ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం ఆచరించడం మన సాంప్రదాయం.గజ ముఖం తో, చిరు బొజ్జ తో,వుండే వినాయకుడంటే అందరికి ఎంతో ప్రీతి.వినాయక రూపం జ్ఞానానికి ,సంపదకి,విజయానికి చిహ్నం.విఘ్నరాజాదిపతి అయిన వినాయకుడిని పూజిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనందరికీ తెలిసిందే.కాని వినాయక రూపం మనకి ఏమి చెప్తోంది? ఆ రూపం వెనుక గల అతరార్ధం ఏమిటి?
చాటల్లాంటి చెవులు ,తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని చెప్తున్నాయి ,సూదంటు చూపులు ఎ విషయాన్నయినా నిశితంగా పరిశీలించమని చెప్తున్నాయి,తొండం మనమంతా ఓంకార నాదం నుండి పుట్టామని చెప్తోంది,చిరు బొజ్జ జ్ఞానాన్ని గ్రహించమని చెప్తోంది.మొత్తానికి విఘ్నేశ్వర రూపం సత్ప్రవర్తనకి,జ్ఞాన సముపార్జనకి,విచక్షణ కి ప్రతీక.
భాద్రపద మాసం లోనే ఎందుకు?
ప్రతి కార్యం ముందు వినాయకుడిని పూజిస్తుంటాం.కాని భాద్రపద మాసం లోనే ఎందుకు వినాయక చవితి జరుపుకుంటారు? ఎందుకంటే భాద్రపద మాసం లో వర్షాలు బాగా పడి చెరువులు నిండుకునే సమయం.ఈ వేళలో వినాయక విగ్రహాల కోసం చెరువులో వుండే మట్టినే వాడేవాళ్ళు.నెల రోజుల ముందే మట్టిని తవ్వడం వలన చెరువు పూడిక తీసినట్టు అవుతుంది,వర్షపు నీళ్ళు ఎక్కువగా నిలువ చేసినట్టు అవుతుంది.వర్షాదారమైన పంటలు రైతులు మొదలు పెట్టె సమయం కూడా.ఇది రైతులకు మరియు పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైన విధానం.తిరిగి పూజ అయిపోయిన తర్వాత ప్రకృతి నుండి తీసుకున్న దానిని ప్రకృతికే ఇచ్చెయ్యాలి కాబట్టి దేవుడిని తిరిగి నిమర్జనం చేస్తాం.ఆ విధంగా సాయిల్ ఎరోషణ్(soil erosion) కాదు.పైగా దేవుడికి వాడిన పత్రి,పూలు,అక్షింతలు నీటిలో వుండే ప్రాణులకు ఆహారంగా ఉండేవి.
ప్రస్తుత పరిస్థితి:
అసలు వినాయక పూజ వెనుక రహస్యం ఇదని తెలుస్తోంది.కాకపోతే ప్రస్తుతం ఈ పూజ చేసే విధానంలో ఎంతో తేడా వచ్చింది,ప్రతి వీధి వారు పక్క వీధి వారితో పోటి పెట్టుకొని మరీ విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు.మా వినాయకుడు పెద్ద అంటే మా వినాయకుడు పెద్ద అని గొప్పల కోసం పూజ చేస్తున్నారు.దీని వల్ల విగ్రహాల సంఖ్య బాగా పెరిగిపోతోంది.వీటి నిమర్జనానికి ప్రదేశాలు చాలనంతంగా విగ్రహాలు పుట్టుకొస్తున్నాయ్.ప్రజల నమ్మకాలతో కూడుకున్న విషయం కనుక ప్రభుత్వం కుడా ఏమి చెప్పలేకపోతోంది.
అందుకని మనమే ఈ సమస్య గురించి ఆలోచించాలి.ఒక్కసారి మన ప్రకృతిని,పర్యావరణాన్ని గురించి అలోచించి భక్తి తో వినాయక పూజని చేసుకుందాం.ఎంత పెద్ద దేవుడిని పెట్టాం అనే దానికన్నా ఎంత శ్రద్ధతో పూజ చేసాం అనే విషయాన్ని గురించి ఆలోచించండి.వీధి రాజకీయాల నుండి వినాయక పూజని కాపాడండి తద్వారా మన పర్యావరణాన్ని కుడా కాపాడండి.
ఇంకో ముఖ్యమైన విషయం,మట్టి వినాయకులనే వాడుదాం.దయచేసి ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వాడుకను నిర్మూలిద్దాం.వాటి వాడకం వల్ల కలిగే నష్టాలూ ఎన్నో ఎన్నెన్నో.ఇప్పటికి మనం కోల్పోయింది చాలు.ఇకనైనా మట్టి విగ్రహాలను మాత్రమే కొందాం.
మనమేం చెయ్యొచ్చు:
- మట్టి వినాయకుడిని పూజిద్దాం.వీలైతే మన ఇంట్లోనే బకెట్టు నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆ నీటిని చెట్లకి పోద్దాం.ఇది కూడా దేవుడిని తిరిగి ప్రకృతికి ఇవ్వడమే కదా.
- చందాలు ఇచ్చి వినాయకుల్ల సంఖ్యని పెంచకండి.
- నిమజ్జనం రోజు ప్లాస్టిక్ కావర్లని నీటిలో వదలకండి.
- వీలైనంతగా నీటి కాలుష్యాన్ని,శబ్ద కాలుష్యాన్ని తగ్గించండి.
తెలిసిన వారు తెలియని వారికి చెప్పి ఈ పర్యావరణానికి మనవంతు సాయం చెయ్యండి.అందరికి రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు.
Leave a Reply