మన రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప అస్త్రం ఓటు. ప్రతి ఐదు సంవత్సరాలకి ఎవరు మనకు సుపరిపాలన ఇవ్వగలరో వారిని ఎన్నుకోగల శక్తి ఓటు మనకి ఇస్తోంది. ప్రతి భారత పౌరుడు ఐదు సంవత్సరాలకి ఒకసారి తన పాలకులని ఎన్నుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో దేశ, రాష్ట్ర నాయకత్వాన్ని, వ్యవస్థలో తేవలసిన మార్పుని మన ఓటే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం వేసే ఓటుపైనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తో పాటు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడివుంది. ఇప్పుడు నిజాయితీగా వ్యవహరించగల, స్థిరమైన మరియు దృడమైన వైఖరితో ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థ నాయకుడు కావాలి.
ఇంత శక్తి ఉన్న ఓటర్ని ప్రభావితం చేయగల మరో శక్తి మీడియా. మరి ఎన్నికల సమయంలో మీడియా పాత్ర చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో ఓటర్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీడియా పై చాలా ఉంది. ఇంతటి శక్తివంతమైన, ప్రజల తరపున మాట్లాడాల్సిన మీడియా కొన్ని వర్గాలుగా విడిపోయి ప్రజలని చైతన్యవంతం చేయకపోగా పక్క దారి పట్టిస్తోంది.
ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అసలు మీడియాని నడుపుతున్న అధినేతలకు సమాజంపై భాధ్యత ఏమాత్రం ఉన్నట్టు కనిపించడంలేదు. చేతిలో ఆయుధం ఉంది కదా అని ఎలా పడితే అలా వాడితే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నప్రధాన మీడియాని తీసుకుందాం …. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, tv9.
మొదటగా ఈనాడు, సాక్షి గురించి తీసుకుంటే రెండు కూడా రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు పప్పెట్లులా ఉన్నాయే కానీ, ప్రజలకి యే మాత్రమూ ఉపయోగపడేలా వ్యవహరించట్లేదు. సాక్షి ఎంత సేపూ జగన్ గారి నామ స్మరణమే తప్ప మిగతావి యే విషయాలు వారికి పెద్దగా పట్టవు. మహా అయితే ఈనాడు వాళ్ళు ప్రచురించిన న్యూస్ కి కౌంటర్ న్యూస్ ప్రసారం చేయటం వాళ్ళ మీద ఛాలెంజ్ చేయటానికి సరిపోతుంది. ఇంతకన్నా సాక్షి గురుంచి చెప్పుకోటానికి కూడా ఏమి లేవు.
ఇక ఈనాడు పక్కా పక్షపాతంగా వ్యవహరిస్తోంది. ఈనాడు రామోజీ రావు గారు, తెలుగు దేశం పార్టిని ఎలాగైనా అధికారంలో కుర్చోపెట్టాలని గట్టిగా కృషి చేస్తున్నారు. దానికోసం తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం ఈనాడు ద్వార చాలా గట్టిగా చేస్తున్నారు. జగన్ విషయంలో ఈనాడు మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం లేదు. నిజానికి జగన్ కి లేని ప్రాముఖ్యతని తెచ్చి పెట్టిందే వీళ్ళ అత్యుత్సహమే. ఎంత సేపూ జగన్ ఇంత దోచేసాడు అంత దోచేసాడు అని రాసి రాసి, ఆఖరికి ప్రజలకి టైం పాస్ న్యూస్ లా తయారు చేసి పెట్టారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, జగన్ ఒక్కడే దోచేసాడా? ఈనాడు వారు మాత్రం జగన్ ని ఫోకస్ చేయటమే ద్యేయంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఇవి కాకుండా ఏదైనా న్యూస్ ఉందా అంటే అది వాళ్ళకి గిట్టనివారి గురించి ప్రముఖంగా ప్రచురించడం మాత్రమే. ఒకప్పుడు రాత్రి తొమ్మిది గంటల న్యూస్ లో రోజులో న్యూస్ మొతాన్ని అరగంటలో మన ముందర పెట్టేసేవాళ్ళు. కాని ఇప్పుడు తమకు నచ్చని వారి గురిచి న్యూస్ చదవటానికే ఆ అరగంట సరిపోవటం లేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే నేటి వార్తా పత్రికలని సమాజ స్థితిగతులు చెప్పే మాధ్యమాలు అనేకంటే…. ఫలానా పార్టీ వారి ప్రచార వేదికలు అని అనడం బాగుంటుందేమో.ఎందుకీ నాటకాలూ, ఎవరిని ఎమార్చడానికి.ప్రజలూ మరీ అంత గుడ్డివారు కాదని వీళ్ళకు తెలియదా.
