మన జీవితంలో ఇంకో సంక్రాంతి కి స్వాగతం చెప్పబోతున్నాం . ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు చూసాను , కాని నాకు నచ్చిన సంక్రాంతి ఒక్కటే . అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగింది . సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త బట్టలు,సినిమాలు,మా అమ్మ చేసే తెలుగు వారి పండగ మెనూ అదేనండి పులిహోర,పాయసం,వడ,బూరెలు,etc ఇన్తే అనుకునేదాన్ని . ఎందుకంటే టౌన్ లో ఇలానే చేస్తారు ,ఇంతే చేస్తారు కాబట్టి . పల్లెల్లో వేరేగా ఉంటుందని వినడమే కాని చూడలేదు ,కాబట్టి సంక్రాంతి అంటే ఇంతే,అని నా ఫీలింగ్ కాని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన సంక్రాంతి నేను మరిచిపోలేను . ఆ ఒక్క సంక్రాంతి చాలు జీవితానికి అనిపించింది.
తాజ్మహల్ చూడాలంటే ఆగ్రా లోనే చూడాలి, సంక్రాంతి వైభోగమంటే పల్లెల్లోనే చూడాలి , ఏమంటారు . ఎందుకో చెప్తాను చూడండి . మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాకు చాలా దూరం ,కాబట్టి చిన్నప్పుడు ఎక్కువగా వేసవి సెలవుల్లోనే వెళ్ళేవాళ్ళం , కాస్త పెద్దైయ్యాక తరచుగా వెళ్ళేవాళ్ళం . మామయ్య ఆ సంవత్సరం సంక్రాంతికి ఊరు రమ్మన్నాడు ,అందరం వెళ్ళాం . అది పల్లెటూరు చాలా రిమోటు విలేజి కాని మనుషులు మాత్రం తెలివైనవాల్లెనండి బాబు ,అంటే లౌక్యం ఎక్కువ,అది మన లాగ సిటీ పిల్లలకి ఉండదు .
ఆ ఊరు అంటే నాకు చాలా ఇష్టం. మీరు నమ్మరు కాని ఆ ఊర్లో మొత్తం 19 ఇల్లవాళ్ళే వుంటారు తెలుసా . అంత చిన్న ఊరు అన్నమాట . ఊరి మధ్యలో చింతచెట్టు దాని చుట్టూ రచ్చ బండ ఉంటాయి . ఈ చెట్టు చుట్టూ ఇళ్లు ఉంటాయన్నమాట . ఊరికి ఒకే ఒక్క గుడి, చిన్నది, శ్రీ రామచంద్రమూర్తి ది. అంత చిన్న ఊరు కావడం వల్ల, ఉన్న కొద్ది మంది జనాభా కాస్తొకూస్తొ చదువుకున్నవాళ్ళు అవడం వళ్ళ ఊరు చాల నీట్ గ ఉంటుంది .. చాల పల్లెలు చూసాకాని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉన్నంత నీట్ నెస్ ఎక్కడా చూల్లెదు . దీనిబట్టి మన దేశం లో నీట్ నెస్ లేకపోవడానికి ఓవర్ పాపులేషన్ కారణం అని నా గట్టి ఫీలింగ్ .
ఇక పోతే సంబరాల్లోకి వచేద్దాం . ఇంటికి వెళ్ళగానే మా అమ్మమ్మ బోసినోటితో నవ్వుతూ ఎదురొచిన్ది . భలే తమాషాగా అనిపించింది. అదేంటో అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉండే ఆ సెక్యూర్ ఫీలింగ్ ఎవరిదగ్గర రాదు . భోగి పండుగ ముందు రోజు వచ్చాము మేము . అత్తయ్య పిండి రుబ్బుతోంది స్టార్ట్ అయ్యాయన్నమాట పనులు. అత్తయ్య ఆగకుండా చేస్తోంది పని , కాని అమ్మమ్మ మాత్రం మా రోజుల్లో ఇలాకాదే అమ్మా ,ఏంటో ఈ కాలం పిల్లలు అంటూ సనుగుతూనెఉన్ది . అమ్మ, అత్తా ముసిముసిగా నవ్వుతూ పనులు చేస్కుంటున్నారు ,ఆవిడ మాటలు అసలు పట్టించుకోకుండా .నన్ను పని నేర్చుకోమని ఒకటే గొడవే మా అమ్మమ్మ . పెళ్ళైతే ఎలాగు తప్పదు ఇప్పట్నుంచే ఎందుకు అని మా మామయ్య సపోర్టు చేసాడు . అంతే కదా మరి కాస్త ఫ్రీడం ని ఎంజాయ్ చేసేది ఇప్పుడే కదే అమ్మమ్మా అని నేను అంటే ,మళ్ళీ పాత పాట స్టార్ట్ చేసింది,మా రోజుల్లో అంటూ ,….. ఆపవే బాబూ అని నేన్ పారిపోయాను . మామయ్య నాకు మంచి ఫ్రెండ్ ,అయన బైక్ ఎక్కి కాస్త మా తోట దాకా వెళ్లి వచ్చాను.
బైక్ లో వెళ్తుంటే బలే ఉంది ,ఎటుచుసినా పొలాలే .సమ్మర్ లో వచిన్నప్పుడు ఇంత బాగా వుండవు ,చాల హాయ్ గా అన్పించిన్ది. ఊరికి రావాలంటే కట్ట మీదనుండి రావాలి ,దానికి ఒక వైపు చెరువు ఇంకోవైపు పొలాలు ఉంటాయి . కట్టకి అటూ ఇతూ రావి చెట్లు ఉండేవి ,దానిమీద నడుస్తుంటే రావి చెట్టు గాలి బలే ఉండేది .కాని ఆ సంవత్సరం ఏదో ఇందిరమ్మ పధకం కింద చెట్లు కొట్టేసారు ,పనులు మాత్రం ఏమి జరిగేట్టు లేవు కాని చెట్లు మాత్రం పోయాయి . హూ …. బలే బాధేసింది . అందమైన వాలుజడ ఉన్న పిల్లకి డిప్ప కటింగ్ చేసినట్లైంది .
రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం . పొద్దున్న 3గంట్లకనుకుంట మా అమ్మమ్మ నిద్ర లేపేసింది . ఆ టైం కి అసలు నేను ఎప్పుదూ లేచిన్దిలేదు , భోగి మంటలు వేస్తున్నారు లే అని. సినిమాల్లో తప్ప ఎప్పుడూ చూడలేదు . చలికి వణుకుతూ బయటికి వెళ్ళాను . మామ వాళ్ళంతా అప్పుడే మంటలేసి చలికాచుకున్తున్నారు. చలి కి నేను కుడా వెళ్లి దాని ముందు కూర్చున్నాను. భోగి మంటల్లో చీడ పీడ అంతా పోతుందంట . పాత వస్తువులకి ఆలోచనలకి మంటల్లో టాటా చెప్పేసి జీవితం లోకి కొత్త వాటికి స్వాగతం చెప్పాలంట ,అమ్మమ్మ చెప్పిన్ది. అమ్మమ్మ కి ఎం తెలియదు అనుకోవడం నా తెలివితక్కువతనం అన్పించింది . ఒకవైపు చలి చలి గా ఉంటే మంటల్లో చలి కాచుకోవడం భలే బాగుంది .
అమ్మావాళ్ళు మళ్లీ పనులలో పడిపోయారు ,ఈ పెద్దాల్లున్నారే రే రే …అనుకుంటూ నేన్ చక్కగా మళ్లీ ముసుగేస్కుని పడుకున్నా . పొద్దున్నే ముగ్గులు పెట్టి నేను,మామ వాళ్ళ పిల్లలు రంగులు వేసాం . అందులోకి కి గొబ్బెమ్మలు పెట్టి పైన గుమ్మడి పువ్వు పెట్టి పసుపు కుంకుమ పెట్టింది అత్త . అది గౌరీ దేవి అంట . అమ్మమ్మ దణ్ణం పెట్టుకోమంది ,సర్లే తర్వాత పెట్కుంటాను అన్నాను , గొబ్బెమ్మ కి దణ్ణం పెట్టుకుని కోరుకుంటే మాంచి మొగుడు వస్తాడు అంది , అప్పుడు వెంటనే చాల సిన్సియర్ గా దణ్ణం పెటుకున్నాను .అది చూసి తెగ నవ్వింది అమ్మమ్మ . హూ …. మరి కొట్టాల్సిన చోట కొట్టింది ఎంతైనా ఎక్స్పీ రియన్సు కదా .వాళ్ళ చిన్నప్పుడు పెళ్ళికాని పిల్లలు పాటలు పాడేవాల్లట ….
సువ్వి గొబ్బెమ్మా శుభాన్నియ్యవే
తామరపువ్వంటి తమ్ముడ్నియ్యవే
చామంతి పువ్వంటి అత్త నియ్యవే
మల్లెపువ్వంటి మామనియ్యవే
మొగలిపువ్వంటి మొగుడ్నియ్యవే
బంతిపువ్వంటి బతుకు నియ్యవే అనీ
నాకు పాడి చెప్పింది ,తాత వింటే ఒక్కటిస్తాడు ,ఇప్పుడు లేడు కాబట్టి సరిపోయింది, అని నేను పరిగెత్తా . నన్ను తిట్టిపోసింది ,ఆనక నవ్వేసిన్దిలెండి .
ఈ లోపు టిఫిన్ రెడీ . అది లాగిచ్చేసి మామ తో కలిసి టౌన్ దాకా వెల్లాను. ఆవుల కోసం డెకరేషన్ సామాన్ల కోసమ్. చాల పెద్ద సంత . ఆవులకి ఎద్దులకి ఇన్ని వస్తువులు ఉంటాయా అని ఆశ్చర్యమేసింది . ఇంటికి వచేసరికి అమ్మ వాళ్ళు అరిసెలు చెస్థున్నరు. వాళ్ళకి కొంచం హెల్ప్ చేసానన్నమాట .
తర్వాత ఆ రోజుకి ఏమి లేదండి, సాయంత్రం ఈ టీవీ లో పాత సినిమా వేస్తే చూసి భోంచేసి బజ్జున్న్నాం .
తరవాత రోజు సంక్రాంతి ,మళ్ళీ ఆ రోజు కుడా తలస్నానం చేసి కొత్త బట్టలు ,పిండివంటలు లాగించి , అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నాం . మధ్యాహ్నం నేను మామ మళ్లీ మా ఊరు వెళ్ళాం , మా నాన్న అక్కడ ఉన్నారు . నాన్న వాళ్ళ ఊరు వెళ్తే ఇంక్కేక్కడికి రారు .సంక్రాంతి పెద్ద పండుగ కదా అల్లుడిని పిలవాలని మామ వచ్చాడు,మా సొంతూరు పక్కనే,పెళ్లై ఇన్నేళ్ళయినా కుడా వచ్చి మరీ పిలవాలి అంటాడు మా మామ . రాత్రికి మళ్లీ అమ్మమ్మ దగ్గరికి వచ్చేసా , అ ఊరికి ఈ ఊరికి బైక్ లో 10 నిముషాలు అంతే.మా నానమ్మ వాళ్ళ ఊర్లో పండుగ లేదు . అంటే ఊర్లో ఎవరో చనిపోయారు కాబట్టి ఆ ఇయర్ సంక్రాంతి లేదు . పల్లెల్లో ఇప్పటికీ అందరికీ వీలైనప్పుడే చేస్కుంటారు ,ఎవరిన్ట్లోనైన ఇలాంటివి జరిగితే ఊరంతటికి పండుగ లేదు .
సంక్రాంతి రోజు కన్నా తర్వాత రోజు కనుమ చాలా పెద్దగా చేస్తారు మా వైపు .
కనుమ రోజు హడావిడి అంత ఇంతా కాదు. ఆ రోజు భలే పని. నేను మామ్మయ్య పొద్దునే అవులని తీస్కుని చెరువు దగ్గరికి వెళ్ళాము ,వాటిని శుబ్రంగా కడికి ఎండలో కట్టేసాడు . తర్వాత ఇంటికి తీస్కొచ్చి వాటి కొమ్ములకి రంగులు వేసాము థ భలే సరదాగా వున్ది.
