సాయంకాలం కబుర్లు
  • my blog…
సరదా కబుర్లు 0

సరదాగా !

By Srinidhi Yellala · On August 14, 2020

You need expertise to excel at this routine!

“ఏవమ్మా! ఏమన్నా అంటే అన్నానంటావు గానీ ! మనుషులు అన్నాక కాస్త ఇంగితం ఉండాలి కదా ?”

“ఇప్పుడు నేనేం చేసా ?!”

“పిల్లి పిల్లల్ని మార్చినట్లు రోజుకొక గూట్లో పెడతావ్ ! పోనీలే చలిదేశం కదా అని సర్దుకుపోతున్నానా … గూట్లో పెట్టి తలుపేసాక ఘడియకో సారి వచ్చి దేనికో ఒక దానికోసం తలుపులు తెరుస్తుంటే ఎట్లాగమ్మా ..అరె ! మేము ఒక దీక్షలో ఉండి తోడుకుంటున్నాం అనే కామెన్ సెన్స్ లేకపోతే ఎలాగమ్మా ! వెధవ డిస్ట్రబెన్సు! నేను హర్ట్ అయ్యాను అంతే ! నీకు రేపు పెరుగూ లేదూ మజ్జిగా లేదు .. స్టోర్ లో జిగురు యోగర్ట్ ఏ గతి ఇక పో !”

“అయ్యో అయ్యో ! తోడు గారు మీరు అలక పాన్పు ఎక్కకండి ! మీరు లేక పోతే భోజనానికి ముగింపు లేదు ! బాబ్బాబూ!!”

*****************************

Happiness is infectious on Festivals 💕💕💕Happy దీపావళీ 🤩దీపావళీ dairies 1

పాం బిళ్ళలు, అగ్గిపెట్టెలూ , నున్నటి కాకరొత్తులూ , తాళ్ళతోటి సైలెంటుగా సగం దేహం అమ్మ చీరలో దాచుకుని నాన్న చెయ్యి పట్టుకున్నాడనే ధైర్యంతో అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో చిన్న సైజు సైంటిస్ట్ గా ఫీల్ అవుతున్న నేనూ !ఇంతలో : పిల్లలూ తప్పుకోండీ అంటూ.. లక్ష్మీ బాంబులు, ఆటం బాంబులు , మైలున్నర పొడవుండే సీమటపాకాయల గొలుసులూ, రాకెట్లు లాంటి బ్రహ్మాండం బద్దలయ్యే ఢాం టపాకాయల సరకుతో దిగిన సీనియర్ పిల్లకాయలు బ్యాచు !మరుక్షణం ‘అనా .. ఒక్క నిమిషం నా’ అని చెప్పి … చివరి గది మంచం కింద నాలుగో మూలకి జేరి గోడవైపుకి తిరిగి చెవులు, కళ్ళు మూసుకుని భామ్ టపాసులు పేల్చే వాళ్లందరికీ శాపాలు పెడుతున్న నేను ! #పక్కకెళ్లిఆడుకోండమ్మా

**************************************

Happy Halloween 👻

“ఏంటీ ఏమీ పట్టనట్టు మీ పనుల్లో వుండిపోయారూ .. ఈరోజు ఎవరినీ భయపెట్టరా ??”

“చాల్లే వెటకారం … ఎవడికీ మేమంటే కూసింత రెస్పెక్ట్ కూడా లేకుండా పోయింది!! చిన్నా లేదూ పెద్దా లేదూ … రాజసంగా బయటికెళ్లి కాస్త ఎవడినైనా దడిపిద్దామంటే చేతిలో చాకిలెట్ యెట్టి పక్కకెళ్ళమంటున్నారు ! హవ్వ .. సిగ్గు సిగ్గూ ! మాకూ పోయింది ఇంటరెస్టు ! సార్ విఠలాచార్య గారూ చూడండి సార్ ఈ అన్యాయము !”

*************************************

What was yours 😛🤪

హై వే మీద హాయిగా పాటలు వింటూ వెళ్తున్న మేము .. ఒక్క పాట పెడితే చాలు గొలుసు కట్టు లాగా ఆ సంవత్సరం, ఆ హీరో , ఆ జోనర్ ఇలాగ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా permutations and combinations లో ప్లే చేస్తున్న యూట్యూబు !! ఉన్నపాటుగా ఒక పాట !!!

“ఓరోరి యోగీ నన్ … !!!!”

“నో ! నహీ ! వద్దు బాబోయ్ … నెస్ట్ కొట్టండి .. పాస్ చేసెయ్యండి .. స్కిప్ స్కిప్ స్కిప్ ఇట్ ..”

“ఏమైంది .. జస్ట్ పాటే కదా .. ఏం జేసావ్ ఫ్లాష్ బ్యాక్ లో..”

“రెండో సంవత్సరం సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చా ! ఆరేసిన బట్టలు తెచ్చి సాయం చేద్దామని మెద్ది పైకి వెళ్లాను! మా మ్యూజిక్ చూసి వెళ్లానేమో .. ఈ పాట పాడుతూ ఉన్నా .. అదీ ఒక తప్పే?? .. నాకేం తెలుసు అమ్మ వెనకాలే వస్తుందని ! అబ్బా “వీపు విమానం మోత మోగును” కి సొంత వాక్యం రాయమంటే నా పరిస్థితి గురించి రాయొచ్చు ..ఈ పాట విన్నప్పుడల్లా ఆ మంట కూడా గుర్తొస్తుంది… ఫ్రెష్షుగా ”

“తిన్నగా ఉండవా అసలు !”

“సర్లే .. అందరికీ ఒక పాట ఉంటుంది మరి .. జనరేషన్ కి తగట్టు..”అంతే కదూ !! 😜

******************************************

What did you wish for! ❄️❄️

“హ్మ్మ్!! హ్మ్మ్ !! హ్మ్మ్ !!”“చూసేసావా !! అక్కడికీ మెల్లగా పిల్లిలా వచ్చానే !!”“నన్ను తప్పించుకోలేవు. సర్లే కానీ ఏం చేస్తున్నావ్?”

“ఆబ్బె ! అః .. ఏమీ లేదే .. ఉత్తినే ! స్టేటస్ కోసం క్రిస్మస్ చెట్టు ఫోటో తీసుకుందామని వచ్చా .”“అర్ధ రాత్రి అందరూ పడుకున్నాక !!”

“అబ్బా సరేలే !! చెప్తా .. నేను కూడా ఒక విష్ రాసి బుడ్డి లాగే సాక్స్ లో పెడదామనీ !!”

“ఇందాకే కదా ‘కార్తీక దీపాలు, శాంటా క్లాజ్లు అంతా మూఢ నమ్మకాలూ’ అన్న పోస్టు కి వేలు అరిగేలా లవ్ ఐకాన్ నొక్కావ్ !!”

“ఇంత దుర్మార్గంగా ఉన్నావేంటి !! ఒప్పుకున్నాగా వదిలేయ్ !”

“ఏం కోరుకున్నావో చెప్పు వదిలేస్తా !”

“అదీ .. మేరీ పాప్పీన్స్ హ్యాండ్ బాగు . మొన్న 5 రోజుల జాతరలో కొన్న సామాన్లన్నీ ఇంట్లో సర్దడం కష్టంగా ఉందీ .. ఆ బాగ్ ఇస్తే పొందిగ్గా అన్నీ అందులో వేసి పెట్టుకుందామని .. ఆ ఒక్కటీ చీటీ రాసి పెట్టాను శాంటా మర్చిపోకుండా .”

********************************

Childhood🤪🤗😬

“అమ్మా !! నేను హోల్ ప్రపంచాన్ని ప్రొటక్షించేస్తాను…చూస్తూ ఉండు !”

బుడ్డి దానికి అన్నీ నా పోలికలే .. నేనూ ఇంతే. చిన్నప్పటినుండి లోక కళ్యాణం కోసం నా వంతు రాళ్లు వేస్తూ ఉండేదాన్ని కదూ. గర్వంతో కూడిన కి కి కి!

“ఏంటి . నువ్వు . లోక కళ్యాణం కోసం . చిన్నప్పటినుండీ !!”

