పుట్టగానే మనిషికి జాతి లక్షణాలు తెలిసిపోతుంటాయి. చూడండి చిన్నపిల్లలు గా వున్నప్పుడే ఆడపిల్లలు పూలు, పండ్లవైపు మొగ్గు చూపితే, మగపిల్లలు కత్తులు, కటార్ల వైపు మొగ్గు చూపుతారు.ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మా ఎదురింటి పాప మా ఇంటికి వచ్చింది.పట్టుమని మూడు ఏళ్ళుకూడా లేవు అప్పుడే అది నైల్ పాలిష్ సీసా తెచ్చి పూయమంటుంది, లిప్ స్టిక్ వేయమని చెపుతుంది. అప్పుడే ఎంత ఇంటరెస్ట్ వచేసింది దీనికి అనుకున్నాను.
తనని చూస్తే చిన్నప్పుడు నేను గుర్తు వచ్చాను. చిన్నప్పుడు నాకు బాగా ఇష్టమైనది పెళ్ళిళ్ళకి వెళ్ళడం.ఇక పెల్లికూతురంటే హీరోయిన్లాగా అనిపించేది.పెళ్లి జరిగినంత సేపూ పెల్లికూతురు పక్కనే వుండేదాన్ని.అన్నిటికన్నా పెల్లికూతురికి వేసే పూల జడ అంటే చచ్చేంత ఇష్ట పడిపోయేదాన్ని.అంతపెద్ద జుట్టు కి అందంగా పూలు చుట్టి , జడ గంటలు పెడితే ఎంత బాగుండేదో.వెనకాలే వుండేదాన్ని పూల జడ చూడడం కోసం.అసలు పూల జడకోసం త్వరగా పెరిగి పెళ్ళి చేసేసుకోవాలి అనిపించేది. ఒక సారి తమాషా ఏమైందంటే, ఇలాగే పెళ్ళికి వెళ్ళాం, ఎప్పటిలా పెళ్ళి కూతురు వెనకాల నడుస్తున్నాను, ఆవిడ గారికిజుట్టు లేకపోయేసరికి ఇంత బారు సవరం పెట్టి పూల జడకుట్టారు.
పూల జడ అంటే బరువు కదా సరీగ్గా పీటలమీద కూర్చునెసరికి అది కాస్తా ఊడి కింద పడింది.అయ్యో పూల జడ ఊడిపాయిందో అని నేను అరిచాను, పక్కనున్న ఆవిడ నానోరు గట్టిగా మూసేసింది.అప్పటికే మంటపం లో ఉన్నవాళ్లు ఘోల్లు మన్నారు.పంతులూ, పెళ్ళికొడుకు అందురూ నవ్వడమే.ఏమ్చేస్తారు అప్పటికప్పుడు తాడుతో సవరాన్ని జుట్టుని జాయింట్ చేసారనమాట.అప్పుడు నాలో నేనే శపధం చేస్కున్నా నా పెళ్ళికి నాకు సొంత జడ వుండాలని, ఎన్ని ఫాషన్లు ఊరించినా కుడా నా పెళ్ళి వరకు పొడుగు జడ మెయింటైన్ చేసాను,నాకిష్టమైన పూల జడ కోసం.
తర్వాత ఒకసారి మా పాత ఫోటోలు చూస్తుంటే, మా అక్క చిన్నపటి ఫోటో ఒకటి కనిపించింది, పూల జడవేస్కుని అడ్డం ముందు నిల్చోపెట్టి స్టుడియోలో తీసారు.ఎంత బాగుందో ఫోటో, లంగా జాకెట్టు లో ముద్దు గా ఉంది.నాకెందుకు తీయలేదు అని ఒకటే గోల చేసాను ,ఒక పూట అన్నం కూడా తినలేదు.అసలు రెండో పిల్లగా పుడితే అన్నిరోటిన్ అయిపోతాయ్ పెద్దాలకి.వాళ్ళ కన్ని కొత్తవి, వాళ్ళు వాడేసినవి నాకు.పుస్తకాలు, సైకిలు,డిక్షనరీ,అన్నీఅక్క వే నాకు.ఇప్పటికీ వెక్కిరిస్తుంటాను అమ్మని, నా కన్నీసెకండ్ హ్యాండ్ వే ఇస్తావు అని.అప్పట్లోఉడుక్కునేదాన్ని, ఇప్పుడు నవ్వొస్తుంది.కాని అప్పటికి అది నాకు వరల్డు ప్రాబ్లం అంత పెద్దది.
