ఈ వార్త వినాల్సివస్తుందని తెలిస్తే అసలు ఈ రోజు లేచేదాన్నే కాను.అయినా నా పిచ్చి కాకపోతే బాపు గారు చనిపోవడమేంటి?.తెలుగుతనం,బాపూ బొమ్మ,బాపు చలన చిత్ర కావ్యాలు,బుడుగు, జ్ఞాన ప్రసూనాంబ వీళ్ళంతా చనిపోతారా ఏంటి?.వీళ్ళు ఉన్నంత కాలం ఆయనా ఉంటారు.కులాసాగా,చిలిపిగా తన ట్రేడ్ మార్కు స్టైలు లో నవ్వుతూ,అంతే.ఏదో బోరు కొట్టి భౌతికంగా మనకి దూరం అయ్యారంతే.శాశ్వతంగా తెలుగు వెలుగుల్లో అయన కుడా ఒక జ్యోతిగా వెలుగుతూనే వుంటారు.
పది పేజీలలో చెప్పగలిగే భావాన్ని ఒక చిన్న బొమ్మలో చూపించగల బొమ్మల మాంత్రికుడు.బాపూ గారి బొమ్మ తో కవర్ పేజి వుందంటే ఆ పుస్తకానికే ఒక విలువ ఒక హోదా వచ్చేస్తాయి.అయన బొమ్మల రామాయణం చదవక్కరలేదు చూస్తె చాలు రామాయణ సారం అరటిపండు ఒలిచి తిన్నట్టు తెలిసిపోతుంది.కొంటె దనం,తెలుగు తనం తో పాటు నవ రసాలు కలబోసిన మధుర కావ్యాలు బాపు చిత్రాలు.ఇంకా అయన గీసిన కార్టూన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.వాటికోసం ఎన్ని వార పత్రికలు చింపివేసానో.
ఇప్పటికి వాటిని జాగ్రతగా బీరువాలో ఏదో పెద్ద నిధిని దాచుకున్నట్లు దాచుకున్నాను.అవును వాటిని నిధి కాదని ఎవరు అనగలరు.కాదన్న వాడు గాడిద అంతే.మనసుకి ఏ మాత్రం బాధకలిగినా వాటిని చూస్తే బాధ గీద అన్నీ హుష్ కాకి,పెదవులపైకి తెలియకుండానే నవ్వులు పూస్తాయి.
ఆ తెలుగు నవ్వుల వెన్నెలలో ఎప్పుడూ వాడని పొగడపూవు మన బాపూ గారు.బాపు బొమ్మలను చూసి ఎంతమంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా మారారో.వాళ్ళలో నేను ఒకదాన్ని.అందమైన బొమ్మలు,కళ్ళతో,వంటి ఒంపుసొంపులతో నే ఎన్నో ఊసులు చెప్పే బొమ్మలు. అవి,తెలుగుతనానికి నిండుతనం తెచ్చిన బాపు చేతి గీతలు.బాపు బొమ్మలా వున్నావ్ అని అనిపించుకోడానికి తహతహలాడని తెలుగమ్మాయిలు ఉంటారా అసలు.
ఇక ఆయన చలన చిత్రాల విషయానికి వస్తే అవి చలన చిత్రాలు కాదు,మాటలు వచ్చిన బాపూ బొమ్మలు,కదిలే తెలుగు జీవన మధుర కావ్యాలు.ఏ చిత్రం చూసిన అందులో అడుగడునా తెలుగుతనం నిండుతనం కానవస్తాయ్.మధ్య తరగతి జీవనాలు,సరదాలు సంతోషాలు ఆయనకన్నా ఎవరు బాగా తీయగలరు.భార్యా భర్తల అనురాగం,సంసార సారం ఆయన చూపించిన అంత రమ్యంగా ఇంకెవరు చూపించగలరు.భక్తి చిత్రాల విషయానికి వస్తే సాక్షాతూ దేవతలే దిగి నటించారేమో అనేంత సహజంగా ఉంటాయ్ పాత్రలు.సీతా కల్యాణం లో గంగావతరణం పాట అందుకు గొప్ప ఉదాహరణ. రామాయణం,భాగవతం ఆయన చేతుల్లో సజీవ,రమణీయ కావ్యాలుగా మారాయి.
“చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వ పెట్టి,సందె మసక చీర కట్టి”…అబ్బ ఎంత చక్కని పదాలు,ఇంత చక్కని తెలుగు తెనేలని మనకి ఇచ్చిన మనిషి ఎలా చనిపోగలడు.”ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట”… అని కన్నె పిల్ల మనసుని,ఆ మనసులో ఉండే వెచ్చ వెచ్చని కోరికలని ఎంత చక్కగా తెరమీద చూపించాడు.సాక్షి,ముత్యాల ముగ్గు,అందాల రాముడు,రాజేశ్వరి విలాస్ కఫీ క్లబ్,గోరంత దీపం,పెళ్లి పుస్తకం,మిస్టర్ పెళ్ళాం,అన్ని కూడా పిల్లలకి పెద్దలకి పెట్టని పాఠాలు.కాదంటారా?జీవిత సారం వాటిలో లేదంటారా?ఆయన సినిమాలు మనసు తో చూడాలి అంతే.బాపు గారి అభిమాని అంటే వాళ్ళు కచ్చితంగా కళాపోషణ ఉన్నవాళ్ళే.
ఇంక అమర మిత్రులు ముళ్ళపూడి వెంకట రమణ ,బాపు గారి స్నేహం అందరికి ఆదర్శనీయం.ఇద్దరూ ఇడ్లి, పచ్చడి లాంటి వాళ్ళు.ఏ ఒక్కటి లేకపోయినా ఇంకోదానికి విలువా రుచి లేనట్టే.వారి అపూర్వ సృష్టి బుడుగు,ఎన్ని తెలుగు ఇళ్ళల్లో కమ్మని,అమాయకమైన,చిలిపి, అల్లరి,తుంటరి నవ్వులను పోయించిన్దో, పూయిస్తోన్దో.
మనందరినీ వారితో పాటూ వారి జీవితాల్లోకి తీసుకెళ్ళి మనచేత కూడా “కోతి కొమ్మచ్చి” ఆడిపించి,బాధలని కష్టాలని కూడా సరదాగా తీసుకూవాలనే విషయాన్నీ ఎంతో హుషారయిన మాటలతో,చిలిపి బొమ్మలతో చెప్పిన మిత్ర ద్వయం” బాపూ రమణ.”
ఆ నవ్వులు,ఆ గీతలు,ఆ రాతలు,ఆ కదిలే బొమ్మలు మేము ఎప్పటికి మరచిపోము.అలాగే మిమ్మల్ని కూడా.మీరెక్కడ వున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని
కోరుకుంటూ …..
మీ అభిమాని మరియూ మీ ఏకలవ్య శిష్యురాలు.
Leave a Reply