“వచ్చేసావా ఠన్చనుగా . అవును నేనే .. కాదేంటి?”

“ఓ సారి ఫ్లాష్ బ్యాక్ కెళ్ళు .. 97లో .. సెలవులకు దిగిన చుట్టాల బ్యాచ్ లో చుడీదార్ వేస్కోడం మొదలెట్టిన అక్క దగ్గర బతిమాలి బామాలి చున్నీ అప్పిపించుకుని !! గుర్తొచ్చిందా?”

“ఉష్షు .. ఉస్షో .. ష్ .. ష్షు !”

“ఆఁ.. లోక కళ్యాణం కోసం ఆ చున్నీ కొనని మెడకి తగిలించి .. ‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్లో’ అని ఇల్లంతా గంతులేసుకుంటూ”

“ఆపవే బాబూ ఇహ .. గుర్తొచ్చిందిలే !”

“కొస మెరుపు చెప్పనీ .. టేబుల్ ఫ్యాన్ ముందు చున్నీ వెనక ఎగురుతూ ఉంటే… ‘చికు బుకు చికు చిన్నోడోయమ్మా’ అంటూ పెరిగెట్టుకుంటూ వెళ్లలేదూ ! సూపర్ విమెన్ 1997 లా!”

“ఇంత కసేంటే తల్లీ నా మీద. నువ్వు నా వెంటుంటే ఇహ బాగుపడ్డట్టే.”

What the #చికుబుకుచికుచిన్నోడోయమ్మా

************************************

all time favorite… in fond memory of Sri Bapu garu 💕🙏పూజ్యులైన అమ్మా నాన్నలకు నమస్కరించి వ్రాయునది ఏమనగా,మీరు రిటైర్ అయ్యి మన ఊరికి వచ్చేసినందుకు చాలా సంతోషం. కానీ ఇల్లు మారేటప్పుడు నేను ఎన్నో ఏళ్లుగా కత్తరించుకుని ఒక గుత్తిగా కట్టుకుని దాచుకున్న బాపు గారి కార్టూన్ల ఫైలు కనపడలేదన్నారు. ఎన్ని సార్లు అడిగినా తేలిగ్గా తీసేస్తున్నారు.

నా మనసంతా ఆ కిర్రు చప్పుడు గోద్రెజ్ బీరువాలో ఎక్కడో ఇరుక్కున్న బాపు గారి మీదే ఉందని గుర్తుపెట్టుకోండి.

ఎన్నేళ్లు వస్తున్నా చిన్నదానిగా పుట్టిన కారణాన నా భావాలను కూరలో కరివేపాకులా తీసెయ్యకండి. కాస్త చూసి పెట్టండి బాబూ.

ఇహ నేనేమి అడగను వేటికీ వాటాలకు రాను. మిగతావన్నీ అక్కకి ఇచ్చేయండి .(నాయనమ్మ వక్కాకు రోలు, ఇత్తడి పళ్లేలు, నగిషీలు చెక్క పెట్టి తప్ప..to be contnd and subject to modifications ) .. ఈ ఒక్కటీ చాలును నాకు ! ఇట్లు మీ చిన్న కుమార్తె !

Use Facebook to Comment on this Post

telugufunnypunches
Share Tweet

Srinidhi Yellala

You Might Also Like

  • సరదా కబుర్లు

    సరదాగా !

  • సరదా కబుర్లు

    నే చెప్పానా !!

  • సరదా కబుర్లు

    నాకు ఇంటరెస్ట్ పోయింది

No Comments

Leave a reply Cancel reply

Categories

  • activity corner
  • Uncategorized
  • ఎందరో మహానుభావులు ..
  • కధలు
  • మన పండుగలు
  • సరదా కబుర్లు
  • సాయంకాలం కబుర్లు

Tags

akkineni ANR dasara bullodu india nirbhaya pelli poola jada rahul baba republic day savithri telangana telugu film posters telugujokes tv ads
  • my blog…
ఉత్తమ తెలుగు బ్లాగులు - బ్లాగిల్లు | Top Telugu Blogs
మాలిక: Telugu Blogs


కూడలి

Blaagulokam logo