Home Blog Page 2

పడమటి తీరాన ఓ కోయిల

పడమటి తీరాన ఓ కోయిల

 

Story Published in  TANA 22nd Souvenir 2019

ఏ ప్రత్యేకతా లేని ఒక మాములు బుధవారం. మెల్లగా ఒక్కొక్కరే వచ్చి తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. గుడ్ మార్నింగ్ పలకరింపులు, చిరు నవ్వులు, తల పంకింపులు అన్నీ అయ్యాక తమ తమ పనులలో బిజీ అవుతున్నారు. కేలండర్ లో ఇంకో రోజు కరిగిపోడానికి సిద్ధపడుతోంది. ఎప్పుడూ పని తప్ప ఇంకో ధ్యాస లేదు అనేట్టు ఉండే అనిత, ఆరోజు ఎక్కడో ఏవో ఆలోచనల్లో చిక్కుకుపోయినట్టు కనపడుతోంది. మాటి మాటికీ కిటికీలోంచి ఎక్కడికో లాగేస్తోన్న చూపులని బలవంతాన స్క్రీన్ పైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. తను రోజూ ఎంతో గర్వంగా కూర్చునే సీట్ ఆరోజు ఎందుకో గుచ్చుకుంటున్నటుగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో సాధించిన ప్రాజెక్టులకి, చేరిన టార్గెట్లకి గుర్తుగా వచ్చిన మొమెంటోలు, సౌవనీర్లతో ఎంతో ఆర్టిస్టిక్ గా పెట్టుకున్న తన క్యూబికల్ ఈ రోజు ఇరుగ్గా తోస్తోంది ఆమెకి.  కీ బోర్డు మీద టక టక లాడే చేతులు, మెల్లిగా శబ్దాలు చేసే ప్రింటర్లు, ఫాక్స్ మెషిన్లు, ఇటు అటూ తిరుగుతూ ఉండే కొలీగ్స్ …. ఈ హడావిడి వాతావరణం అంటే ఎంతో ఇష్టం అనితకి. తను ఎంతో కష్టపడి చేరుకున్న స్థానానికి చిహ్నాలు ఇవన్నీ. కానీ ఈ రోజొదెందుకో ఈ శబ్దాలు, ఈ హడావిడి అంతా గందరగోళంగా, ఊపిరాడని ఇరుకు గదిలో చిక్కుకుని పోయినట్లుగా తోస్తోంది ఆమెకి. ఆఫీస్ రూమ్ అంతా కుదించుకుపోయి, నాలుగు వైపుల నుండీ తనని ముంచేస్తున్న భావన. ఊపిరాడని, కంటికి కనపడని నిర్బంధం.

డెస్క్ పైన ఒక మూలగా పెట్టిన ఫ్రేములో ఆనందంగా, ఏ కల్మషం లేకుండా గుండెలనిండుగా నవ్వుతున్న ఇద్దరు పిల్లల ఫోటో. అనిత పిల్లలు వాళ్ళు. నిహాల్, నేహా. ముఖ్యంగా నేహా కళ్ళల్లో ఆ చిలిపిదనం, పద్దెనిమిదేళ్ల ప్రాయపు ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కాసేపు అలా తన ఇద్దరు పిల్లల ఫోటోని చూస్తే చాలు అప్పటివరకు ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోయి నిమిషంలో హుషారు వచ్చేస్తుంది అనితకి. కానీ ఈ రోజు అందుకు వేరుగా ఉంది ఆమె పరిస్థితి. అందుకు కారణం నిన్న రాత్రి అనుకోకుండా విన్న నేహా మాటలు.

“హలో, అమ్మా. థాంక్స్ అమ్మ. నేనే చెప్దామనుకున్నాను. ఇంతలో ఎలా తెలిసిపోయింది నీకు?” నేహాకి అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో వచ్చిందని అమ్మకి చెప్పాలనుకున్న వార్త ముందుగానే అమ్మకి తెలిసిపోయిందనే ఆశ్చర్యం, ఆశాభంగం కలగలిపి అడుగుతోంది అనిత.

“నేహా వాట్సాప్ చేసింది నాకు. సో ప్రౌడ్ ఆఫ్ హర్. వాళ్ళ తాతయ్య గిఫ్ట్ ఇస్తాను అంటే, తనకి ఏం కావాలో ఆలోచించుకుని చెప్తాను తాతయ్య అని చెప్పిందిట.”

“ఓ…. నైస్. అవును మా. అప్పుడే తను తీస్కోవాలకున్న కోర్సెస్, డార్మ్ కి కావలసిన సామాను, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా ఒక జర్నల్ లో ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది. మేము జస్ట్ మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు. ఉంటానమ్మా బై” అంటూ ఫోన్ పెట్టేసి నేహాని డిన్నర్ కి లాక్కొద్దామని పార్టిషన్ డోర్ తెరిచింది అనిత.  బాల్కనీలో నిల్చుని తన విజయాన్ని తన చిన్ని ప్రపంచంతో పంచుకోవాలని ఆరాటపడుతూ, ఆగకుండా వస్తున్న ఫోన్లతో, మెసేజీలతో కుస్తీ పడుతోంది నేహా. అనుకోకుండా అలా రావడంతో నేహా మాటలు చెవిన పడ్డాయి అనితకి.

“మై పేరెంట్స్ … నో వే… దే ఆర్ సో బోరింగ్ మాన్ ” అంటూ భుజాలు కదిలిపోయేలా నవ్వుతోంది నేహా. ఎంత మోడరన్ పేరెంట్స్ అయినా, ఒక్క నిమిషం మనసు చివుక్కుమంది అనితకి. అలికిడికి వెనక్కి తిరిగి అమ్మని చూసి, “ఒక టూ మినిట్స్ మా” అని గోముగా సైగ చేసింది. ఫోన్ పెట్టేసి ఇవతలికి వచ్చి తల్లిని వెనగ్గా గట్టిగా కౌగిలించుకుంది. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టలేని వయసు అది. పిల్లలకి వడ్డించి తను కూడా కూర్చుంది అనిత.

“మా…. నాన్న రాలేదా ఇంకా?” నిహాల్ అడుగుతున్నాడు.

“కాస్త బిజీ వర్క్ అంట. లేట్ అవుతుంది అన్నారు. వీకెండ్ ఫామిలీ డిన్నర్ కి వెళ్దాం అన్నారు. అక్క సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి కదా! ” పిల్లల్ని చూస్తూ సంజాయిషీగా అంది అనిత.

“ఆస్ ఆల్వేస్!” అంది నేహా భుజాలెగరేస్తూ. తన ఇంస్టా గ్రామ్ అకౌంట్ చూపిస్తూ, “అమ్మా మా ఫ్రెండ్, వాళ్ళ పేరెంట్స్ డాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో చూడు. సో క్యూట్ కదా! దాట్స్ సో రొమాంటిక్! ఈ రోజు మా గ్యాంగ్ లో అంతా ఈ టాపిక్కే నడిచింది.” గలగలా పారే సెలయేరులా చెప్తూనే వుంది నేహా. ఓ ఇదన్న మాట ఇందాక తమకి “బోరింగ్” అన్న బిరుదు రావడానికి కారణం అనుకుంది అనిత.

పిల్లలంతకై పిల్లలు చెప్తే కానీ ఏదీ రెట్టించి అడగడానికి లేదు. మనసుకి, నోటికీ ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. ఏమాత్రం అటూ ఇటూ తూలి మాట్లాడినా హర్ట్ అయిపోతారు. రకరకాల జాతుల పేరెంటింగ్ మధ్య పెరిగిన పిల్లలతో స్నేహాలు. ఏ మాటకి ఎలా అర్ధం తీసుకుంటారో తెలీదు. ఆచి తూచి ఉండకపోతే లేత హృదయాలు ఎటు దారి తప్పుతాయో అనే భయం. పేరెంటింగ్ లో కూడా అప్డేట్ అవుతూ జాగ్రత్తగా నెట్టుకొస్తోంది.

అలా నేహా నోటి వెంట వచ్చిన “బోరింగ్” అనే పదం దగ్గరే ఆగిపోయింది అనిత మనసు. ఎంతో పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉంటూ కెరీర్ వైస్ గా, సోషల్ సర్కిల్ వైస్ గా ఆక్టివ్ గా ఉంటూ చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనుకుంటున్న అనితని ఆలోచనలో పడేసింది ఆ మాట. ఒక్కసారి మళ్ళీ ఫోటోలో ఉన్న “నేహా” వైపు చూసింది. అంతా తన పోలికే. ఇరవయ్యేళ్ళ క్రితం తనని తాను చూసుకున్నట్లే ఉంది అనితకి. అప్పటి తనలో ఎంతటి హుషారు, ఎంతటి చలాకీతనం. ప్రపంచంలో ఉన్న జీవశక్తి అంతా తనలో ఉందా అన్నట్టు ఉండేది. ప్రకృతిలో ఉండే ప్రతి చిన్న సంగతీ తనని స్పందింపచేసేది. కోయిల కూసినా, గాలికి కొబ్బరాకు గలగలలాడినా కదిలిపోయేది. మబ్బు మసకేసి వెన్నెలని దాచేస్తే బాధపడేది. అమ్మమ్మ ఇంట్లో పాలు పిండడానికని ఆవు దగ్గర పొడిచి పొడిచి పాలు తాగుతున్న దూడని లాక్కెళుతుంటే ఎంతలా విలవిలలాడేదని.  మళ్ళీ పాలు పిండేసాక వదిలిన దూడ తోక ఎత్తి పరుగు పరుగున తన అమ్మని చేరితే అంతే సంబరపడేది. ఏమైపోయింది ఆ అనిత. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడి చేసే అనిత, గట్టు తెగిన గోదారిలా కబుర్లు చెప్పే అనిత, చెట్టుని పుట్టని ప్రతీ పిట్టనీ స్నేహంగా పలకరించి మురిసే అనిత, ఏమైపోయింది. కాలం గిర్రున తిరిగీ తిరిగీ ఇదిగో ఇక్కడ ఇలా నిలబెట్టింది తనని …. “బోరింగ్” అనిత గా. ఇక ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండలేకపోయింది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే పిచ్చెక్కిపోయేలా ఉందని, బాస్ కి ఒంట్లో బాగోలేదని మెయిల్ పెట్టి, కిందవారికి ఇవ్వాల్సిన వర్క్ ఇచ్చేసి బయట పడింది.

