ఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే దాని వెనుక ఒక బలమైన కారణం వుండాలి.అదే ఒక వ్యవస్థ పై తిరుగుబాటు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళు ఆ వ్యవస్థ తీరు పై కలిగిన అసహనం , అసంతృప్తి , ఆవేదన కారణం అయ్యుండాలి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రసంగం చూసిన తర్వాత కలిగిన భావన ఇది.ప్రస్తుతం పాలనా వ్యవస్థ తీరు పై తనకు గల ఆవేశం ,ఆక్రోశం ఈ విధంగా ఒక పార్టీ పెట్టడానికి కారణం అని తెలుస్తోంది.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తీరు , విభజన వల్ల ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయనే విషయం చాలా చక్కగా చెప్పాడు.
ప్రతి తెలుగు వాడూ ఒక్కసారి తిరిగి ఆలోచించేటటువంటి విషయాలు , తప్పకుండా ఆలోచించవలసిన విషయాలు జనసేన ఆవిర్భావ ప్రసంగం లో చెప్పారు.విడిపోయినందుకు కాదు… ఎలా విడదీసారు? అనే ప్రశ్న చాలా మందికి ఉంది.అలాగే భాష ని , ఒక ప్రాంతపు యాసని అడ్డుగా పెట్టుకుని ప్రజలను వేరు చెయ్యడం,తెలుగు జాతి సమగ్రతకు భంగం కలిగించేలా ప్రజలని రెచ్చగొట్టటం వంటి సున్నితమైన అంశాలను చాలా చక్కగా ప్రశ్నించడం జరిగింది.
రాష్టం విడిపోయిన విషయం కన్నా ప్రజలను(మనసు ఉన్న వారు) ఎక్కువగా బాధ పెట్టిన సంగతి ఏంటంటే ప్రజల మధ్య వచ్చిన దూరం.కొన్ని ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు కూడా విభజన ప్రస్తావన వచ్చాక మా ప్రాంతం గొప్ప అంటే మా ప్రాంతం గొప్ప అని కొట్టుకోవడం మొదలుపెట్టారు.చివరికి చదువుకున్న వారిలో కూడా మా ప్రాంతంలో ఇంత మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ,మీ ప్రాంతం లో ఎంత మంది ఉన్నారు అని చాలా నీచమైన వాదనలకి దిగినవారు వున్నారు.ప్రాంతీయ భేదాల మధ్యన సాంస్కృతిక , సాహిత్య విభేదాలు సృష్టించుకుంటూ ఒకరిని ఒకరు శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు.
ప్రజల ఆలోచనలో వచ్చిన ఈ ధోరణి గురించి , దాని వల్ల జాతి సమగ్రత కు (మీకు దాని పై గౌరవం అంటూ ఉంటే)వచ్చే నష్టం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.ఒక ప్రాంతం బాగు పడటం , ఒక ప్రాంతం నష్టపోవడం అనే విషయం పక్కన పెడితే, మొత్తంగా చూస్తే సామాన్య మానవుడి పరిస్తితి రాష్ట్రం మొత్తం మీద ఒకలాగే వుంది…ప్రాంతీయ విభేదాలు ప్రజల సున్నిత భావాల పైన ప్రభావం చూపకూడదని చెప్పిన విషయం అక్షర సత్యం.
ఇదేకాకుండా రాజకీయ నాయకుల కుల,ప్రాంత పక్షపాతాల గురించి కూడా ప్రశ్నించాడు.ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్స్ పార్టీ తీరుపై తనకున్న తీవ్ర అసంతృప్తిని కూడా ధైర్యం గా వ్యక్తం చేసారు.ప్రశ్నించడానికే వస్తున్నానంటూ వచ్చిన మొదటి రోజే పేరు పేరునా అందర్నీ కడిగేసాడు.ముఖ్యంగా కాంగ్రెస్ పై ,ఆ పార్టి వ్యవస్థ పై తన కున్న తీవ్ర అసహనాన్ని చాలా ఘాటుగానే చూపించాడు.
ప్రశ్నలు అందరికీ ఉంటాయ్ ..సమాజం పై,వ్యవస్థ పై అందరికీ ఎదో విధమైన అసహనం వుంటుంది.కాని అవి అడగాలంటే ఒక బలమైన వ్యక్తి కావాలి.ఆ పవర్ సినీ నటులకి ఒక వరం .పూర్వం కూడా ఈ విషయాన్నీ చాలా మంది నటులు నిరూపించారు.చరిత్ర సృష్టించారు.సినీ గ్లామర్ వల్ల తను సంపాదించుకున్న ఈ పవర్ తో ఒక వ్యవస్థ పై పోరాటం చేద్దాం అనుకున్న వ్యక్తుల్లో పవన్ కొత్తవాడు కాకపోయినా , తను రావడానికి గల కారణం(ప్రశ్నించడానికి) లో ఒక కొత్త కోణం ఉంది.తనకి ప్రస్తుతం వున్న ఆవేశానికి ,ఆలోచన కూడా తోడు కావాలి.ఆలోచన లేని ఆవేశం ఎక్కువ రోజులు వుండదు.
డ్రాబాక్స్:ప్రసంగం మొత్తం బాగానే ఉన్నప్పటికీ..పవన్ తన ప్రసంగాన్ని గంభీరంగా చెప్పివుంటే ఇంకా ఎఫెక్టివ్ గా వుండేది.పంచ్ డైలాగులు వున్నప్పుడు మాత్రమే ఆవేశంగా మాట్లాడి,మద్యలో అప్పుడప్పుడూ నవ్వడం పెద్దవాళ్ళకి అంత రుచించదు.ఏదైనా మార్పు తీస్కుని రావాలంటే ముందు పదవి కావాలి.అది దక్కాలంటే అన్ని వర్గాల ప్రజలను నమ్మించాలి.యువతనే కాకుండా అందర్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం మంచింది.తన అన్న చేసిన తప్పు చెయ్యకుండా , తన నీతికి కట్టుబడి వుండడం ప్రస్తుత రాజకీయల్లో చాలా కష్టం.మరి మన అవినీతి రాజకీయపు గాలివాటుకి కొట్టుకుని పోతాడో లేక ఎదురు నిలిచి పోరాడతాడో చూడాలి.ఎందుకంటే ..సినిమాల్లో లాగా “కట్ చేస్తే” అని చెప్పడానికి..నచ్చకపోతే ఎడిట్ చెయ్యడానికి ఇక్కడ వీలు లేదు కాబట్టి.
చివరిమాట:వ్యవస్థ పట్ల తనకున్న అసహనం తో, సమాజం లో జరుగుతున్న అన్యాయాల వల్ల కలిగిన ఆవేశం లో తన లోపల జరిగే ఘర్షణ కి ప్రతిఫలమే ఈ జనసేన పార్టి అని చెప్పిన పవన్ గారి ఆవేశం ఇలాగే ఉంటుందో లేక …రాజకీయ పద్మవ్యూహం లో తలలు పండిన మయగాళ్ళ చేతిలో మోసపోకుండ నిలబడి పోరాడతాడో చూడాలి మరి .
తన తిక్కకి వుండే లెక్క తప్పకుండా వుంటే రాష్ట్ర /దేశ రాజకీయ చరిత్ర లో ఒక కొత్త కోణాన్నిచుస్తామేమో….ఎదురుచూద్దాం..మనకి అలవాటే కదా.
Leave a Reply