నా పెళ్లి జరిగి అప్పుడే ఆరు నెలలు ఆయిపోయింది. హం.. ఏంటో పెళ్లి జరిగిన వెంటనే నాకు అంతా
తెల్సిపోయినట్లు, ఏదో దైవరహస్యం కనుకున్నట్లు అనిపించింది. పెళ్లి కాని వాళ్ళని చూస్తే జాలి వేసేది, ఛ వీళ్ళకు ఏమి తేలీదు పాపం అని! కాని వెంటనే పెళ్ళిలో నా సీనియర్లు అంటే అమ్మ, అక్క, వదిన, అత్త మొదలయిన వాళ్ళని చూస్తే భయం వేసేది, చిన్న గీత పక్కన పెద్ద గీత లాగ.
పెళ్ళైతే ఏదో జీవితం పెద్దగా మారిపోతుంది అనుకున్నా, కానీ జీవితం అలానే ఉంది. అందులోని అనుభూతులే కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా ఉన్నాయి. పెళ్లి రూపంలో దేవుడు(నమ్మేవాళ్ళకి) నాకో మంచి స్నేహితుడ్ని ఇచ్చాడు.
మొదటి రోజు నా మొదటి వంట. మా అయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని స్టార్ట్ చేశా, మరీ రంగప్రవేశం కాదు కానీ ఇంతకు ముందే కాస్త అనుభవం ఉందిలెండి. మా హాస్టల్లో వంటవాడి పైత్యం తట్టుకోలేక రెండేళ్ళు నేను నా స్నేహితురాళ్ళు స్వయంపాకం వెలగపెట్టాం లెండి. తరవాత రెండేళ్ళు అమ్మ వంటని తినటమే కాని ఎలా చేస్తారో కనుకోవటం మాత్రం చేయలేదు. మా ఇంటి వంటిల్లు మా కాలేజీ లైబ్రరీ లాంటిది, ఎక్కడ ఉంటుందో తెలుసు కాని అందులోకి అప్పుడప్పుడే అడుగు పెట్టే దాన్ని. న్యూస్ పేపర్లో సినిమా పేజి చదవటానికి వెళ్ళినట్లు, మంచి నీళ్ళకి, చిరు తిండ్లకి మాత్రమే వంటిల్లు గుర్తు వచ్చేది.
సర్లే ఏది ఐతే అదే అవుతుందని దైర్యంగా మొదలెట్టాను. కొత్త కాపురం అన్ని కొత్త సామనులే. వంటిల్లు ఐతే అప్పుడే రిబ్బన్ కట్ చేసిన స్టీల్ సామాన్ల అంగడిలా మెరిసిపోతోంది. నిజం చెప్పొద్దూ, వారం రోజుల వరకు నాకు అన్నిటిని ముట్టుకోవాలంటే భలే బాధ వేసేది(ఎక్కడ మాసిపోతాయో అని). అంత ముద్దు వచ్చేవి బుజ్జిముండలు. ఉల్లిపాయలు కోద్దాం అని కత్తి తీసాను, సగం కోసే సరికి శ్రీ కత్తి గారు దాని పదును చూపించింది. బుస్సుమని రక్తం. ఏమి చేయాలి. ఆపేస్తే పరువు పోదూ, కొత్త మొగుడు దగ్గర. ఛి క్షమించాలి. కొత్త మొగుడంటే కొత్త పెళ్ళికొడుకు అన్నమాట, నా మొగుడే, ఒక్కగాన్నోక్క మొగుడే.
సర్లే, కొత్త కాపురంలో మొదటి వంటకి రక్త తర్పణం చేశా అనుకుని దానితోనే వీర తిలకం దిద్ది అస్సు బుస్సుమని వంట కానిచ్చేసా.అన్నం, కూర, పెరుగూ అన్నీపెట్టి మా అయన కోసం ఎదురుచూసాను.భలే అన్పించింది సుమండీ.ఎంతైనా కొత్త కదా,ఎదురుచూడం నుండి కలిసి తినడం వరకు అన్నీ కొత్తనే కదా.ఇష్టపడ్డ ఇద్దరు కలిసి చేసేవి అన్నీ కొత్తే, అన్నీ మత్తే, అన్నీ గమ్మతే, కొత్త కాపురంలో.
వచ్చాడు చివరకు, ఒక యుగం తర్వాత మా శ్రవణ కుమారుడు.మా ఆయనే లెండి.ఒక్కో సారి ఒక్కో పేరు పెట్టేస్తుంటాను మా ఆయనకి.ఎలా పిలిచినా అయన నవ్వేస్తుంటాడు, అచ్చు చందమామలాగా.నిజం అండీ, మీరు నమ్మాలి.ఇది కొత్త కాపురం మత్తులో అనడం లేదు,ఇప్పటికీ అలానే అన్పిస్తుంది మా అయన నవ్వు, గుప్పెడు మల్లెలు గుండెలమీద చల్లినట్లు.