ఇంటికి వచ్చేసి స్ట్రాంగ్ గా కాఫీ చేసుకుని గార్డెన్ కి ఎదురుగా బీన్ బాగ్ వేసుకుని కూర్చుంది అనిత. నేహా “బోరింగ్” అన్నందుకు బాధ లేదు తనకి. ఇప్పటి పిల్లలు అంతే, ఏదీ మనసులో పెట్టుకోరు. “ఐ హేట్ యూ మామ్” అని తలుపులు ధడేలున మూసిన బిడ్డ, పది నిమిషాల్లో “యూ ఆర్ ది బెస్ట్” అని హత్తుకోవడం తెలుసు తనకి. తను ఇప్పుడాలోచిస్తోంది తనకి తెలీకుండా తాము “బోరింగ్” ఎప్పుడు అయ్యామా అని! పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక పెద్దరికం తెచ్చుకుని, హుందాతనం ముసుగు వేసుకున్నాకా?  లేక పిల్లల్ని బాగా చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అని తమని తామే డబ్బు అచ్చు చేసే యంత్రాల్లా మార్చేసుకున్నాక? లేక ఆనందం అంటే వీకెండ్ లో ఒక ఫ్యామిలీ డిన్నర్, సమ్మర్ లో ఒక వెకేషన్, సోషియాలజీ ప్రాజెక్ట్ లో భాగం అయినట్టు ఒక ఇండియా ట్రిప్, అని లెక్కలు వేసుకుని గుడ్డిగా ఆ రూల్స్ ని యాంత్రికంగా ఫాలో అయిపోతున్నందుకా?

కాదు. ఇందుకు కాదు. నేహా అన్నది మా ‘ఇద్దరినీ.’ పిల్లలు, కుటుంబం, సోషల్ లైఫ్, వర్క్ లైఫ్ ఇన్నిటిని మానేజ్ చేస్తూ ఒకరినొకరం మర్చిపోయిన మమ్మల్ని. ఎదుగుదలని బ్యాంకు బాలన్స్ తో, స్థిరాస్తుల పోగుతో ముడివేసి, మొబైల్ రిమైండర్లతో అనుబంధాలని మెయింటైన్ చేస్తూ, అలారం మోతలకి, లంచ్ బాక్స్ లకీ, పిక్ అండ్ డ్రాప్ లకీ, గ్రోసరీ షాపింగులకి మధ్య నలిగిపోయిన తమ బంధాన్ని. ఒకే కప్పుకింద ఉంటూ హడావిడిగా, ఎవరో చెప్పిన ప్రామాణాలకి తగట్టు బతకడానికి పరుగులెడుతూ ఒకరినొకరం మర్చిపోయిన మమ్మల్ని. మబ్బులు తొలగి బయటపడ్డ సూర్యకాంతిలాగా అసలు కారణం ఏంటో అర్ధం అయింది అనితకి.

చక చకా ఏదో గుర్తొచ్చిన దానిలా పరుగున వెళ్లి స్టోరేజ్ లో ఉన్న బాక్స్ ఒకటి తెరిచింది అనిత. గడిచిన జీవితం తాలూకు జ్ఞాపకాలు పేరుకుపోతూ రాగా, కొత్త వాటికి చోటివ్వడానికని జాగ్రత్త చేసిన ఒకప్పటి ప్రియమైన వస్తువులు. అడుగున ఎక్కడో ఉంది తాను వెతుకున్నది. చేతుల్లోకి తీసుకోగానే తనతో పాటు ముడివేసుకున్న అనుభూతుల వెంట పరుగులు తీయించిన చీర, తన పెళ్ళిచూపుల నాటి చీర. ఒక్కసారి ఆ చీర మెత్తదనాన్ని బుగ్గలకి తాకించుకుంది, ఇన్నేళ్లు మర్చిపోయిన తనలోని ఒకప్పటి అనితని వెతకడానికా అన్నట్టు!  లేత కనకాంబరం రంగు షిఫాన్ చీర. సన్నని బంగారపు అంచు ఉన్నది. ఆరోజు తనకి బాగా గుర్తు …పిన్నులతో ఎక్కడా జారిపోకుండా పకడ్బందీగా చీర కట్టుకుని, ఇంత బారు జడలో ఒకే ఒక్క రోజా పూవు పెట్టుకుని కాటుక దిద్దుకుంటుంటే, వెనగ్గా వచ్చి నిల్చున్న అమ్మ అలాగే కాసేపు చూస్తూ నిలబడిపోయింది. అప్పుడప్పుడూ తను నేహాని చూస్తుందే అచ్చం అలాగే…. తమలో మాయమైన భాగమేదో తిరిగి ప్రాణం పోసుకుని తమ కళ్ళముందే తిరుగాడుతుంటే సంభ్రమంగా చూస్తున్నట్టు.

ఆరోజు కలిసింది అతన్ని. “పెళ్లి చూపుల్లో కొన్ని నిముషాలు మాట్లాడుకుని ఎలా డిసైడ్ చేసుకుంటారమ్మా పార్టనర్ని?” అని నేహా అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటుంది. ఏమో ఎలా తెలిసింది తనకి? తన ఒరవడిని తట్టుకుని నిలకడని ఇవ్వగలడు అతను అని. ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి అని పెరట్లోకి పంపించినప్పుడు, నంది వర్ధనం చెట్టు కింద మౌనంగా ఉన్న రెండు నిముషాలు, కొబ్బరి చెట్టు కింద చూపులు కలిపిన క్షణాలు, తరువాత సన్నజాజి పందిరి దగ్గర విరిసిన నవ్వులు. ఆ మొదటి చూపుల్లో ఎంత మాయ ఉందనీ. నూరు వరహాల చెట్టు పక్కగా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఒక కాలు పెరటి వైపు గోడకి ఆనించి ఏవో మాట్డాడుతున్న అతన్ని, బట్టలుతికే రాయిపైన కూర్చుని అత్యంత శ్రద్ధగా విన్ననన్నూ ఎలా మరచిపోయాను?… అనుకుంటూ మర్చిపోయిన ఆనాటి రోజులని, తమ బంధాన్ని సమీక్షించుకుంటోంది అనిత.

పది నిమిషాల మాటల్లోనే ఎంత దగ్గర మనిషి అనిపించాడు. ఎలా తెలిసింది తనకు? అప్పటి మొదలు ఇద్దరం కలిసి ఎన్ని జ్ఞాపకాలని పోగుచేసుకున్నాము. పెళ్లి వరకు ఉన్న మూడు నెలల వ్యవధిలో ఎన్నెన్ని ఊసులు, ఎన్నెన్ని కబుర్లు. సంతోషానికి, అల్లరి నవ్వులకి, చిరునామాలా ఉండేవాళ్ళం. ప్రపంచం మొత్తం ఉన్నది మమ్మల్ని ఆనందింపజేయడానికే అన్న ధీమా. అసలు మేమే ప్రపంచం అనుకునేంత వెర్రి ప్రేమ. ఈ చనువుతో జరిగిన పెళ్ళి. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అన్న భావనే లేదు అసలు. తప్పిపోయిన రెండు జిగ్ సా పజిల్ ముక్కల్ని కనిపెట్టి అతికించినంత సులువుగా కలిసిపోయాం. ఎక్కడ చూసినా మేమే, ఎటు చూసినా ప్రేమే అన్నట్టు ఉండేవాళ్ళం కదూ. ఎటెల్లిపోయాడు తను?

గుండెలపైన గుప్పెడు మల్లెలు చల్లినట్టు నవ్వే వాడు. ఒకసారి సెలయేటి ప్రవాహంలా, ఒకసారి సముద్రపు ఉప్పెనలా ఎన్నెన్ని రకాలుగా తనని ప్రేమించేవాడనీ. ఆ జలపాతపు హోరులో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే వెంటనే ప్రశాంతమైన కొలనులా అక్కున చేర్చుకునే వాడు కదూ. ఏమైపోయాడు తను?  అతను కూడా తనలో మాయమైన భాగాన్ని వెతుక్కుంటున్నాడా? అసలు తను మారిపోయాడన్న ఆలోచన అయినా వచ్చిందా తనకి. నాకు మాత్రం వచ్చిందా? ఎదురెదుగా ఉంటే చాలు, కలసి ఒక ఇంట్లో ఉంటే చాలు అనుకునే స్టేజ్ కి ఎప్పుడు వచ్చాము అసలు? చీర మడతల్లోంచి జారిన ఫోటో ఒకటి చేతిలోకి తీసుకుంది. పెళ్ళైన కొత్తల్లో కాశ్మీర్ లో తీసుకున్నది. కాశ్మీర్ బట్టల్లో, చేతిలో బుట్టతో అందంగా నవ్వుతున్న తనని, అతను వెనుక నుండి వాటేసుకుని తీసుకున్న ఫోటో.

ఎన్ని రోజులైంది అతను ఇలా నవ్వి? గుర్తు చెయ్యాలి … తనకే తెలీకుండా ఎంతలా మారిపోయాడో గుర్తుచెయ్యాలి. అప్పటి అల్లరి నవ్వులని ఒకసారి గుర్తు చెయ్యాలి, అనుకుంది. అనుకున్నదే తడవుగా వెంటనే లేచి ఫ్రెషప్ అయింది అనిత. పెళ్లిళ్ల కోసమో, పార్టీల కోసమో, ఆఫీస్ మీటింగుల కోసమో కాకుండా అచ్చంగా అతని కోసమే రెడీ అయింది. నిజమే! అతని కోసం, తనని కలవడం కోసం మాత్రమే రెడీ అయ్యి కూడా ఎన్ని రోజులైంది. ఇష్టమైన వారిని కలుసుకునే క్రమంలో ఉండే ఉద్విగ్నత అనుభవించి ఎన్ని రోజులైంది. అనిత అతన్ని కలవడం కోసం బయల్దేరింది. తెలియని సంచలనం ఎదో సీతాకోక చిలుకల రెక్కల సందడిలా కొట్టుకోవడం మొదలయ్యింది కడుపులో. ఇప్పటికిప్పుడు అతని చేతుల్లో వాలిపోవాలనే ఆతృత నెలకొంది. ఇంకో గంట గడిస్తే కానీ చేరలేను అతన్ని, అనే ఆలోచనే భరించలేకపోతోంది. ఇన్నేళ్లు గంటలు గంటలు క్షణాల్లా దొర్లించేసిన తను, మళ్ళీ క్షణాలు యుగాల్లాగా తోస్తున్న ఈ బాధని సరికొత్తగా అనుభవిస్తోంది. చూడాలి, అతన్ని చూడాలి అన్న ఆలోచన మాత్రమే. కార్ తీసి అతని ఆఫీస్ అడ్రెస్స్ గూగుల్ మ్యాప్స్ లో పెట్టి, తన మనోవేగంతో సంబంధం లేని ట్రాఫిక్ లో బయలుదేరింది అతని దగ్గరికి.

