అనగనగా ఒక రాజ కుమారి

అనగనగా ఒక రాజ కుమారి

మనుషులైనా, వస్తువైనా ఉన్నప్పుడు వాటి విలువ ఎవరూ గుర్తించరు. గడిచిన చరిత్ర మీద ఉన్న ఆసక్తి, కుతూహలం జరుగుతున్న వాస్తవాల గురించి అంతగా ఉండదు. ఇక ప్రముఖుల సంగతి సరే సరి. ఏ మనిషి నుండైనా నేర్చుకోవలసిన మంచో, చెడో కొంచం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పే రాకుమారి జీవితం మొత్తం స్ఫూర్తిదాయకమే. తన విజయాల నుండి తెలుసుకోవలసినవి, తప్పులనుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఎన్నెన్నో. జయలలిత, పేరు వినగానే గంభీరమైన భారీ విగ్రహం, చూపులతోనే ఆమడ దూరం పెట్టె మనిషి గుర్తొస్తాయి. జీవితం పూల బాటగా చేసుకోగలిగే అవకాశాము ఉన్నప్పటికీ ఎంతో క్లిష్టమైన మార్గాన్ని ఎంచుకుని, అందులో ఆటుపోట్లని అధిగమించి ఒక జాతిపై బలమైన ముద్ర వేయగలిగారు.

రాజకుమారి అనగానే అపురూపమైన జీవితం అనుభవించే ఒక అపరంజి బొమ్మ గుర్తొస్తుంది. ఈ అపరంజి బొమ్మ కూడా తన జీవితం అపురూపమైనది అని భావించేది. అమ్మకి దూరంగా వున్న బాల్యంలో చిన్నారి “అమ్ము” ఎంతగానో బాధపడింది.బహుశా తన జీవితంలో ఎక్కువ భాగం ఎవరి తోడు లేకుండా ఉండవలిసి వస్తుందేమో అని అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు.

ఆ సమయంలోనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని సమకూర్చుకుంది. అదే తన చదువు, భాషపై పట్టు. ఒక మనిషి జీవితంలో చదువు ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో జయ లలిత జీవితం చక్కని ఉదాహరణ. మద్రాస్ మొత్తానికి మెట్రిక్యులేషన్ లో “టాపర్” గ నిలిచారంటే తన ప్రతిభా పాటవాలు ఏంటో అక్కడే తెలుసుకోవచ్చు.

స్కూలింగ్ అయినవెంటనే తన జీవితం అంతా పూలపాన్పు కాదని తెలుసుకుంది.తన స్కాలర్షిప్ ని కూడా పక్కనపెట్టి, తాను లాయర్ కావాలనే కల పక్కన పెట్టి ఇష్టం లేని రంగంలోకి అడుగు పెట్టింది. కుటుంబం కోసం ఇష్టం లేక పోయినా సినిమాలలో చేరవలసి వచ్చింది.
ఈ రాకుమారి కలలు చెదిరి వాస్తవం లోకి రావడం అంతటితో మొదలు. పదహారు సంవత్సరాల ప్రాయంలో రంగుల లోకం లోకి అడుగుపెట్టింది. సకలకళా కోవిదురాలికి అక్కడ కూడా అఖండ విజయం ఎదురైంది.

అంతా బాగుందన్న సమయాన తన తల్లి మరణం తనను ఒంటరిని చేసింది. లంకంత ఇంటిలో ఏకాకి. బంగారు పంజరం లోని చిలుక. అప్పటి తన పరిస్థితి తలుచుకుంటే గుండెల్లో చెప్పలేని భాధ. ఎంత భాధ పడివుంటుంది. మంచి చెడులని చెప్పే పెద్దవారు లేక, ఎవరిని నమ్మాలో తెలియక తన చుట్టూ ఒక గిరి గీసుకుందేమో అనిపించక మానదు.
బహుశా ఆ సమయంలో జయ తల్లిగారు ఉండివుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ విధి వేరే పని కోసం ఆమెను సిద్ధం చెయ్యసాగింది.

ఒంటరి తనం ఓదార్పు కోరుకుంటుంది. తనకి తెలియకుండానే తన జీవితం ఇంకొకరి చేతిలో పెట్టేసింది.అమ్మ చెప్పింది వినటం తప్ప ఇంకోటి తెలీని అమ్మాయి, ఇప్పుడు తన గురువు చెప్పింది వినటం మొదలుపెట్టింది. తనకి తెలియకుండానే రాజకీయ రంగం లో ప్రవేశించింది. ఎక్కడ అడుగు పెట్టినా విజయం పై గురి పెట్టే తనకి, విజయం అక్కడ కూడా పలకరించింది.

తన చదువు తన వ్యక్తిత్వం ఇవే తన ఆయుధాలు. పార్టీ తన చేతిలో ఉన్నప్పుడు అసెంబ్లీ లో తన చీరని లాగి, జుట్టు పట్టి హేళన చేసిననప్పుడు తాను చూపిన నిబ్బరం చూస్తే “శభాష్” అనక తప్పదు. ఈ సంగతి తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయాను. ఒక ఆడదాన్ని అవమానిస్తే యుద్ధాలు జరిగి, అవి కావ్యాలుగా మారి, మన సంస్కృతికి అద్దంపట్టే గ్రంధాలు అయిన సమాజం మనది.కానీ అవి వేరే యుగం కథలు.

కానీ ఇది మన కళ్ళముందు జరిగిన కథ. అక్కడ “స్త్రీ” నిస్సహాయంగా తనని కాపాడే వారికోసం ఎదురు చూసింది. కానీ ఇక్కడ ఈ “స్త్రీ”తానే శక్తి అయి తన కష్టం తానే ఎదుర్కొంది. తనకి జరిగిన అవమానానికి “మహా భారత “యుద్ధం చేసి ఓడినచోటే గెలిచి చూపించింది జయలలిత. ఇక్కడ తన యుద్ధం తానే చేసింది. ఈ రాకుమారికి ఏ రాజకుమారుడి అవసరం రాలేదు.తనకి జరిగిన అనుభవాలు తనని మొండి చేసినా, నియంతని ముద్ర వేసినా, ఎక్కడా వెను దిరగక మళ్ళి మళ్ళి విజయాలను సాధించింది.

ఒక స్త్రీ ని ఫలానా వ్యక్తి కూతురిగానో, భార్యగానో,అమ్మగానో అనే హోదాలు లేకుండా, కేవలం తానే తన ఉనికిగా తన పేరే ఒక పరిచయం అవసరం లేని చరిత్రగా మలుచుకున్న తీరు చూస్తే గర్వాంగా అనిపించక మానదు. ఇవన్నీ కూడా స్త్రీ చుట్టు ఆంక్షలు అల్లుకున్న 1970-80 ల్లో
. ఎవరిని ఒకపట్టాన నమ్మని మనుషులని, నమ్మిన సిద్ధాంతాలని గుడ్డిగా ఆచరించే జనాల అభిమానం చూరగొనడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.

తన గురించి తన ప్రస్థానం గురించి తెలుసుకున్నప్పు ఇలాంటి ఒక మనిషిని నేను ఎరుగుదును అని నాకు గర్వం గా అనిపించింది.

అనగనగా కధలు ఎన్నో చదివాను.అన్నిట్లో రాకుమారి ఎవరిమీదో ఒకరి మీద ఆధారపడేది. కానీ ఈ రాకుమారి ప్రత్యేకం. తన కష్టం తానే ఎదుర్కొంది.తన రక్షణ తానే చూసుకుంది.తన శపథం తానే నెరవేర్చుకొంది. తన యుద్ధం తానే చేసి గెలిచింది. ఆ గెలుపు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.
తనంటే ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన గురించి తెలుసుకున్న ప్రతి విషయం నన్ను ఆశ్చర్య పరిచింది. తన చదువు, అందం,తెలివితేటలు, వాటిని తగినవిధంగా ఉపయోగించ గలిగే చాకచక్యం.ఓహ్ ఎంతైనా నేర్చుకోవచ్చు,తన నుండి.

ఇలాంటి ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం అనిపించింది. కష్టాల దారిలో ఎంతో ఇష్టం గా నడిచి, రాళ్లు పడ్డచోటే పూలు వేయించుకున్న మనిషి.
ఝాన్సీరాణి, రుద్రమదేవి వీరందరూ నాకు చరిత్ర. నాకు తెలీని చరిత్ర.
నేను చుసిన వీరవనిత “ఈ అమ్ము” “అమ్మ”.
ఇకపై అనగనగా కథల్లో నేను చెప్పబోయే ఓ రాకుమారి కధ.

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *