోకి వెలుగులు నింపాలని కోరుకుంటూ ,”అందరికి దీపావళి శుభాకాంక్షలు”.

Happy-Diwali-2012-3D-Wallpapers-HD

 

 

శ్రీ బాపు గారు

PAR6UM6U6DHBQV8SM7N1EMILBURWBT_1_grandeఈ వార్త వినాల్సివస్తుందని తెలిస్తే అసలు ఈ రోజు లేచేదాన్నే కాను.అయినా నా పిచ్చి కాకపోతే బాపు గారు చనిపోవడమేంటి?.తెలుగుతనం,బాపూ బొమ్మ,బాపు చలన చిత్ర కావ్యాలు,బుడుగు, జ్ఞాన ప్రసూనాంబ వీళ్ళంతా చనిపోతారా ఏంటి?.వీళ్ళు ఉన్నంత కాలం ఆయనా ఉంటారు.కులాసాగా,చిలిపిగా తన ట్రేడ్ మార్కు స్టైలు లో నవ్వుతూ,అంతే.ఏదో బోరు కొట్టి భౌతికంగా మనకి దూరం అయ్యారంతే.శాశ్వతంగా తెలుగు వెలుగుల్లో అయన కుడా ఒక జ్యోతిగా వెలుగుతూనే వుంటారు.budugu

పది పేజీలలో చెప్పగలిగే భావాన్ని ఒక చిన్న బొమ్మలో చూపించగల బొమ్మల మాంత్రికుడు.బాపూ గారి బొమ్మ తో కవర్ పేజి వుందంటే ఆ పుస్తకానికే ఒక విలువ ఒక హోదా వచ్చేస్తాయి.అయన బొమ్మల రామాయణం చదవక్కరలేదు చూస్తె చాలు రామాయణ సారం అరటిపండు ఒలిచి తిన్నట్టు తెలిసిపోతుంది.కొంటె దనం,తెలుగు తనం తో పాటు నవ రసాలు కలబోసిన మధుర కావ్యాలు బాపు చిత్రాలు.ఇంకా అయన గీసిన కార్టూన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.వాటికోసం ఎన్ని వార పత్రికలు చింపివేసానో.
10492472_734061059973493_4343605660482631233_nఇప్పటికి వాటిని జాగ్రతగా బీరువాలో ఏదో పెద్ద నిధిని దాచుకున్నట్లు దాచుకున్నాను.అవును వాటిని నిధి కాదని ఎవరు అనగలరు.కాదన్న వాడు గాడిద అంతే.మనసుకి ఏ మాత్రం బాధకలిగినా వాటిని చూస్తే బాధ గీద అన్నీ హుష్ కాకి,పెదవులపైకి తెలియకుండానే నవ్వులు పూస్తాయి.

ఆ తెలుగు నవ్వుల వెన్నెలలో ఎప్పుడూ వాడని పొగడపూవు మన బాపూ గారు.బాపు బొమ్మలను చూసి ఎంతమంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా మారారో.వాళ్ళలో నేను ఒకదాన్ని.అందమైన బొమ్మలు,కళ్ళతో,వంటి ఒంపుసొంపులతో నే ఎన్నో ఊసులు చెప్పే బొమ్మలు. అవి,తెలుగుతనానికి నిండుతనం తెచ్చిన బాపు చేతి గీతలు.బాపు బొమ్మలా వున్నావ్ అని అనిపించుకోడానికి తహతహలాడని తెలుగమ్మాయిలు ఉంటారా అసలు.bommala koluvu 013

parasatiఇక ఆయన చలన చిత్రాల విషయానికి వస్తే అవి చలన చిత్రాలు కాదు,మాటలు వచ్చిన బాపూ బొమ్మలు,కదిలే తెలుగు జీవన మధుర కావ్యాలు.ఏ చిత్రం చూసిన అందులో అడుగడునా తెలుగుతనం నిండుతనం కానవస్తాయ్.మధ్య తరగతి జీవనాలు,సరదాలు సంతోషాలు ఆయనకన్నా ఎవరు బాగా తీయగలరు.భార్యా భర్తల అనురాగం,సంసార సారం ఆయన చూపించిన అంత రమ్యంగా ఇంకెవరు చూపించగలరు.భక్తి చిత్రాల విషయానికి వస్తే సాక్షాతూ దేవతలే దిగి నటించారేమో అనేంత సహజంగా ఉంటాయ్ పాత్రలు.సీతా కల్యాణం లో గంగావతరణం పాట అందుకు గొప్ప ఉదాహరణ. రామాయణం,భాగవతం ఆయన చేతుల్లో సజీవ,రమణీయ కావ్యాలుగా మారాయి.Bapu Bommalu 6114