దారి పొడవునా తాను ముందుకు వెళ్తుంటే ఇన్నేళ్లలోని జ్ఞాపకాలు, సంతోషపు క్షణాలు ఒక్కొక్కటే పలకరించి నవ్వుతూ వెనక్కి వెళ్లిపోతున్నాయి, ఇంకాస్త విరహాన్ని పెంచుతూ. పెళ్ళికి ముందు ఎవరికీ చెప్పకుండా ఒకసారి ఊరిచివర తోటలోని శివాలయానికి వెళ్లిన సంగతి గుర్తొచ్చింది అనితకి. కాలేజ్ అయిపోయే సమయానికి ఇంటికి చేరొచ్చులే అని. ఎవరికి తెలుసు వాళ్ళు వచ్చిన బైక్ ఫెయిల్ అవుతుందనీ. ఆ బైక్ ని పూజారి గారింట్లో వదిలేసి ఆ ఊరుగాని ఊరిలో లాస్ట్ బస్సు పట్టుకుని ఇంటికి చేరేసరికి పది గంటలు. రాత్రి తొమ్మిది తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో తెలీని నాన్న పెంపకం. “ఇంటికి వెళ్ళను, నాన్నను చూడలేను ఎటైనా పారిపోదాం” అని రాగాలు తీస్తున్న తనని ఇంటికి తీస్కుని వచ్చి దింపాడు. అగ్నిహోత్రంలా ఉన్న నాన్నని దాటుకుని లోపలికి పరిగెట్టి అమ్మతో మొట్టికాయలు తిని బయటికి వచ్చి చూసేసరికి ఏముంది, ఏమి చెప్పాడో ఏమో ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అతను వెళ్ళాక నాన్న నా తలపై ప్రేమగా నిమిరి నిశ్చింతగా చూసిన చూపు మరచిపోగలనా! విడిచి వెళ్లే ప్రతి సారీ “ఉంటాను అమ్మాయ్!” అంటూ తన చేతిలోకి నా చెయ్యి తీసుకుని నొక్కి వదిలే ఆ ప్రేమని ఎలా మర్చిపోయాను. నా కోసం, మా కోసం, ఇప్పుడు కుటుంబం కోసం తనని తాను మరచిపోయి పరుగులు తీస్తున్న మనిషిని ఎలా మర్చిపోయాను… ఇలా ఒక్కసారిగా అతని గురించిన ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా శరీరంలో ప్రతి అణువు నిద్రలేచి మరీ అతని కోసం చూస్తున్నట్టు అనిపించింది అనితకి.

సాయంకాలం తీసుకునివచ్చే చీకట్లకి తన దగ్గర తావు లేదన్నట్లుగా నియాన్ లైట్ల వెలుగుల మధ్య ముస్తాబయ్యి మెరిసిపోతోంది సాన్ ఫ్రాన్సిస్కో నగరం …తన లాగే ఎవరో ప్రియమైన వారికోసం ఎదురుచూస్తున్నట్లుగా. కార్ పార్క్ చేసి మెసేజ్ చేసింది తనకి. రిప్లై వెంటనే రాదు …తనకు తెలుసు. అఫీస్ …బిజీ…బ్లా బ్లా బ్లా!

మాములుగా అయితే చికాకు పడేదే … ‘ఎప్పుడూ ఏమి పట్టించుకోడని’… అందుకే కదా తాను కూడా అంతే బిజీగా మారిపోయింది. ఇప్పుడు చికాకు లేదు. పందొమ్మిదేళ్ళ క్రితం అతని కోసం కాలేజ్ బస్టాప్ దగ్గర ఎదురు చూసినప్పటి ఉద్వేగం తప్ప.

కాల్ చేసింది!

కట్ చేసాడు!

చేస్తాడని తనకు తెలుసు, మీటింగ్ లో ఉండి ఉంటాడు. తను మళ్ళీ చెయ్యకపోతే అసలు కాల్ చేశానన్న విషయం కూడా తనకి గుర్తుండదనీ తెలుసు.

ఈ బిజీనేగా తమని మార్చేసింది, పంతాలకి పోయేలా చేసింది. ‘డిపెండెన్సీ’, ‘ఇండిపెండెన్సీ’ అని ఏవేవో తమ మధ్యలోకి తీసుకుని వచ్చి ఈగోలని పెంచింది.

కానీ ఈసారి కోపం రాలేదు, అసహనం అస్సలే లేదు. ‘పట్టించుకోడు, అందరి మగాళ్లలాంటి వాడు’ అని ఒకతాటికి కట్టేసి తిట్టుకోలేదు ఈసారి. ఎదురుచూసింది.

పెళ్లైయ్యాక మొదటి సారి అమ్మావాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తనని తీసుకెళ్లడానికి వస్తానన్న ఈ మనిషి కోసం ఒళ్ళంతా కళ్ళు, చెవులు చేసుకుని, పరధ్యానంగా ఉండి అమ్మ దగ్గర చివాట్లు తిని ఒకప్పుడు ఎదురుచూసినంత ఓపికగా ఎదురుచూస్తోంది ఇప్పుడు.

ఏ రెస్పాన్సు లేదు … ఉండదు, తెలిసిందే కదా మనంత మనం తెచ్చిపెట్టుకున్న బిజీ.

మళ్ళీ కాల్ చేసింది… వాయిస్ మెయిల్.

ఇంకోసారి …!

ఈసారి ఒక మెస్సేజ్. ” ఈజ్ ఎవెరీథింగ్ ఆల్ రైట్? బిట్ బిజీ! ఎనీ ఎమర్జెన్సీ?” అని.

“ఎస్ … అర్జెంట్ …వెంటనే ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలి”

“కమాన్! ఆర్ యూ ఓకే! మిడ్ వీక్ ఇష్యూస్ లో ఉన్నాను. ”

“మీ ఆఫీస్ దగ్గరగా ఉన్నాను…వస్తావా! ఉహు …రా …రావాలి … రా చిన్నూ!”టైప్ చూస్తుంటేనే గొంతులో ఎదో అడ్డొచ్చినట్టు ఉంది అనితకి. ఎన్ని ఏళ్లైయింది అలా పిలుచుకుని.

వెంటనే మోగింది తన సెల్…. “నాకు తెలుసు… అతను మర్చిపోలేదు…మరిచిపోలేడు కూడా. నేనే గుర్తుచెయ్యలేదు ఇన్ని రోజులు. గుర్తుతెచ్చుకునే అవకాశం ఇవ్వలేదు ఎప్పుడూ,” అనుకుంటూ తనలో చెలరేగుతున్న సంచలనాన్ని అదుపుచేసుకుంటూ ఫోన్ ఎత్తింది అనిత.

“ఆర్ యూ సీరియస్ … సాన్ ఫ్రాన్సిస్కో వచ్చావా? ”

“హ్మ్మ్ ”

“ఎక్కడున్నావ్”

“మీ ఆఫీస్ కి ఎదురుగా … నార్త్ సైడ్ వస్తున్నా.”

ఆపైన కట్ చేసేసాడు.

పెయిడ్ పార్కింగ్ లో కార్ పెట్టి నడుస్తోంది అనిత వడి వడిగా. ఎత్తులు పల్లాల మీద కట్టిన సాన్ ఫ్రాన్సిస్కో నగరం. ఎటు వైపు చుసినా ఆకాశాన్ని అంటే అద్దాలమేడలే. తన కోసం వస్తానన్న రాకుమారుడు అలసిపోయి ఎంతకీ రాకపోయేసరికి అతని కోసం అద్దాలమేడ లోంచి రాకుమారే వెళ్ళింది ఈసారి.

ఈ కింది నుండి ఏటవాలుగా ఆ పైకి ఒక ఐదు నిముషాలు నడిస్తే అతని ఆఫీస్. పెడిస్ట్రియన్ సైన్ పడగానే హడావిడిగా పరుగులు పెడుతున్న జనం. వారి మధ్యలో నడుస్తూ, చిన్నగా పరిగెడుతూ వెళ్తోంది. అదిగో అక్కడే ఉన్నాడు అతను, ఆ పైన. మబ్బుల పువ్వుల్లాంటి చెర్రీ పూల చెట్టు కింద, తోరణంలా వేళ్ళాడుతున్న ఎలక్ట్రిక్ బల్బుల కింద. అనిత కనపడగానే రెండు చేతులు జుట్టులోకి పోనిచ్చి ఆశ్చర్యంగా సంభ్రమంగా ఆమె వైపు చూస్తూ. అడుగుల దూరానికి వచ్చేసారు. చెయ్యి చాపాడు… అందుకోకపోతే ఇదంతా కలలోలాగా ఎక్కడ మాయమైపోతుందో అన్న భయంతో వణికే కాళ్లతో ఎక్కడ పడిపోతానో అన్న ఆతృతతో వెంటనే అతని చేతిని అందుకుంది అనిత. అందుకోగానే అప్పటి వరకు తాను పడ్డ సంఘర్షణని మాటల్లో చెప్పలేను అన్నట్టుగా గట్టిగా కౌగిలించేసుకుంది. ఏ భాషకీ అందని ఊసులు ఏవో కలబోసుకోవాలి అన్నట్టు కలిసిన పెదవులు. విడివడుతూ ఉండగా చూసింది అతని కళ్ళలోకి, తాను వెతుకుతున్న దాని కోసం.  జుట్టు పలచబడినా, కొలతలు మారినా ఏ కాలం ఎన్నటికీ మార్చలేని ఆ కనులలో మెరుపుని. అప్పటి అనితకి ‘ఇతను తనకోసమే’ అన్న భావన కలిగించిన ఆ చూపుని. ఇన్నేళ్లు తాను చూడడం మర్చిపోయిన, చూడాలి అనుకోవడం కూడా గుర్తులేకుండా పోయిన ఆ మెరుపు…. అదిగో. తనలో ఉన్న పాత “అనీ” ని మేల్కొల్పే తను.

“మిస్ యూ, చిన్నూ! మిస్డ్ మైసెల్ఫ్ టూ!” అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది అనిత.

ఎలా వచ్చిందో, ఎవరు తెచ్చారో… ఎక్కడో దూరంగా తూర్పు వైపు నుండి వచ్చిన కోయిల ఒకటి ఈ పడమటి తీరాన తియ్యగా కూస్తోంది.

 

Srinidhi Yellala

 

 

 

 

అదంతా ఒక ఇదిలే

When someone disturbs my “ME TIME”😖😣

scene 1:
“ఎవ్వడి కోసం ఎవడున్నాడు … పొండిరా పొండి …మీ కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి !”

బేసిక్ సెన్స్ ఉండాలి కదండీ … మనసు, శరీరం ఏకం చేసి ఒక యోగ ముద్ర లోకి వెళ్లిపోయి నాపాటికి నేను ”టీ ” తాగుతుంటే … “మర్చిపోయిన మెయిల్సు , కనపడని ఐడి కార్డులు ” అంటూ ఒక వైపు … “తిరుపతి కొండపై కొన్న బుడుగుల బుట్టలో పోయిన బుల్లి బిందె , దోసల దబ్బ ఎక్కలా? పెప్పా పిగ్గు కార్ ఎక్కడా?” అని ఒకవైపు ఊదరగొడుతుంటే ఎల్లా అండీ!! .. నాకు ఇంటరెస్ట్ పోయింది .. పోతే పోయింది తొక్కలో సంసారం ..ఎవడికి కావాలి … ప్రతి నిముషానికి ఏపుకుతినేస్తుంటే .. నాకు వద్దండీ ..వద్దే వద్దు సార్ !!

scene 2: ప్రశాంతంగా టీ రంగు , రుచి మరియు చిక్కదనంతో సహా ఆస్వాదించిన తదుపరి :

“ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి ..ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి . ”

అరెరే పాపం ఎంత కష్టపడతాడో … పనిలో పడితే అస్సలు ప్రపంచం పట్టదు కదా ! ఈరోజు ఉల్లిపాయ్ పకోడీస్ చేద్దాం. బుడ్డిదేంటి ఇంత ముద్దొస్తోంది .. గోడనిండా వేసిన మోడరన్ ఆర్ట్ ముందు రంగుల్లో కలిసిపోయి నిల్చుని, ఆహా ఎంత ముద్దుగా ఉంది…చిట్టి పికాసో మాదిరిగా లేదూ !