తర్వాత రెస్టు . సాయంత్రం 3 గంటలకి గుడిలో గంటకొట్టారు , మా అమ్మమ్మ నా చేతికి పళ్ళెం ఇచి పంపింది .నేను పిల్లలూ వెళ్ళాము .. పళ్ళెంలో వున్నా బియ్యం,బెల్లం,పాలు,నెయ్యి అక్కడ ఇచ్చాము, అలా అందరూ తెస్తారు , సాయంత్రం తోటలో దాన్ని వండి పరమాన్నం ప్రసాదం అందరికి ఇస్తారట . చూసారా ఇక్కడ ఎంత ఏకత్వం ఉందో .
ఈ పధతి బాగా నచ్చింది . ఇంకా ఇంటికి వచ్చి ఆవుల్ని రెడీ చేసాము రిబ్బన్లు, బెలూన్లు , పెట్టి తెగ రెడీ చేసాం . అందరూ సాయంత్రం తోటలోకి తీస్కోచినప్పుడు పోటి అనమాట ఎవరి ఆవులు బాగున్నాయో అని .
వాటిని రెడీ చేసి మేము కుడా రెడీ అయ్యము. తర్వాత అందరం కలిసి తోట లో ఉన్న కాటమరాజు దేవుడి దగ్గరికి వెల్లాము. అందరం అంటే ఆవులు కుడా అనమాట. పల్లెల్లో ఆవులు కూదా ఫ్యామిలీ మెమ్బర్సె …
అన్ని ఆవులు అంత చక్కగా రెడీ ఐ వస్తే భలే అనిపించింది . ట్రాక్టర్స్ వచ్చి ఎద్దులు లేవు కానీ అవి ఇంకా అందంగా ఉండేవట .
తర్వాత ఒక చోట పెద్దమంట వేసి ఆవులకి చూపించారు , అవి భయం తో పారిపోయాయి , నేను కంగారు పడితే ఏమి కాదు, అవే వచ్చేస్తాయి ఇంటికి అన్నారు, నాకు ఆశ్చర్యం వేసిన్ది. అలా చేస్తే వాటికి దిష్టి పోతుందట . ఇప్పటికి పాలూ ,ఎరువు రూపమ్ లో ఆవుల వల్ల మంచి ఆదాయం వస్తుంది ఊర్లలో , అందుకని వాటిని చాలా బాగా చూస్కున్తారు ..
తర్వాత ప్రసాదం పెట్టారు.నా ఫ్రెండ్స్ (అంటే వాళ్ళకి కుడా అది అమ్మమ్మా వాళ్ళ ఊరు అనమాట) వచ్చారు , వాళ్ళతో కలిసి కాసేపు అలా కట్ట మీద నడిచి ఇంటికి వెళ్ళాను,ఆవులు వచ్చాయా లేదా అని చూస్తే చక్కగా వచ్చి అప్పుడే నెమరు వేస్తున్నాయి హాయిగా ….
నాన్న వచ్చాడు ఇక అమ్మమ్మ అది నాయనా ఇది నాయనా అని చంపేసింది .. తర్వాత భోజనాలు . ఇన్నేళ్ళ తర్వాత కుడా నాన్నకి స్పెషల్ ట్రీట్మెంట్ … నవ్వొచింది అమ్మమ్మ హడావిడి చూస్తే .
ఇంక చాలా అలసిపోయాను …. బాగా నిద్రపట్టేసింది ….మనసు ఆనందంగా వున్నప్పుడు వచ్చే నిద్ర భలే మత్తుగా ,కమ్మగా వుంటుంది .
….. …
…..
….
తరవాత చాలా సంక్రాంతులు వచ్చాయి అన్నీ , టీవీ ముందో లేక హాస్టల్లో గడిచాయి కానీ ఇంత చక్కని పండుగ మళ్లీ ఎప్పుడూ చేస్కోలేదు .
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ……..
వుంటాను బై
Leave a Reply