bapu3“చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వ పెట్టి,సందె మసక చీర కట్టి”…అబ్బ ఎంత చక్కని పదాలు,ఇంత చక్కని తెలుగు తెనేలని మనకి ఇచ్చిన మనిషి ఎలా చనిపోగలడు.”ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట”… అని కన్నె పిల్ల మనసుని,ఆ మనసులో ఉండే వెచ్చ వెచ్చని కోరికలని ఎంత చక్కగా తెరమీద చూపించాడు.సాక్షి,ముత్యాల ముగ్గు,అందాల రాముడు,రాజేశ్వరి విలాస్ కఫీ క్లబ్,గోరంత దీపం,పెళ్లి పుస్తకం,మిస్టర్ పెళ్ళాం,అన్ని కూడా పిల్లలకి పెద్దలకి పెట్టని పాఠాలు.కాదంటారా?జీవిత సారం వాటిలో లేదంటారా?ఆయన సినిమాలు మనసు తో చూడాలి అంతే.బాపు గారి అభిమాని అంటే వాళ్ళు కచ్చితంగా కళాపోషణ ఉన్నవాళ్ళే.

10489770_737053366340929_97299737144197458_nఇంక అమర మిత్రులు ముళ్ళపూడి వెంకట రమణ ,బాపు గారి స్నేహం అందరికి ఆదర్శనీయం.ఇద్దరూ ఇడ్లి, పచ్చడి లాంటి వాళ్ళు.ఏ ఒక్కటి లేకపోయినా ఇంకోదానికి విలువా రుచి లేనట్టే.వారి అపూర్వ సృష్టి బుడుగు,ఎన్ని తెలుగు ఇళ్ళల్లో కమ్మని,అమాయకమైన,చిలిపి, అల్లరి,తుంటరి నవ్వులను పోయించిన్దో, పూయిస్తోన్దో.
మనందరినీ వారితో పాటూ వారి జీవితాల్లోకి తీసుకెళ్ళి మనచేత కూడా “కోతి కొమ్మచ్చి” ఆడిపించి,బాధలని కష్టాలని కూడా సరదాగా తీసుకూవాలనే విషయాన్నీ ఎంతో హుషారయిన మాటలతో,చిలిపి బొమ్మలతో చెప్పిన మిత్ర ద్వయం” బాపూ రమణ.”10487275_734603759919223_6263164803680214114_n

10559660_737053689674230_3666096030569402862_nఆ నవ్వులు,ఆ గీతలు,ఆ రాతలు,ఆ కదిలే బొమ్మలు మేము ఎప్పటికి మరచిపోము.అలాగే మిమ్మల్ని కూడా.మీరెక్కడ వున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని
కోరుకుంటూ …..
మీ అభిమాని మరియూ మీ ఏకలవ్య శిష్యురాలు.

 

55793d6f4d75dd46a075bb2c5445fe74-5

 

GO GREEN ON THIS GANESH CHATURTHI

GANESH (1)ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం ఆచరించడం మన సాంప్రదాయం.గజ ముఖం తో, చిరు బొజ్జ తో,వుండే వినాయకుడంటే అందరికి ఎంతో ప్రీతి.వినాయక రూపం జ్ఞానానికి ,సంపదకి,విజయానికి చిహ్నం.విఘ్నరాజాదిపతి అయిన వినాయకుడిని పూజిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనందరికీ తెలిసిందే.కాని వినాయక రూపం మనకి ఏమి చెప్తోంది? ఆ రూపం వెనుక గల అతరార్ధం ఏమిటి?

చాటల్లాంటి చెవులు ,తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని చెప్తున్నాయి ,సూదంటు చూపులు ఎ విషయాన్నయినా నిశితంగా పరిశీలించమని చెప్తున్నాయి,తొండం మనమంతా ఓంకార నాదం నుండి పుట్టామని చెప్తోంది,చిరు బొజ్జ జ్ఞానాన్ని గ్రహించమని చెప్తోంది.మొత్తానికి విఘ్నేశ్వర రూపం సత్ప్రవర్తనకి,జ్ఞాన సముపార్జనకి,విచక్షణ కి ప్రతీక.