కాబట్టీ … మా కంటూ కాస్త సమయం వదిలిస్తే సరి .

************************************************

Duties and Responsibilities of being a “pinni” 😍🤗

ప్రశ్న : చిన్నమ్మ పదవి యొక్క విధులు మరియు భాధ్యతలు ఏమిటి?

జ : 1. పెద్దలకీ పిల్లకాయలకీ మధ్య అంబికా దర్బారు వారి అగరుబత్తి వలె అనుసంధానమై ఉండుట. 
2. ఇంట్లో పనులన్నీ గాలికొదిలేసి పిల్లలతో కలిసి బుడుగులతో ఆడుట, వారి బొమ్మలకు జడలు వేయుట, వారిని ఓహోహో, ఆహాహా అని ఓఓ …. పొగుడుట.
3. అవతలి వారిపై కన్నా నువ్వంటేనే నాకు రెండాకులు ఎక్కువ ఇష్టం అని ప్రతి ఒక్కరినీ రహస్యంగా నమ్మించుట.
4. పని తప్పించుకుని తిరుగుతున్నానని ఉరిమి చూసే అక్కలని, వదినలని తప్పించుకుపోవుట.
5. పొద్దుటినుండి బుర్ర తినేస్తున్నా, పిన్ని పక్కనే పడుకుంటాము అని వాళ్ళ అమ్మ దగ్గర నుండి పారిపోయి వచ్చి దుప్పట్లో సర్దుకునే వారిపై కోపం, ప్రేమా రెండూ కలగలిసి రాగా ఏడవలేక నవ్వుట.

6. ఈ వార్త విని పరుగు పరుగున వచ్చిన “తనని” చూడలేక ముసుగు తన్నుట. 

 

************************************************

 

Still searching for your best holi pic?!… I give up 😐🙄

“ఏమైనా కాస్త మంచివి దొరికాయా ?”

“లేదే … అందరి మొబైల్స్ లో చూసాను ! అన్నీ ఇలాగే ఉన్నాయ్ .”

“ఛీ … సరేలే .. ఇప్పటికైనా పోస్ట్ చేద్దాం . ఇంకా లేట్ అయితే కాండిడ్ ఉగాది పచ్చడి ఫోటోలు వచ్చేస్తాయి.”

“నా దగ్గర ఉన్నదాంట్లో ఇది కాస్త మేలు , ఇంతకీ నువ్వెక్కడ, నేనెక్కడా … అసలు ఇందులో మనోళ్లు ఎవరెవరో కాస్త వెతుకుదాం.”

“అవును మనం ఐదుగురం కదా … ఈ మిగతా రెండు తలకాయలు ఎవరివే … దర్జాగా భుజాల మీద చేతులేసి మరి మనతో దిగారు … అన్నిట్లో వీడెవడో అయితే చెయ్యి లేదా కాలు పెట్టాడు … చి వెధవ ఫోటోలు … పెట్టకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు .. వచ్చే హోలీకి అప్పుచేసైనా, చందాలు వేసుకునైనా ఒక ఫోటోగ్రాఫర్ని మాటాడుకుందాం.”

ఇంస్టా తెరిస్తే చాలు … ఎలా తీస్కుంటారబ్బా ఇలా మంచి మంచి ఫుటోలు !
మనమూ ఉన్నాము .. “గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ ” బ్యాచ్ “దండుపాళ్యం” బ్యాచ్ get together పార్టీ చేసుకున్నట్టు.
#నాకుఇంట్రెస్టుపోయింది

 

************************************************

 

Happiness comes from the simplest things.. don’t miss to acknowledge them 🤗🤗❤️😍

“ఇల్లలకగానే పండుగ కాదూ … ఇడ్లికి నానపెట్టగానే సంబరంకాదు !”

“మరి అసలైన ఆనందము ఎప్పుడు వచ్చును !”

“ఎప్పుడంటే…. చలి దేశాల్లో ఓవెన్లలోనే, వంటింటి అల్మారాల్లోనో ఇంకా ఎవరెవరి తెలివితేటల్ని బట్టి కనుగొన్న రహస్య స్థావరాల్లోనే కష్టపడి పులియబెట్టిన పిండిని ఇడ్లి పాతర్లో వేసి ఆవిరికి పెట్టీ ….”

“ఆ పెట్టీ ….”

“ఆ పైన మూత తెరవగానే ఏ రాళ్లూ, రప్పలు చూడాలో అని గుండె చిక్కబట్టుకుని టెన్షన్ తో చూస్తూ….. ఆ ఆవిరి పొగలు అలా అలా మొహాన్ని తాకుతూ ఉండగా…. ఆ మబ్బులు వీడి, దూది రేకుల్లాంటి, మల్లె మొగ్గల్లాంటి, చంటి దాని బుగ్గల్లాంటి ఇడ్లిలు కనిపిస్తాయి చూడు అదీ ఆనందమంటే !! పరమానందం అంటే !”

సాంబ్రాణి ధూపం తొలగిపోవు సమయాన దేవుని దివ్యమంగళ రూపం చూసినంత ఆనందం ! అన్నం పరబ్రహ్మ స్వరూపం కదూ ! ప్రపంచం లో ఎన్ని సంఘటనలు , సంచలనాలు జరుగుతున్నా ఎప్పటికీ , దేనికీ ఆగని నిత్యాగ్నిహోత్రం … “సాపాడు జిందాబాద్.”

 

************************************************

 

That pain when you can’t talk to mom for a couple of days 😢

“జీవితం అంతా అంధకారమై పోయింది … ఇక ఇంతే … ఎటు చూసినా నిరాశే ….కారు చీకట్లు కమ్ముకున్నాయి…నీలి నీడలు మీదికి వచ్చేస్తున్నాయ్ ! పారిపోవాలి… పరిగెత్తాలి.. గమ్యం తెలీని చీకటి దారిలో ఒంటరి పరుగు … ఊపిరి ఆడటం లేదు ! నన్ను కాపాడేవారే లేరు !”

ఏమొచ్చింది .. ఏంటి ఈ పైత్యపు మాటలు ?

“ఎవరిదో పెళ్ళికి అమ్మ ఊరెళ్ళింది … సిగ్నల్స్ లేవు … రెండు రోజులైంది ఫోన్లో మాట్లాడి !”

******
ట్రింగ్ ట్రింగ్ …
“హలో మా ఎంజేస్తాన్డావు మా … మీ ఊరు వెళ్తే మాత్రం నన్ను మర్చిపోతావా ? ఒక్కదాన్ని ఇంత దూరంలో ఉన్నానని మర్చిపోయినా ? సర్లే పచ్చి పులుసు ఎలా పెట్టాలో మళ్ళీ చెప్పు !”

“ఎన్ని సార్లు చెప్పించుకుంటావే, అవును పెరుగు తోడుకుంటోందా, పాలు ఇంకా పొంగిస్తూనే ఉన్నావా , రోజూ ఇంత ఉడకేసుకుంటున్నారా,చిన్నదానికి చక్కగా చేసి పెడుతున్నావా లేదా !!
పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి మీరు ఉండే చోటేట. భోజనానికి పిలవమని చెప్పా.. పిలిచావా? … బద్ధకం వదిలించుకో ముందు… ఎలా వేగుతున్నారో ఏమో నిన్ను !”

ఆహా…అమ్మ మాట వింటే చాలు. .. ఫిల్టర్ కాఫీ తాగుతూ m.s. సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం వింటున్నంత ఆనందం .
******
అవును … నిరాశా .. నీర్ దోసా అని ఇందాకేదో చెప్తున్నావ్!

“అది అమ్మ కాల్ చెయ్యకముందు ..
ఆడెవడు ఈడెవడు నాకిప్పుడు అడ్డెవడు !
మేరే పాస్ మా హై రే !”
#అమ్మాచూడాలీ 

************************************************

 

This is for you NANNA🙌🙌😎Miss you Bellampalli… My Home town 💕

చిన్న టౌన్లలో అందరూ అందరికీ పరిచయమే… అందులో నాన్న టీచర్ అయితే ఆ హోదా వేరే లెవెల్ 😎

“అంకుల్ ఇక్కడే మా ట్యూషన్ ఆపండి … ఇదుగో రూపాయ్ “
“వై .ఆర్. రెడ్డి సార్ బిడ్డ కదా నువ్వు , నా కొడుకు మీ నాన్న కాడే సదువుతాడు. ”

“అన్నా, సెల్లో పిన్ పాయింట్ రీఫిల్, రెండు నటరాజ్ పెన్సిల్స్ ఒక లాంగ్ నోట్ బుక్.”
“మా లెక్కల సార్ బిడ్డ కదా నువ్వు .. ఈ లెక్కలు మీ నాన్న నేర్పినవే .. మనదే రా ఈ షాప్ .. ఎమన్నా కావాల్నంటె చెప్పు స్పెషల్ గ తెప్పిస్తా. ”

ఇప్పటికి కూడా “మా Y.R. రెడ్డి సార్ బిడ్డ” అన్న పిలుపంటే నాకు ఎంతో ఇష్టం . అది ఒక బ్రాండ్ 😎. అలా ఎవరైనా పిలిస్తే వెంటనే నిటారుగా అయిపోతా .. లేని కాలర్ ఎగరెయ్యాలనిపిస్తుంది !
ఇన్నేళ్ల ఈ లెగసీ కి బ్రేక్ వేస్తూ రిటైర్ అవుతున్న నాన్న కి 🙏🙌 పదవీ విరమణ శుభాకాంక్షలు .

అలాగే ఇన్నేళ్లు మా ఇంట్లో దీపం అయిన Singareni Colleries మరియు Church of South India కి ప్రేమతో 🙏🙏.

మీ ముంగిట్లో పెరిగి ఇంతదాన్నైన
శ్రీ నిధి .

నాన్న నెక్స్ట్ ప్లాన్స్ ఏంటీ అంటే ..
“రేయ్ అమ్మలూ …ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ ‘రైతు బిడ్డకి’ రిటైర్మెంట్ ఉండదు కదా!” అన్నారు మా సొంత ఊరికి ఇన్నేళ్ల జ్ఞాపకాలని వెంటబెట్టుకుంటూ.