“వంట చేశాను తిందాం రండి”, అన్నాను.”ఎం చేసావు”, అని అడిగాడు. కూర చేశాను, అన్నాను.ఏది,అని అడిగాడు.చూపించాను.టమోటాలు ఆలుగడ్డలు వేసి చేశాలే.”ఇది సరే, ఇంతకీ కూర ఏది?”, అన్నాడు.ఇదే కూర, అన్నాను.”కాదు ఇది వేపుడు అంటారు.కూర లోకి, పెరుగు లోకి నంజుకుంటే బాగుంటుంది”, అన్నాడు.నాకు అట్టే తేడా తెలీలా.ఇది మరీ బావుంది, కూరంటే కూరె.వేపుడు ఏంటి, నా మొహం.మా ఇంట్లో నేను అన్నింటినీ కూర అనే అంటాను.మా అయన మాత్రం, కూరని కూరే అనాలి, పులుసుని పులుసే అనాలి, వేపుడు వేపుడే అనాలి అని కొంచం లెక్చర్ ఇచ్చాడు. కొత్త కదా ఆ మత్తులో అబ్బ, మా అయనకు ఎన్ని విషయాలు తెలుసో అని మురిసిపోయాను. అది సరి కానీ వెళ్లి కూర పట్టరా అన్నాడు, అంతా ఇంతే అన్నాను. మరి రసమో అన్నాడు! నాకు మతి పోయింది. నా వంట చూసి మతిపోతుందని నేను అనుకుంటే మా అయన అడిగే వాటికి నా మతే పోయింది. సరే కొత్త పెళ్ళాం అపురూపం కనుక ఆ కూరే (మరేమంటారో మీరు) వేపుదని, కూరని, పులుసని, చారు అనుకుందాం అన్నాడు మా పులకేసి( మా ఆయన్నే… చెప్పాగా నా మొగుడు నా ఇష్టం).
రెండు కంచాలు పెట్టాను, ముద్ద( ఛీ ముద్దు కాదండి నిజంగా) పెట్టుకుందామని చెయ్యి పెడితే, కారం తగలగానే చుర్రుమంది, అబ్భా అనేసాను. కొత్త పెళ్ళాం బహుకోమలం కదా కొత్త మొగుడికి( ఛ కొత్త కొత్త ఎక్కువ ఐపోయింది ఏం చేయను కొత్త ఎంతైనా వింతే కదా….) మా అయన ఎంత దిగులుపడిపోయాడో… సీతమ్మకి వచినన్ని కష్టాలు నాకోచ్చాయని బెంగేట్టేసుకొని అదయిపోయి, ఇదయిపోయి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసేసాడు. నేను ఇవన్నీ చూసి అసలు నొప్పి గోరంతఐతే, కొండంతగా విలవిలలాడిపోయాను. మా అయన దగ్గర వయ్యారాలు, వగలు పోవడం భలే సరదాగా వుంటుందిలే. అదే పెళ్ళికి ముందైతే ఒక బ్యాండ్ఎయిడ్ చుట్టేసుకొని చచ్చినట్టు స్పూన్తోనో లేకపోతే చేతితోనో తంటాలు పడాల్సివచ్చేది. హం… మొత్తానికి ఉత్తర కుమారుడు నా వేలుకి ఫ్రాక్చర్ అయిదన్నంతగా బెంగపడిపోయి రెండు కంచాలని ఒక్కటి చేసేసి, రెండు చేతులుని ఒకటి చేసేసి గోరు ముద్దలు తినిపించాడు. నేను మధ్యలో నొప్పి నటించి మా ఆయన్ను కంగారు పెట్టాను. ఈ విషయం ఆయనకు చెప్పకండెం. నా సీక్రెట్ … కాదులే మన సీక్రెట్…. హ హ ….
మా అయన దగ్గర అలా మొదటి రోజే గోరుముద్దులు, ఛ ఛ ముద్దలు తినేశానన్నమాట. చెప్పాగా జీవితం ఏమి మారలేదని, కాని అనుభూతుల్ని మాత్రం ఇస్తుంది. మనం దాని తీసుకునేదాన్ని బట్టి అవి తీపి లేదా చేదు జ్ఞాపకాలుగా అవుతుంటాయి.
తరవాత నేను చేసిన మొట్ట మొదటి పని, వెంటనే వంటింట్లోకెళ్ళి నేను తిట్టిన తిట్లకు అలిగి, అలిసి, సొలసి మూలన పడి కూర్చున్న శ్రీ శ్రీ కత్తిగారికి గట్టిగా ఒక థాంక్స్ చెప్పుకున్నా. మరి అంత మంచి అనుభూతిని తర్వాత్తర్వాత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిందికదా అందుకని. లైట్ దానిపైన పడి కొత్త కతి కదా అది చమ్మక్కుమంటే నిజంగ్ నాకు అది కన్నుకొట్టి నవ్వినట్టే ఉంది. ఇప్పుడు తలచుకున్నాకూడా! తరువాత ఏమైందో మనలాంటి పెద్దవాళ్ళకు అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పనక్కరలేదనుకుంటా ….
Leave a Reply