తర్వాత మా పెద్దత్తని అడిగాను, పూలజడ గురించి, చాలారకాలు ఉన్నాయంట.వాళ్ళ చిన్నప్పుడు పూలజడలు కుట్టడం కూడా నేర్పెవారంట.మల్లెలతో, అరటి చెట్టు బోదె ని సపోర్ట్ గా పెట్టి కుట్టేవాల్లంట.ఉత్తి చామంతులతో, మొగలి పూలతో కూడా చేసేవారంట.ఒకసారి వాళ్ళ ఫ్రెండు పెళ్ళి కి రాత్రి మొగలి పూలతో జడ కుడితే, తర్వాత రోజు వాళ్ళాయన ఒళ్ళంతా చీరుకుపోయిందట. నవ్వకండి పాపం….ఎందుకో మీకూ తెలుసూ నాకూ తెలుసు.
ఇంక నా పెళ్ళికి పూల జడ ఆర్డరు ఇచ్చారు, నాకేమో నేనే వెళ్ళి చెప్పి చేయించుకోవాలి అని. నన్నేమో ఇల్లు దాటనివ్వరు.కాని ఇప్పుడు అంతా అడ్వాన్సు కదా పూల అతనికి ఫోన్ ఉంది, నాన్న ఫోన్ చేసిస్తే నేనే చెప్పాను నేను చెప్పినట్టు చేసిచ్చాడు.చివరికి నేను చిన్నపటి నుండి కన్న నా కల నా పెళ్ళి కి నెరవేరింది అనమాట.
అందుకే చుట్టాల్లోచిన్నపిల్లలుంటే వాళ్ళకి పూలజడలు వేసి ఒక ఫోటో తీయిస్తుంటాను.పెళ్లప్పుడు ముగ్ధలాగా వుంటే, చిన్నపుడు అమాయకంగా ఇంకా బాగుంటారు…పోయిన వేసవి కి మా అయనవాళ్ళ అక్కకూతురు వస్తే దానికి పూల జడ వేసి నా సరదా తీర్చుకున్నాను.ఎప్పుడూ లేటెస్టుఫాషన్ లో ప్లాస్టిక్ పువ్వులా వుండే పిల్ల అచ్చు ముద్డ్డ బంతిలా ఎంత చక్కగావుందో.
కావాలంటే తేడా మీరే చూడండి
మీకు ఆడపిల్ల వుంటే తప్పకుండా ఒకసారి పూల జడ ట్రైచెయ్యండి, మీ చిన్నారి పాపాయి ఎంత చక్కగావుంటుందో చూడండి, ఫోటోని దాచి పెట్టి తను పెద్దైయ్యాక “కానుకగా” ఇవ్వండి……
అప్పట్లోప్రతి వారూ తమ పిల్లలకి పూలజడ కుట్టించి ఫోటోతీసేవారు. ప్రతి ఒక్కరి దగ్గర అలంటి ఫోటోఒకటి ఉండేది.ఆపుదప్పుదూ పేపర్లో ఆర్టికల్స్ కూడా వస్తుంటాయ్, బామ్మలు, ఆంటీలు రాసినవి, వాళ్ళ కాలం గురించి గొప్పగా చెపుకుంతుంటారు.
మరి మనం కూడా చెప్పుకోవాలి కదా.మన పిల్లలకి కూడా మనం అందమైన జ్ఞాపకాలని అందించగలం అని నిరూపించుకోవాలి కదా, ఏమంటారు?.మన పెద్దవాళ్ళ కాలం నాటి ఆనందాలను మన చిన్నారులకి ఇస్తూ, అదే విధం గా ఈనాటికి తగ్గట్టుగా ఆధునిక వసతులన్నీసమకూర్చాలి వాళ్ళకి అంటాను, ఏమంటారు?
“ఈ కాలం పిల్లలకిఏమితెలీదు, సరదాలు ముచట్లు ఏమి రావు అని అంటూ వుంటారు కదా, ఆ అవకాశం పెద్ద వాళ్ళకి ఇవ్వకండి. మోడ్రన్ గా వుండండి, పిల్లలనిఈ కాలానికి తగ్గట్టుగా నే పెంచండి, కాకపోతే అప్పుడప్పుడూ మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇలాంటి సరదాలని వాళ్ళకి కూడాఅందించండి.”
Leave a Reply