 

************************************************

Happy Sriramanavami

“ఈ ఏడాదైన క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయ్యాలి. మధ్యలో అనవసరంగా కెంపులూ, నీలాలూ ఏ కష్టం లేకుండా పద్యాల్లో, పాటల్లో మనతో పాటూ పేరు తెచ్చేసుకుంటున్నాయి. అదుగో పంతులు గారు పిలుస్తున్నారు, ‘తలంబ్రాలు’అని, చెప్పేది గుర్తు పెట్టుకోండి మర్చిపోవద్దు. “

“సరే సరే… అలాగే! “

“అబ్బ ఎంతందం, నీలాకాశం రాశి పోసినట్టు…అలా చూస్తూనే వుండిపోవాలి అనిపిస్తోంది. “

“ఇటు చూడు, ఎంత సుకుమారం. తామరపువ్వు లాంటి పెళ్ళికూతురు. మనల్ని పట్టుకుంటేనే కందిపోయేటంత సుకుమారం. మళ్ళి సంవత్సరం వరకూ ఈ అదృష్టం రాదుకదూ..”

అయిపోయింది , అదిగో జానకి చేతిలో కెంపుల రాశి, రాముని చేతిలో నీలపు రాశి అని చెపుతున్నారు. ఈ ఏడాది కూడా మర్చిపోయామన్నమాట…”శ్రీ రామ చంద్రా” అని తెల్ల మొహం వేసాయి ఆణిముత్యాల తలంబ్రాలు.

సరదాగా అలా

If I have to share Bloopers for my write ups 😐🙄

“ముత్యపు జల్లులుగా కురుస్తున్న వాన చినుకులని దోసిట్లో నింపేసుకోవాలని ఆరాటపడుతున్న హీరోయిన్ని స్లో మోషన్ లో చూస్తూ తన మనసులో మాటని చెప్పేద్దామని గేటు తీస్కుని వస్తున్నాడు హీరో !”

*******
“అమ్మా … నాకు పెయింటింగ్ సెట్ తీసీ. ”

“తీస్కో … ఇష్టమొచ్చినట్టు వేస్కో .. తర్వాత చూసుకుందాం. వెళ్ళు , ఇల్లంతా నీదే … ఏలుకో పో!”

*******
తనని గుచ్చుతున్న చూపులకి చురుక్కుమని, ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది హీరోయిన్ ….

********
“అమ్మా .. నా చేతులు ఛి ఛీ గబ్బుస్ అయిపోయాయి . క్లీన్ చెయ్యవా !”

“ఏమీ పర్లేదు … నువ్వాడుకో ! ఒకేసారి చివరాఖరులో బాత్రూమ్ లో వేసి చేపని తోమి నట్టు తోమి పడేస్తా .. నువ్వు విజృంభించు , నే చూసుకుంటా .”

**********
ఏదో చెప్పాలి, ఎలా చెప్పాలి.. అని తడబడుతున్న హీరో . ఎలా చెప్పినా పర్లేదు, ఆ మూడు ముక్కలు చెప్పేస్తే చాలు అని ఎదురుచూస్తున్న హీరోయిను .

***********
“అమ్మా … ప్లే డో ఇంకా స్లైమ్ కూడా తీసుకోనా ?”

“నీ ఇష్టం … ఎవడు అడ్డు వచ్చినా నేను చూస్కుంటా ! నన్ను కాసేపు వదిలేయ్ చాలు.”

************
ఇద్దరు దగ్గరికి వచ్చేసారు . చూపులు కలుసుకున్నాయి . ఒకరి చేతులు ఇంకొకరి చేతిలో ఇమిడిపోయాయి !

**********
“అమ్మా … అయిపోయింది . టీవీకి, ఐపాడ్ కి కూడా మేకప్ వేసేసా ! అందరినీ ఒకేసారి తోమేస్తావా బాత్రూమ్ లో ?”

“ఓరినాయనోయ్ … కొంపలంటించేసింది . వస్తున్నా .. కదలకుండా ఎక్కడి దానివి అక్కడే ఉండు .”

***********
“ఇదుగో రైటరూ .. ఈ అమ్మాయికి ఏమని చెప్పాలో చెప్పు . ఓ … మెలికలు తిరిగిపోతోంది” …. హీరో గారి గోల.

ఈ వర్షాకాలం సాయంత్రాలు , ఈ అనుభూతులు , నువ్వు, నేను ఇవంతా ఒట్టి మాయ అని చెప్పు . చివరికి మిగిలేది బూడిద అని చెప్పి పారిపో .. బతికిపో !

********************************************************

Confessions of a homemaker 😐🙄😒

“ఏంటి ఆదివారం ఇంత తొందరగా లేచావు ?”

“ ‘ఆలస్యంగా లేస్తే ఆదివారం తొందరగా అయిపోతుంది కదా’ అందుకని .. ముందే లేసి కొంచం కొంచం కొసరి కొసరి ఎక్కువ సేపు ఆదివారాన్ని ఆస్వాదించాలనీ !”

“నిజం చెప్పు !”

“మరేమో ! వీళ్ళిద్దరూ సెలవని ఆలస్యంగా లేస్తారు కదా .. ఈ ప్రశాంతతని, నిశ్శబ్దాన్ని నాకోసమే ఉంచేసుకోవాలని . మళ్ళీ రేపటినుండీ పరుగే కదా ఎలాగూ.

****************************************************************

Times when we get to know our hidden talents 😄😃

“టీ .వీ చూడాలి అని చెప్పొచ్చుకదా ! నేను స్విచ్ ఆన్ చేసి రిమోట్ తెచ్చి ఇస్తా ఉండు.”

“ఏంటీ .. మంచి నీళ్లా .. ఉండు మరీ .. నేను , నేను తెచ్చి ఇస్తాగా .”

“ఏంటి అటు ఇటూ చూస్తున్నావు , ఓ ఫ్యానా , ఆగవోయ్ .. నేన్ నేన్ నేన్ .. నేను ఉన్నానుగా. ”

“పడుకుంటావా కాసేపు … ఒక్క నిమిషం . ఇప్పుడే వస్తా .
బెడ్ సెట్ చేసా .. బ్లయిండ్స్ వేసేసా … రిమోటు, చార్జర్ , నీళ్ల సీసా అన్నీ చేతికి వీలుగా పెట్టేసా … అన్నిటికన్నా ముఖ్యం పిల్ల పిచ్చుకని పక్క రూంలో పెట్టేసా , నాన్న దగ్గరికి వెళ్లకుండా నాలుగు రామ్ గోపాల్ వర్మ కథలు చెప్పేసా .
హమ్మయ్య .”

“వెళ్ళు , పడుకో హాయిగా . పాపం. ఆదివారం మధ్యాహ్నం కదూ . ఆ ఛాయలకి ఎవ్వరూ రాకుండా నే చూస్కుంటా .. వెళ్ళు ..”

******
“ఏంటీ … ఏమయినా నోము చేస్తున్నావా ? నువ్వే?”

“ష్ .. ఉష్షూ ! మెల్లిగా . మరేమో చాలా రోజులు వెతికి, చూసి చూసి ఒక ప్రొఫెషనల్ కెమెరా లెన్సు కొన్నాడు .. మనకి గుండెలో కలుక్కుమనేంత ధరలో .”

“అయితే !”

“జాగ్రత్తగా పెట్టమన్నాడు . ఎక్కడో పెట్టేసానబ్బా జాగ్రత్తగా… గుర్తురావడం లేదు . అందుకని వీకెండ్స్ లో ఈ బట్టరింగ్ ! ఇహ వెళ్లి వెతకాలి. ”

*****************************************************************

Karma is a boomerang 🤘😐

కర్మ ఫల సిద్ధాంతం అనగానేమి ?

చిన్నప్పుడు టీచర్ ఆటలో వేప పుల్ల బెత్తంతో, గోడ కుర్చీలతో విజృంభించి వీధిలో పిల్లలకి సింహస్వప్నంలా ఉండే నువ్వు ..

ఇప్పుడు నీ బుడ్డి ఆడే అదే ఆటలో ఫోనిక్స్ లో C కీ K కీ తేడా చెప్పలేక శిష్యురాలిగా ఘోరంగా ఓడిపోయి “ఒక మూలకి నెట్టివేయబడడం” అనేది ఏదైతే ఉందో … అదే కర్మ ఫలం .

***********************************************************************

So much has happened in between 😎🤗

విజయవాడకి నాన్నారు అప్పుడప్పుడు … అంటే సంవత్సరానికి ఒక రెండు సార్లు వచ్చి ‘ఔటింగ్’ కనిచెప్పి దుర్గమ్మ గుడిలో అటెండెన్స్ వేయించి … ఒక సినిమానో, భవానీ ఐలాండో చూపించి చివరాఖరులో హోటల్ మనోరమలో నాకిష్టమైన భోజనం పెట్టించే రోజులు అవి.

ప్రోటోకాల్ ప్రకారం జరిగిపోతున్న ఔటింగ్ లో మనోరమ హోటల్లో భోంచేసి లేచి వస్తున్న నన్ను మేనేజర్ అంకుల్ వచ్చి మాట్లాడించారు …

“ఏమ్మా … ఇంటరా తల్లి? ఏ కాలేజీ ! ఏ క్యాంపస్” అని .

“అరె .. భలే కనుక్కున్నారే ! ఎలాగబ్బా .. పదహారేళ్ళ వల్లనా? లేక రిజల్ట్స్ తర్వాత పేపర్లో పడే ఆణిముత్యాల పోలికలు ఏమైనా ఉన్నాయా” అని తికమక పడిపోతుంటే అన్నాడతను ..

“అబ్బే .. మరేమీ లేదు, వాష్ బేసిన్ కి ‘ప్లేటు…గ్లాసూ ’ కూడా తీసుకెళ్తుంటేనూ .. డౌటేసి అడిగా అమ్మడు ” అని!

అహో … సిరిమల్లె తోటల్లో పరిగెడుతూ తిరిగే పదహారేళ్ళ శ్రీదేవి, పాంచాలి వలె నన్ను చూసి నవ్విన ఫీలింగు …నన్నెరిగిన వారు ఎవరూ చూడలేదు కదా అనుకుని, ధిక్ ధిక్ మని వెనక్కి వచ్చి నా ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్క్రీం తినేపనిలో పడ్డా .

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే … 10 th క్లాస్ పాస్ అయ్యి చిన్ని ఊర్ల నుండి , చిట్టి టౌన్లనుండి భవిష్యత్ ‘విజయ’యాత్రలకు వీరతిలకాలు దిద్దుకుంటున్న నాతోటి సోదర సోదరీమణులందరికి … లాల్ సలాం మై డియర్ కామ్రేడ్స్ ! All the very best 🤘
#అదంతాఒకఇదిలే!

*****************************************************************

That pain when someone cannot relate to your emotions 😕😖

“నాకు ఇంటరెస్ట్ పోయింది …ఊఫ్ … its gone I say !”

“మళ్ళీనా ! ఏమైంది ?”

“నా పాటికి నేను ఓ మూల కూర్చుని, ఈ ప్రపంచాన్నీ, భవసాగరాన్నీ etc etcలని మర్చిపోదామని ఈనాడు ఆదివారం పద వినోదం పట్టుక్కూర్చున్నానా!”

“ఊ ..ఉంటే !”