ఇకపోతే మిగిలింది ఆంద్రజ్యోతి, TV9. వీరు ఎప్పుడూ వార్తలను సంచలనాత్మకముగా ఎలా ప్రచురించాలా అని ఆలోచిస్తారు తప్ప ప్రజలకు విషయాన్ని ఎలా తెలియచేయాలి అనే ఆలోచనే ఎప్పుడూ ఉండదు. వీళ్ళు ముఖ్య నాయకులతో కానీ సెలబ్రిటీస్తో కానీ ఇంటర్వూ తీసుకొన్నప్పుడు వారు చెప్పిన వాటిల్లో చిన్న చిన్న నెగెటివ్ మాటలనే హైలైట్ చేసి వాటికీ ఇంకాస్త మసాలా జోడించి దానిని తిప్పి తిప్పి చెప్పి వాళ్ళని పీల్చిపిప్పి చేస్తారు.అవతల వారి చెప్పేదానితో సంబంధం లేకుండా వీళ్ళకు కావలసిన విషయాన్నే వాళ్ళ దగ్గరనుండి రాబట్టుకుని ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుంటారు.సినీ తారల రహస్య జీవితాలు,రాజకీయ నాయకుల బూతు పురాణాలు చెప్పడమే వీరి ధ్యేయం.అంతే కానీ సమాజం కోసం కృషి చేసే వారి గురించి, చేస్తున్న వారి గురించి అస్సలు ఫోకస్ చెయ్యరు.సమాజం పై మనుషులకి విరక్తి కలిగించే వార్తలు తప్పించి ఇంకేమి ప్రసారం చెయ్యరు.ఆశావహ దృక్పధం కలిగించే ఆలోచన అసలు ఎవరికీ లేనట్టేవుంది.
మీడియా అంటే చెడు వార్తలు, సినీ పురాణాలు, రాజకీయ భజనలు ఇంతకు మించి ఏమి లేదు అని అనుకునేటట్టు చేసారు.ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే ప్రజలకి మీడియా తప్పించి వేరే మార్గం లేదు.కానీ మీడియాని చూస్తుంటే కులాల వారీగా,ప్రాంతాల వారీగా, పక్షపాత బుద్ధితో ఎవరికి నచ్చిన వారిని వారు కాపాడుకుంటూ అవతలి వారిని మాటలతో తూట్లు పొడుస్తూ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది.
ఇప్పుడు ఉన్న ప్రముఖ మీడియా చానల్స్, పేపర్స్ ఎవైనా వారి రాజకీయ ,వ్యాపార స్వలాభాల కోసం పని చేస్తున్నాయే కానీ, ప్రజల కోసం పని చేయటం లేదు. మీడియాకి అసలు పక్షపాత వైఖరి ఉండకూడదు. ఏ విషయానైన్న సాధారణ విషయముగానే పరిగణించాలి.అంతే కాని మీడియా అధినేతల భావాలని ప్రజలమీద రుద్దటానికి ప్రయత్నిచటం ,దేశానికీ యే మాత్రం శేయస్కారం కాదు. ఇప్పటికైనా ఈ మీడియా వాళ్ళు ఈ నిజాన్ని గ్రహించి నడుచుకుంటే మంచిది లేకపోతే విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి వచ్చి రేపు నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు.
కత్తి కన్నా కలం చాలా పదునైనది.అంతటి పదునైన ఆయుధం వున్న మీడియా నీతికి, న్యాయానికీ కాకుండా ఇలా వర్గాలుగా విడివడి పక్షపాత బుద్దితో ఎవరికి నచ్చిన వారిని వారు కాపు కాయడం ఏమాత్రం న్యాయం????
Leave a Reply