శ్రావణ మాసం వచ్చేసింది ,అందులో మొదటి శుక్రవారం వచ్చేసింది అని సంబరంగా వుంది కానీ , ఏంటో ఒకవైపు చెప్పలేని బాధ . మనిషిగా పుట్టినందుకు,సమాజం పట్ల,పుట్టిన ఊరు పట్ల , పెరిగిన వాతావరణం పట్ల ,మాట్లాడే బాష పట్ల మమకారం పెంచుకుంటాం . అది మానవ నైజం. అలాంటి భావాలు లేని వాడు అసలు మనిషే కాడు , ఒత్తి రాయి . కాని ఏ విషయానికైనా మితం అనేది ఉంటుంది .ఉండాలి కూడా . హద్దు మీరిన అభిమానం ,ఆశా వినాశ నానికి కారణం కావొచ్చు .
స్కూల్ కి వెళ్లి పాఠాలు అర్ధం అవ్వడం మొదలు పెట్టిన నుండి నా దేశం పై నాకెంతో భక్తి గౌరవం కలిగాయి. అసలు భారత దేశంలో పుట్టినందుకు ఎంతగా గర్వపడే దాన్నో . జాతీయ గీతం విన్నా ,మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని విన్నా తెలీకుండానే కళ్ళలో కన్నీటి పొర అడ్డువచ్చేది . స్వతంత్ర సమరం గురించి ,అమర వీరుల త్యాగాల గురించి క్లాసు లో చెప్తుంటే దుఖంతో గొంతు తడబడేది .
ఇంత గొప్పదని భావించి ,తలచిన నా దేశం గురించి ఇప్పుడు చూస్తుంటే మొదట బెంగగా అనిపించింది ,తర్వాత బాధ వేసింది కానీ రోజు రోజు పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా వుంది .
వాక్ స్వాతంత్రం రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు . హక్కు వుంది కదా అని ఎవరికి నచ్చినట్లు మాట్లాడడం ఎంత వరకు న్యాయం . ఎన్నో విభిన్న జాతుల ,వాళ్ళు వున్న మన దేశం లో అది చాల ప్రమాదకరం కూడా .న్యాయంగా పోరాటం సాగించి తెలంగాణా వాదులు తెలంగాణా తెచ్చుకునారు . ఆక్కడి వరకూ బాగానే వుంది .కాని అధికారంలో కి వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న మనిషిగా వారికి కొన్ని భాధ్యతలు ఉంటాయ్. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఏమి అనిపించలేదు కానీ ఈమధ్య కవిత పార్లమెంటు సభ్యురాలు అయివుంది కూడా ,తెలంగాణా అసలు భారత దేశంలోనే లేదు ,భారత దేశం తెలంగాణాని ఆక్రమించుకుంది అని అంది . నిజంగా ఈ మాటకి ఎంత కోపం,భాధ వేసాయంటే అసలు అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు అసలు . సంఘ వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇది తప్పు అని ఎవరూ చెప్పరేంటి . భారత దేశం నా మాతృభూమి … అంటూ రోజు స్కూల్ లో ప్రమాణం చేసే పిల్లలపై ఇలాంటి మాటలు ప్రభావం చూపవా . నిజాం ఉక్కు పాలన ని మర్చిపోయారా అప్పుడే …. తెలుగు తల్లి ఎవరయ్యా అసలు తెలుగు తల్లి మాకు తెల్వదు .. అని చెప్పుకు తిరిగే వాళ్ళంతా ఎ భాషలో మాట్లాడుతున్నట్లు . అసలు ఇంత దరిద్రం మనకెందుకు వచ్చింది .ప్రాంతీయ గొడవలకి భాషని ఎందుకు బలి చేస్తున్నారు .
ఇంకో సిగ్గు మాలిన విషయం ఏంటంటే స్థానికత గురించి ఈమధ్య వస్తున్న గందరగోళం .. 1956 నుండి వున్న వాళ్ళు మాత్రమే తెలంగాణా వాళ్ళు అంటోంది ప్రభుత్వం . మరి తర్వాత వచ్చిన వారిని ఎం చేస్తారు . వారి కోసం త్రిసంఖు స్వర్గం తయ్యారు చేస్తారా . నేను తెలంగాణా లో పుట్టాను . తెలంగాణ బిడ్డనే . కానీ మా అమ్మ నాన్న రాయలసీమ వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఏ స్థానికత లేని సామాజిక అనాధ బిడ్డనా … చెప్పండి?మా పుట్టుక ప్రశ్నా ర్ధకమా ?????ఎవరూ ఒక్క మాట మాట్లాడరేంటి అసలు?అసలు ఎవరికీ జవాబు చెప్పనవసరం లేదు అనే భావన పాలించే వాళ్ళకి వచ్చినప్పుడు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అసలు??????నిరంకుశత్వం అవుతుంది కదా???
మొన్నటికి మొన్న చిన్ని చిన్ని పిల్లలు బస్సు ట్రైన్ కి గుద్దుకుని చనిపోతే ,ఆ వార్తని సాక్షిలో చదవాల్సి వచ్చింది . “పిల్లల బాక్సులు తెరచి చూసాం అందరి బాక్సుల్లోనూ పచ్చడి మెతుకులే .. రాజన్న రాజ్యం వుంటే ఈ దుస్థితి వుండదు”, అని రాసాడు .ఏ వార్తనైన వాళ్లకి అనువుగా మార్చుకోవడం వీళ్ళని చూసి నేర్చుకోవాలి .పసి పిల్లల ప్రాణాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు మన మీడియా వాళ్ళు . మనసే విరిగిపోయింది . ఛి …
ఇవన్ని చూసి , ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది . అందుకే శ్రావణ మాసం పండుగల గురించి రాద్దామని మొదలు పెట్టి మనసులో వున్న భారాన్నంతా బయట పెట్టేసాను …
Leave a Reply