“అన్ని గడులు నింపేసా … ఇంకొక్కటి … ఒకే ఒక్కటి మిగిలింది . ‘ఉసిరికాయకి ఇంకో పేరు ఏంటి?’ అని. నేను నానా యోగాసనాలు అన్నీ వేసి ఒక ధ్యాన ముద్రలోకి వెళ్లి, సర్వేంద్రియాలనీ కూడగట్టుకుని ‘జ్వాలాద్వీప రహస్యం’ ఛేదించే వీరునిలా ఆలోచిస్తుంటే …. !”

“ఆఁ ..తుంటే !”

“నాకేదో సాయం చేసేద్దామని చెప్పి … చక చకా గూగుల్ ని అడిగి …నేను స్లో మోషన్ లో “నహీ” అని అరిచి దగ్గరికి వచ్చేలోపు…. “ఓ సో ఈజీ ‘ఆమలకము’ అంట” అని చెప్పేసాడు … పైగా ఇంత సాయం చేసినా కూడా నేను సంతోషపడలేదే అని ఒక వెర్రి చూపు కూడా !
‘రామ్మోహన్ రావ్ … నేన్ గెలిచాను’ అని అరుద్దామనే ఆశని తుంచేశారు.
అందుకే ఈ సమాజం మీద ప్రస్తుతానికి #ఇంటరెస్ట్పోయింది.”

**********************************************************

When u are HUNGRY and the restaurant is busy and on top it’s Friday 🤪

ఒరేయ్ నీకు దణ్ణం పెడ్తా. బుద్ధి తక్కువై వీకెండ్ ఒచ్చా . ఆకలేస్తోంది రా.. ఎంత సేపు ఇలా కూర్చోపెట్టి ఊరిస్తావు … ఈ ఆకలికి ఆ వాసనలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి . పొమ్మనవు అలాగని తిండీ తేవు .
ఉండాలా లేదో తేల్చి చెప్పు. చక్కా ఇంటికి పోయి పెరుగన్నం లో ప్రియా పచ్చడేసుకుని తినేసి బజ్జుకుంటా. ఫ్రైడే ఈవెనింగ్ పా…యే!#నాకుఇంట్రెస్ట్పోయింది

To all the #daddysprincess and other proud #daddyslittlegirl who went virally emotional on this special day!

“హలో నాన్నా ! బాగున్నారా ? హెల్త్ ఎలా ఉంది ? అమ్మ కి ఇవ్వవా ఫోన్ !”
******
“నాతోనేమో ఐసీయూలో పేషెంట్ తో విసిటింగ్ డాక్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. నీతోనేమో గంటలు గంటలు కబుర్లు చెబుతుందే మరి! మీరు మీరూ ఒకటి . హు .”

“అవునూ … అది హాస్టల్ లో ఉన్నప్పుడు సెమ్ రిజల్ట్స్ వస్తే ముందుగా ఎవరికి చెప్పేది ?”

“నాకే !”

“ఫస్ట్ జాబ్ వచినప్పుడు ఎవరికి ముందుగా చెప్పింది ?”

“నాకే !”

“ఈ అబ్బాయినే చేసుకుంటానని ముందుగా ఎవరితో చెప్పింది ?”

“నాతోనే!”

“అదే మరి … ముఖ్యమైన వాటికి మీరు . చీరలకి -మ్యాచింగులకి , నగలకి – నోములకీ , అలకలకి – ఆరళ్ళకి , పోపులకి – రుబ్బులకీ నేను .”

“ఇప్పుడేమంటారు!”

ఇంకేమంటారు …. అదుగో అలా మీసాలు దాచిపెట్టలేని ముసిముసి నవ్వులు నవ్వేస్తాలు .. నాన్నాలు !😍😍😍

**************************************************************************

Your kids Necessity is the mother of your creativity!!! 🙏

“పిట్టకి బువ్వ !”
అదుగో గింజలు వేసా మేడం !

“మరి లీళ్లు!”
అదుగో కప్పులో పోసాను మేడం !

“మరి రాత్రి బజ్జోడానికి ఇళ్ళు !”
అదుగో పూల పూల బుజ్జి గూడు .

“హ్మ్మ్ … ఒకే !”
మరైతే ఇక చెప్పిన మాట వింటారా? పెట్టిన బువ్వ తింటారా మేడం !

“మరి పిట్టలేవి? Where?? పిట్టలు వచ్చి బువ్వ తిని, లీళ్లు తాగితే అప్పులు !!”

బుల్లి …. మే …డం !!!!!

*******
నాగార్జున గారూ … చూసారా అండీ ఈ టార్చరు … నా వల్ల కాదండీ .. పోయింది.. #నాకుఇంటరెస్ట్పోయింది !!!

సరదాగా అలా

Everyone has got their own problems …especially When it comes to privacy and parents 😂😂

“ఏంటీ సంగతీ !”

“అమ్మ కొట్టింది !.. అందుకే అలిగి ఇక్కడికి వచ్చా !”

“ఎందుకో ?”

“శుక్రవారం చక్కగా దీపం పెట్టుకుని వచ్చింది, పాట బాగుంది కదా అని ‘ఊరీకి ఉత్తరాన, దారికి దక్షిణాన .. నీ పెనిమిటి కూలినాడమ్మా’ అని పాడుతూంటేనూ … ఫెడీ ఫెడీ మని వార్నింగ్ కూడా ఇవ్వకుండా మోగించేసింది, వీపుపై విమానం మోత !! ఛాదస్తం ఎక్కువైపోతోంది అమ్మకి .”

“LOL … హా హా !”

“మరి .. నువ్వెందుకు వచ్చావో ?”

“నేను కూడా మా అమ్మ మీదే అలిగి వచ్చా !”

“నువ్వేం చేసావ్ ?”

“మా టీవీలో మ్యూజిక్ వింటుంటే కరెంటు పోయింది … అప్పుడు అక్కడ వస్తున్న పాటని చిన్నగా పాడుకుంటూ ఉన్నానా ! ఇంతెత్తు బిడ్డని అని చూడకుండా , జడ లాగి మొట్టికాయ వేసింది. ఏమి చెయ్యలేక ఇక్కడికి వచ్చా !”

“ఇంతకీ ఏం పాటో ?”

“ఇష్ష్ ..దగ్గరగా రా మరీ ! ఏం పాట అంటే .. ‘ వెయ్ రా చెయ్ వెయ్ రా ..ఎక్కడెక్కడో చెయ్ వె …!’”

“నాది జస్ట్ LOL మాత్రమే … నీది ఏకంగా ROFL !”

“సర్లే రౌడీ బేబీ విన్నావా .. ?”

“వినడమా ? what are you talking .. భట్టీ పట్టేసా !”

“కోరస్: 1 + 1 , 2 మామా …
యు + మీ , 3 మామా …. ఎయ్ రౌడీ బేబీ .. రౌడీ బేబీ ..బేబీ బేబీ …. ”

“రేయ్ .. ఎవడ్రా అక్కడ మెద్ది మీద జేరి గలాటా చేస్తా ఉండాది .. వస్తా వుండా ..ఆడ్నే ఉండండి !”

“వామ్మో .. పదవే తల్లీ .. ఛీ ఛీ ..ఈ విశాల ప్రపంచంలో మనకి చోటే లేదు !”

 

******************************************************************************************

“ఏంటీ చానా రోజులకి వచ్చావ్ ఇటేపు ?”

“పెద పండక్కి ఊరొచ్చాలే గానీ .. ఒక మాట చెప్తా … గమ్మున వినుకో !”

“ఆ చెప్పు ఏందో !”

“భాస్కర్ పెదనాయిన మాలూమ్ తెరెకో , రెడ్డెప్ప మామా మాలూమ్ తెరేకో , బాబు బాబాయ్ మాలుమ్ తెరెకో , హరి అన్నా మాలుం తెరెకొ … ఏ సబ్ మేరె పీచే హే రే .. !”

“హ్మ్ .. ఇంతకీ ఏందీ పండక్కి ఊరు వచ్చానంటావ్ !”

“య్య య య్యా … యా !”

“కాసేపుండు మరి .. అలా పరిగెడతావే ????”

“అమ్మో ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 9…మళ్ళీ తెల్లారి 6 కే ఇక మేలుకొలుపు ! వస్తా .. పసల పండక్కి వచ్చేయ్ మరి దోసెలు, నాటు కోడి పులుసు ! ఓ పట్టు పడదాం !”

 

                     ****************************************************************************************************************

Birthday with parents after a long time 💕💕😛

కొన్నేళ్ల తర్వాత పుట్టిన రోజుకి అమ్మ దగ్గరికి వస్తే

“అబ్బ!! తెల్లారింది … కాసేపు ఊరికే ఏ పని చెయ్యకుండా ఇలా ఈ ఉదయ కాంతి కిరణాలని చూస్తూ , కలరవాలు వింటూ ఉందాం !”

“లేచావా … మొహం కడుక్కుని వచ్చి కూర్చో ఓ పనై పోతుంది !”

“సర్లే .. అలాగే .. కాఫీ సిప్ చేస్తూ ఇంటి వెనుకగా వెళ్లే రైలు బండ్లని చూద్దాం !”

“కాఫీ తాగేసావా .. రా తలకి నూనె పెడ్తా .. మొక్క జొన్న పీచులా ఉంది మరీ నీ జుట్టు !”

“సర్లే ఈ పనేదో చేసేస్తే కాస్త కూర్చుని పేపర్ లో యాడ్స్ ….అక్కడక్కడా ఉన్న వార్తలు చదవొచ్చు !”

“ఇంకా ఎంతసేపు అలా … వెళ్లి తల స్నానం చేసిరా !”

“ఒకే … ! తల్లి ప్రేమ కదూ ! సర్లే !”

“ఇదిగో స్నానం అయిందిగా ఈ రోజు కూడా ఆ బుడబుక్కల వేషం ఎందుకూ .. కొత్త డ్రెస్సు వేసుకో !”

“సరే .. వేసేసుకున్నా ! టీవీ చూస్తా !”

“ముందు గుడికి వెళ్లి రా . “

“వాకే … అయిపోయింది . “

“ఎక్కడికీ .. అన్నం తిందువు గానీ రా … “

“ఇవన్నీ ఇప్పుడు తినడం లేదమ్మా నేను !!!”

“నీకోసం కష్ట పడి చేస్తే తినవూ .. అంతేలే !!”

“వద్దూ … ఆపేసేయ్ .. తింటా అన్నీ తింటా ! హ్యాప్పీస్ ఆ !”

“కాసేపు బ్రౌస్ చేసుకుందాం … !!”

“ఇంత దూరం వచ్చి కబుర్లు చెప్పవేంటి అమ్మలూ .. “

“సరే కూర్చో .. చెప్పు మరి నువ్వే విశేషాలు ఏంటో !”

“సాయంత్రం వడకి ఏ పప్పు నానెయ్యను .. ఉద్దిపప్పా .. సెనగపప్పా లేదా అలసందలా !! “

“కబుర్లన్నావ్ .. ! అమ్మా .. మా…మ్మా ..!!”

అవును ఇలాంటి సీన్ లోనే నేను కూడా ఆక్ట్ చేసి నట్టు వుందే .. నా బుడ్డది ఏంటి నన్ను అదోలా చూస్తోంది !!!

 

*********************************************************************************************************************************

The times when you fail at “anger management “😖😖

నాలో దాక్కున్న “అగ్ని ఆఁ ” బయటికి వచ్చే సందర్భం :

“నా కళ్ళజోడు ఎక్కడైనా చూసావా ?”

“ఆ అక్కడ .. !”

“ఎక్కడ ?”

“అక్కడే .. ఆ పక్కన !”

“నా పుస్తకం చూసావా ?”

“ఆ ఇక్కడ . దాని పక్కనే.”

“ఎక్కడ .. ఏ పక్కన !”

“అదిగో , అక్కడే .. ఆ పక్కనే !”

ఏఏయ్ , ఏయ్ , ఏయ్ … తెలుగు భాషలో నాకు నచ్చని పదాలు రెండే రెండు ….. “అక్కడ ” “ఇక్కడ”! అగ్ని ఆఁ … !

మరి నీలో ఉన్న “జమదగ్ని” బయటికి వచ్చే సందర్భం ఏంటో :

“నా ఐడి కార్డు చూసావా ?”

“ఇక్కడే , ఎక్కడో “జాగ్రత్త గా ” పెట్టా !”

“ఏయ్ ఏయ్ యే ఏయ్ … “జాగ్రత్త ” అనే పదానికి అర్ధం మార్చొద్దు ! మర్చిపోయాను అని చెప్పు సుబ్బరంగా ..
నాలో జమదగ్నిని బయటికి లాగొద్దు … ఆఁ ఆ ఆఁ !!”

*********************************************************************************************************

This day, Back in those days 🤗💕😍🥰
Don’t ask me about nowadays..no clue absolutely!🙃 February 14

“ఈరోజు మా నాన్న మా ల్యాండ్ లైన్ కనెక్షన్ పీకి పక్కన పెట్టేసాడు, రాంగ్ నంబర్స్ తో పడలేక. ట్యూషన్ కి వెళ్లేముందు మిస్డ్ కాల్ ఇవ్వకండే”

“మా నాన్న కూడా !”

“మా ఇంట్లో కూడా డిటో !”

“నా బుట్టలోకి 3 గ్రీటింగ్ కార్డ్స్ , 2 డైరీ మిల్కులు వచ్చాయి”

“నా బుట్టలోకి ఒక మంచ్, ఒక రోజా పువ్వు వే !”

“అయ్యో ! ఈ రోజు నేను లంచ్ బాస్కెట్ తెచ్చుకోలేదే …! ”

అయ్యొయ్యో … పోన్లే అందరం పంచుకుందాం లే !

పీ .టీ సార్ ఏంటే అలా చూస్తున్నాడు అందరినీ ..ముందైతే ఇళ్ళకి పోదాం పదండి .

                                         *********************************************************************************************************

When your daily morning routine disturbs your aura!

“నేనేంటి ఇలా తయారయ్యాను .
కొబ్బరాకుల వెనుకాల దాగున్న చందమామతో దాగుడు మూతలు ఆడే నేను, పౌర్ణమి వెన్నెల ఊరినిండా ఒలికి ఆగడం అయిపోతోందని బాధ పడే నేను, ఆడుకుందామంటే పెట్టిన చోట పెట్టకుండా పూటకో చోట పిల్లల్ని దాచి గర్వంగా తిరుగుతున్న పిల్లిపై అలిగే నేను, వెండి మువ్వల సవ్వడికి నిద్రలో ఉన్న నాన్న లేస్తారేమో అని మునికాళ్ళపై నడిచిన నేను… ఇలా తయారయ్యానేంటి !!”

“ఎలా తయారయ్యావ్ ?”

“క్రూరంగా, భావరహితంగా ,కర్కశంగా … యాంత్రికంగా .. ఇంకా ఇంకా …. ఇలాంటి అర్ధమే వచ్చే ఇంకొన్ని పదాల్లాగా !
ఎందుకు? … క్యూ ? …. ???”

“ఏమో.. నాకేం తెల్సు ..తిన్నగా ఉండవ్ కదా ..మళ్ళీ ఎం జేసావ్ ?”

“మల్లెపూల సోనపైన, సన్నజాజుల దుప్పటిలోన నులివెచ్చగా బజ్జున్న నెమలీకలా హాయిగా ఒత్తిగిల్లి పడుకున్న బిడ్డని …. ఒక్కపారిగా లేపేసి … తెల్లారిపోయింది , వాళ్ళు వీళ్ళు అంతా టంచనుగా బడికి వెళ్లిపోయారు … పళ్ళు తోము, పాలు తాగు … నించోకు ,కూర్చోకు అని అమాంతం ఈ లోకంలోకి తెచ్చి పడేసా !
ఏమైంది నాలోని సున్నితత్వం ?”

“ఆ …కాలచక్రం కింద పడి వక్కలైంది . టైం చూసావా ..పరిగెట్టు ఇక !”

“ఆఁ ! “

“ఆఁ !”

*************************************************************************************************************

My fight with my expectations and reality :😎😏🤓🧐🤪

నాలోని కళాకారిణి : ఓకే నా బా .. మళ్ళీ చెప్తున్నా .. సరీగ్గా వినుకో !
నేనేమో ఇక్కడనుండి మరేమో నిన్ను
“ కోటలోని మొనగాడా .. ఆ ఆఁ ! 
వేటకు వచ్చావా ? వేటకు వచ్చావా .. జింక పిల్లకోసమో ? ఇంక దేనికోసమో” అని ఎత్తుకుంటా .
నువ్వేమో .. వింటుండావా .. నువ్వేమో ఆ కిటికీలోంచి తోటలోని నన్ను చూస్తూ … “తోటలోని చిన్నదాన .. వేటకు వచ్చానే.. జింక పిల్ల కన్నులున్న చిన్న దాని కోసమే” అని అందుకోవాలి … సరేనా బా .. అంతా ఓకే కదా !
స్టార్ట్ …

“ కోటలోని మొనగా …!!! ”

వాచ్ మేన్ : “ మేడం … కోట మూసేసే ఏలైంది . బీగాలేసుకోవాలా ! ఇంక పాండి మేడం . చానా దూరం పోవాలా !”

నాలోని కళాకారిణి : ఛి.. ఛీ .. ఏదైనా చెయ్యాలనే మూడు , ఉత్సాహం సర్వ నాశనం చేస్తారు . బేసిక్ సెన్స్ ఉండదా అండీ. కళాకారులని తొక్కేస్తారా అండీ . నిరంజన్ గారూ .. తగలబెట్టండి సార్ !

by
Srinidhi Yellala.

సరదాగా అలా

The great Indian Children’s day celebrations 🎉 😎😍🤗

“ఏంట్రా ఈ రోజు స్పెషల్సు !”

“అంతా మాములే ! నలుగురు టీచరమ్మలు, ఏడుగురు డాక్టర్లు , ఒక బెంగాలీ పెళ్లికూతురు ఒక్క అస్సామీ పెళ్ళికొడుకు , ఐదుగురేమో నర్సులు , ఇద్దరు మేరీమాతలు ఒక బుద్ధ భగవానుడూ, కడవ ఎత్తుకొచ్చిన శకుంతల, బాణమట్టుకొచ్చిన వేటగాడు !”

“చాల్లే ఎప్పుడూ వీళ్ళే వచ్చేది ఎలాగూ. మరి ప్రైజు ఎవరికొచ్చిందిరా ?”

“ఈ సారి స్పెషల్ ఎఫెక్ట్స్ మెర్మెయిడ్ కి ఇంకా నాగ కన్య కీ రా ! భలే ఉన్నారనుకో ! ”

“అబ్బో జలకన్యా, నాగ కన్యే .. రొటీన్ వేషాలే ఉంటాయని మిస్ అయిపోయానే ! ఛా ! ”
On Children’s day.. 😀

***********************************************************************************************************

It’s Friday night 😀 yay! #friyay

“నరుడా ఓ నరుడా ఏమి కోరికా ?”

“ఎస్కుస్ మీ .. ఎవరు సిస్టర్ మీరు ?”

“పాతాళ భైరవిని, పిలిచితివేల .. వచ్చితిని, ఏమి నీ కోరిక ?”

“సోమవారం నుండి శుక్రవారం దాకా దేకుతూ “పాండురంగ మహత్యం” లో ఎన్టీఆర్ లాగా, ‘ అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా ‘ అని పిలిచా, మొత్తుకున్నా…వచ్చావా? లేదే !! ఇప్పుడు శుక్రవారం రాత్రి వస్తే హౌ? ఎలా ! టెల్ మీ !! కమాన్ టెల్ మీ ఐ సే !!”

“సరే గాని, ఇప్పుడేమంటావ్ !!”

“శుక్రవారం రాత్రి కుబేరుడు వచ్చినా సోమవారం దాకా క్యూ లో ఉండాల్సిందే !! కమింగ్ బ్రో ! Bye-bye సిస్టర్ !”

***********************************************************************************************************

Done with my holidays 😒🙄

“ఉన్నావా, అసలున్నావా ? స్వామీ .. రా దిగిరా , దివి నుండి …..”

“బాలా , వచ్చితిన్ ! ఏలా ఊరికూరికే పిలిచెదవు !!”

“ఇదే ఈసారికి ఆఖరు అనుకో! ఆదివారం స్కిప్ చేసి సోమవారం వచ్చేట్టు చూడు తండ్రీ !
వరసగా 4 రోజులు సెలవులు. కథలు చెప్పి చెప్పి నోరు నొప్పి , ఆటలు ఆడించి ఆడించి తల నొప్పి , ఊ కొట్టి కొట్టీ చెవులు నొప్పి. బుర్రలో అంతా రైమ్స్ ఏ రిపీట్ మోడ్ లో ప్లే అవుతున్నాయి .
నేనెవరో , ఏంటో, జీవితం , పరమార్థం, మోక్షం, లాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్ ! ఇంకో రోజు అంటే నా వల్ల కాదు, తొరగా సోమవారం వస్తే వాళ్ళ టీచర్ కి అప్పగించి ఒక దణ్ణం పెట్టి వస్తా !’

“ఇదిస్తే అదంటావు ! అదిస్తే ఇంకోటంటావు … అందుకే సుబ్బరంగా నా గేమ్సు , నా రూల్సు అనేది . ఆప్షన్స్ లేవు ఇక వస్తా .. మరిక పిలవకు ! ”

 

***********************************************************************************************************

 

Winter is magic 💕

“పెన్సిళ్ల కోసం సైకిళ్ళ కోసం ఆస్తి పంపకాల లెవెల్లో కొట్టుకునే తోబుట్టువులు కానీ కసిన్స్ అవనీ , పానీ పూరీ పద్దు దగ్గర పేచీ పెట్టుకునే రూమ్ మేట్స్ అవనీ హాస్టల్ మేట్స్ అవనీ,
ఇంటి పనుల దగ్గర నువ్వా నేనా అనుకునే Mr.పెళ్ళాం – Mrs.మొగుడు అవనీ … ఎవరినైనా, ఎలాంటివారినైనా దగ్గరగా చేర్చగలిగేది ఒక్కటే బిడ్డా !”

“ఏంటదీ, మనసు-మమతా ?”

“కాదు”

“ప్రేమా – ఆప్యాయతా ?”

“కాదూ”

“రాగ – ద్వేష – పాశాలా ?”

“కాదెహే , ఐనా జవాబు చెప్పమంటే వచ్చిన, వస్తూన్న, ఇంక రాబోయే ప్రోగ్రాం టైటిల్స్ చెప్తావేంటీ ?”

“మరైతే నువ్వే చెప్పు , అందరిని కలిపే ఆ శక్తి ఎవరో !”

“ఎవరో కాదు , అదీ చలి కాలం .”

“ఆ ఆఁ “

“య్యా ..యెస్ 😎

***********************************************************************************************************

The time you get to know the value of food 😎🙏

“ఈరోజు ఆకలి వేసింది. రోజూ వేస్తుంది కదా అంటే ఏమీ చెప్పలేను. ఈరోజు కష్టపడ్డాను. శరీరం కష్టపడింది , అలసిపోయింది . ఎదో సమయానికి తినాలని తినడం కాదు, శ్రమ తర్వాత ఆకలికి నకనకలాడింది కడుపు. వేడి వేడి అన్నం, దేవుడి ప్రసాదం లా అనిపించింది. తేడా ఏంటి అంటే ‘శ్రమ.’ చేసే పని దైవం అన్నారు . ఎందుకో బాగా తెలిసొచ్చింది . కష్ట పడాలి, ఆకలి విలువ తెలియాలి ! అప్పుడే తిండి విలువ తెలిసేది .”

“అదంతా సరే గానీ, ఇంతకీ, ఏం జేసావ్ … ?”

“తొమ్మండుగురు పిల్లలని నిల్చోపెట్టి క్రిస్మస్ పాటలకి డాన్స్ వేయించే సహాయక చర్యల్లో పాలుపంచుకున్నా . పాదరసం లా జారిపోయే పిల్ల పిచ్చుకలని ఒకదగ్గర ఉడ్డగా చేయడం అనమాట .”

“ఇంకేం…శ్రమ విలువ మాత్రమే ఏంటి, పూర్వ జన్మ ఋణానుబంధ -కర్మఫలాలు కూడా తెలిసొచ్చి ఉంటాయి !”

“మరే మరే ..”

by
Srinidhi Yellala.

మ్యూజింగ్స్

Ammaa! 😍
“అమ్మా ఒక కత చెప్పవూ !”

“హ్మ్ .. సరే . ఈ చీర కథ చెప్పనా ?”

“చీరకి కూడా కథ ఉంటుందా ?”

“ఓ .. మనసు పెట్టి చూడాలే కానీ రాళ్ళలో కూడా రాగాలు వినొచ్చు తెలుసా ?”

“అయితే చెప్పు !”

“ఈ చీర మా నాయనమ్మ మీ అమ్మమ్మకి తన పెళ్ళిలో ఇచ్చిన చీర !! “

“అమ్మమ్మ చీర ఎందుకు కట్టుకున్నావు ?”

“అమ్మ నా ప్రతి పండుగని అందమైన జ్ఞాపకంగా మార్చడానికి ఎంత శ్రమపడిందో ఇప్పుడు తెలిసొచ్చి, అంతే చక్కని జ్ఞాపకాలు నీకు కూడా ఉండాలని కట్టుకున్నాను. ఈ చీర కట్టుకుంటే మా అమ్మని చుట్టుకున్నట్టే ఉంది మరి ! ”

**********************************************************************************************************

Life is full of wonders when you see how we are connected to the Nature 🙏🙏🤗

చల్లని తల్లి, సింగరేణి ఒడిలో గడిచిన బాల్యంలో తంగేడు పువ్వంటి జ్ఞాపకం “బతుకమ్మ”. మాకు లేని ఆచారం అవ్వడం వల్ల ఎక్కువగా స్నేహితుల ఇళ్లల్లో చూసేదాన్ని . ఎదురు బొదురు పిల్లలంతా ఒకింటి పిల్లల్లా పెరిగాం. నాకు చాలా నచ్చి మనసులో నిలిచిన పదం

“ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా ! ఏమేమి కాయొప్పునే గౌరమ్మా !
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మా ! గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మా !”

ఈరోజు బుజ్జమ్మ ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా “pumpkin patch” కి వెళ్తే ఎన్నెన్ని గుమ్మాడి పువ్వొప్పులో , కాయొప్పులో !
ప్రచంచం అటు వైపు, ఇటు వైపు చేసుకునే సంబరాల్లో ఎంత సామీప్యం.
ఎటు చూసినా గుమ్మడి కాయ పీచు సంబంధాలే .

ప్రకృతితో కలిసి చేసుకునే సంతోషాలు ! మిగతావన్నీ పై పై మెరుగులు!!
(పాటలో వ్యాకరణ దోషాలుంటే మన్నించండి )

****************************************************************************************

On World Elephant Day 😍
మా తంజావూరు బృహదీశ్వరాలయం గజ రాజు గారు ! వారి గురువు గారి చేతిలో రెండు రూపాయిల బిల్ల పెడితేనే మా నెత్తి మీద తొండం ఉంచి ఆశీర్వదించేది. ఒక coin కి ఒక ఆశీర్వాదం మటుకే సుమా! ఎన్ని అరటిపండ్లు ఇచ్చినా బొజ్జలో వేసేస్కుని హాయిగా తొండం అటూ ఇటూ ఆడిస్తూ ఉంటారే తప్ప అనుగ్రహించరు . వాళ్ళ మాస్టర్ చేతిలో తైలం పడాల, అప్పుడు మాత్రమే మన నెత్తిన తొండం మోపేది ! పక్కా భారత రాజ్యాంగ నియమాలు పాటించేది .
అంతరించి పోతున్నాయట మరి.

**************************************************************************************************

No mission is possible with just a hand few of people. Each one of us is as important as every other individual. Let’s do our part.

అనగనగా కథ :

అనగనగా ఒక రాజు తన ప్రజల నీతి నిజాయతీలని పరీక్షించడానికి రెండు పెద్ద కడవలు పెట్టి, ఒకదాంట్లో పాలు, ఒక దాంట్లో నీళ్లు పొయ్యమన్నాడు . మనోళ్ళేమో, ఎలాగూ మిగతావాళ్ళు పోస్తారు కదా, నేనొక్కడినీ నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అనీ, ప్రతి వోడు రెండిట్లో నీళ్ళే పోసాడంట.

ఇప్పటి కథ :

ఉండగా ఉండగా ఒక పుర పాలక వ్యవస్థ. వంటింటి చెత్తని సేంద్రియ ఎరువు గా మారుద్దామని, “ గ్రీన్ వేస్ట్” కింద ఒక కుండీ, “ప్లాస్టిక్ వేస్ట్” కింద ఇంకో కుండీ పెట్టారట. మనోళ్ళేమో మిగతావాళ్ళు వేరు చేస్తారు లే , నేనొక్కడినీ చెయ్యకపోతే ఏమవుతుంది లే అనీ..అన్నీ కలిపిన చెత్తనే రెండిట్లో వేస్తున్నారట 🤦‍♀️.

రాజ్యాలూ, రాజ్యాంగాలు మారినా ప్రజల ఆలోచనలలో, నీతి నిజాయతీల లో మాత్రం అస్సలు మార్పు లేదోయ్. మాటంటే మాటే !

************************************************************************************************************

Life is as simple as you make it 😇🤗🤗

👩‍🏫హెల్లో అమ్మా ? ఏం చేస్తున్నావు ?

👩ఆ చెప్పవే . నేను వంకాయ కూర చేసి టొమాటో రసం పెట్టా . నువ్వేం చేస్తున్నావు ?

👩‍🏫ఆర్గానిక్ కీన్వా మిక్సడ్ వెజిటబుల్ రైస్ ఇంఖా యోగర్ట్ పుడ్డింగ్ అండ్ సలాడ్ మా .

👩ఓహో !ఇంకేంటి విశేషాలు ?

👩‍🏫ఏంలేదు మా .. ఆఫీస్ నుండి వచ్చేసా, ఫుడ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి సో, online న్యూస్ చదివేసి వాటికి supporting వీడియోస్ యూట్యూబ్ లో చూసేసి, నా ఒపీనియన్ సోషల్ మీడియా లో పెట్టేసి, దానిపైన ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో ఫాలో చేసేసి, controversial కామెంట్స్ ని షేర్ చేసి హైలైట్ చేసి ఇది ఎంతవరకు సాగుతుందో అని వాట్స్ ఆప్ గ్రూప్ లో డిస్కస్ చేసి ఒక బీపీ మాత్ర వేసేస్కుని పడుకోవడమే ! ఉస్షో .. సో బిజీ యా !24 hours సరిపోవడం లేదనుకో !
మరి నీ ప్రోగ్రాం ఏంటి మా ?

👩ఏముంది. వంట అయిపోయింది, కింద పోర్షన్ వాళ్ళ ఇంట్లో వ్రతం , బజారు కెళ్ళి వెండి కుంకుమ భరిణె తీసుకురావాలి, మల్లెచెట్టు ఒంగి పోతోంది పందిరి మళ్ళీ కొత్తది వేయించాలి , బ్యాంక్ ఆంటీ అమెరికా వెళ్తోంది రెండు రకాల పచ్చళ్ళు , కొన్ని పొడులు పడుతోంది సాయం రమ్మంది. వానలు మొదలయ్యాయి . ఈసారి టెన్త్ క్లాస్ కి క్లాస్ టీచర్ ని, కాబట్టి కాస్త హడావిడే. వచ్చే నెలలో మూడు పెళ్లిళ్లు, స్టేషన్ కాలనీలో ఆంటీ వారణాసి వెళ్లి కొత్త చీరలు తెచ్చిందంట రేపెళ్లి చూసి రావాలి , కనకాంబరం రంగులో ఒక చీర కావాలని చూస్తున్నా . మీరు లేక ఏమీ తోచడం లేదు ,ఒకటే బోరు .

👩‍🏫 😥😱😨😔🙄🙄🙄😳

👩హలొ …హలో … ఇంతకీ కనకాంబరం రంగుకి గ్రీన్ బోర్డర్ తీస్కొనా లేక రెడ్ తీస్కొనా ?

************************************************************************************

You can be a Feminist and enjoy femininity at the same time 💁‍♀️

“ఏరా తల్లీ ?”
“చూడు నాన్నా ! ఇంత ఇష్టపడి ఎంత చక్కగా పెంచుతున్నానా వీటిని !బాల్కనీ ఇనుప చువ్వలని పొడుచుకుని మరీ అటు తిరిగి పూస్తాయే ? ”
“…… ”
“ఇదిగో మళ్ళీ అదే నవ్వు … చెప్పొచ్చు కదా నాన్నా !”

by
Srinidhi Yellala.