దీపానికి, భారతీయతకు విడదీయని బంధం వుంది.దేవుని ముందు దీపం వెలిగించి నమ్మకంతో ప్రార్ధిస్తే అది మనకి ఎంతో మనో ధైర్యాన్ని,శాంతిని ఇస్తుంది.మన మనసులో వుండే భయం,అజ్హ్ఞానం అనే చీకట్లను తొలగించి మనలో వెలుగుని నింపుతుంది.
అటువంటి దీపాల పండుగ మన దీపావళి.చెడుపై మంచి గెలుపుని,చీకటి పై వెలుగు యొక్క గెలుపుని తెలియజేసే పండుగ.అమావాస్య చీకట్లలాంటి మన చెడు ఆలోచనలని తన వెలుగులలో అంతం చెయ్యమని చెప్పే పండుగ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
పురాణం: నరకాసురుడనే రాక్షసుణ్ణి శ్రీ కృష్ణుడు, సత్య భామా సమేతంగా వధించిన రోజు నరక చతుర్దశి.ఆ మరుసటి రోజు అమావాస్య .లోకకంటకుడైన రాక్షసుడు చనిపోవడం తో ప్రజలు తమ ఆనందాన్ని తెలియజెయ్యడానికి దీపాలతో ఇళ్ళను అలంకరించారని చెప్తారు.
ఇదే రోజు శ్రీ రాముడు లంక పై విజయం సాధించి సీతమ్మతో సహా అయోధ్యకి వచ్చాడని,అందుకు జనమంతా సంతోషంతో దీపావళి జరుపుకున్నారని కూడా చెప్తారు.
కారణం ఏదైనా పిల్లలకి పెద్దలకి సంతోషాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ దీపావళి.మనుషులంతా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ,మిటాయిలు పంచుకుంటూ,ఒకరికి ఒకరు సంఘం లో తోడుగా ఉంటామని తెలియజేసే పండుగ.
ఈ పండుగ రోజు దైవ భక్తితో పాటు సంఘం పట్ల భాద్యతను,జీవితం పట్ల నమ్మకం మరియు గౌరవం కూడా కలిగి ఉండాలని.ఈ దీపావళి అందరి జీవితాల్లోకి వెలుగులు నింపాలని కోరుకుంటూ ,”అందరికి దీపావళి శుభాకాంక్షలు”.
Leave a Reply