1భాద్రపద మాసం లోనే ఎందుకు?
ప్రతి కార్యం ముందు వినాయకుడిని పూజిస్తుంటాం.కాని భాద్రపద మాసం లోనే ఎందుకు వినాయక చవితి జరుపుకుంటారు? ఎందుకంటే భాద్రపద మాసం లో వర్షాలు బాగా పడి చెరువులు నిండుకునే సమయం.ఈ వేళలో వినాయక విగ్రహాల కోసం చెరువులో వుండే మట్టినే వాడేవాళ్ళు.నెల రోజుల ముందే మట్టిని తవ్వడం వలన చెరువు పూడిక తీసినట్టు అవుతుంది,వర్షపు నీళ్ళు ఎక్కువగా నిలువ చేసినట్టు అవుతుంది.వర్షాదారమైన పంటలు రైతులు మొదలు పెట్టె సమయం కూడా.ఇది రైతులకు మరియు పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైన విధానం.తిరిగి పూజ అయిపోయిన తర్వాత ప్రకృతి నుండి తీసుకున్న దానిని ప్రకృతికే ఇచ్చెయ్యాలి కాబట్టి దేవుడిని తిరిగి నిమర్జనం చేస్తాం.ఆ విధంగా సాయిల్ ఎరోషణ్(soil erosion) కాదు.పైగా దేవుడికి వాడిన పత్రి,పూలు,అక్షింతలు నీటిలో వుండే ప్రాణులకు ఆహారంగా ఉండేవి.

ప్రస్తుత పరిస్థితి:
chauthi-5అసలు వినాయక పూజ వెనుక రహస్యం ఇదని తెలుస్తోంది.కాకపోతే ప్రస్తుతం ఈ పూజ చేసే విధానంలో ఎంతో తేడా వచ్చింది,ప్రతి వీధి వారు పక్క వీధి వారితో పోటి పెట్టుకొని మరీ విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు.మా వినాయకుడు పెద్ద అంటే మా వినాయకుడు పెద్ద అని గొప్పల కోసం పూజ చేస్తున్నారు.దీని వల్ల విగ్రహాల సంఖ్య బాగా పెరిగిపోతోంది.వీటి నిమర్జనానికి ప్రదేశాలు చాలనంతంగా విగ్రహాలు పుట్టుకొస్తున్నాయ్.ప్రజల నమ్మకాలతో కూడుకున్న విషయం కనుక ప్రభుత్వం కుడా ఏమి చెప్పలేకపోతోంది.

అందుకని మనమే ఈ సమస్య గురించి ఆలోచించాలి.ఒక్కసారి మన ప్రకృతిని,పర్యావరణాన్ని గురించి అలోచించి భక్తి తో వినాయక పూజని చేసుకుందాం.ఎంత పెద్ద దేవుడిని పెట్టాం అనే దానికన్నా ఎంత శ్రద్ధతో పూజ చేసాం అనే విషయాన్ని గురించి ఆలోచించండి.వీధి రాజకీయాల నుండి వినాయక పూజని కాపాడండి తద్వారా మన పర్యావరణాన్ని కుడా కాపాడండి.2880348028_0d2afd2343

ఇంకో ముఖ్యమైన విషయం,మట్టి వినాయకులనే వాడుదాం.దయచేసి ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వాడుకను నిర్మూలిద్దాం.వాటి వాడకం వల్ల కలిగే నష్టాలూ ఎన్నో ఎన్నెన్నో.ఇప్పటికి మనం కోల్పోయింది చాలు.ఇకనైనా మట్టి విగ్రహాలను మాత్రమే కొందాం.

visarjan

మనమేం చెయ్యొచ్చు:

  • మట్టి వినాయకుడిని పూజిద్దాం.వీలైతే మన ఇంట్లోనే బకెట్టు నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆ నీటిని చెట్లకి పోద్దాం.ఇది కూడా దేవుడిని తిరిగి ప్రకృతికి ఇవ్వడమే కదా.
  • చందాలు ఇచ్చి వినాయకుల్ల సంఖ్యని పెంచకండి.
  • నిమజ్జనం రోజు ప్లాస్టిక్ కావర్లని నీటిలో వదలకండి.
  • వీలైనంతగా నీటి కాలుష్యాన్ని,శబ్ద కాలుష్యాన్ని తగ్గించండి.

తెలిసిన వారు తెలియని వారికి చెప్పి ఈ పర్యావరణానికి మనవంతు సాయం చెయ్యండి.అందరికి రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు.