1998
ఈ రోజు ఇంగ్లీష్ పరిక్ష అయిపోయింది.తర్వాత మాథ్స్ ఎగ్జాం.దేవుడా అసలు ఈ లెక్కలు ఎందుకు కనుక్కున్నావు, ఒకవేళ కనుక్కున్నా అందులో పరీక్షలు ఎందుకు కనుక్కున్నావు స్వామీ.ఏంటో ఈ మాథ్స్ ఎగ్జాం అంటేనే జ్వరం వచ్చేస్తుంది.తప్పదు కదా, అన్నిటి తో పాటూ ఈ లెక్కలు కూడా ప్యాస్ అయితే కానీ ఫోర్త్ క్లాసుకి పంపరంట.ఇంత చిన్న బుర్రలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీరే చెప్పండి.అడిషన్లు, మైనస్సులే కాక 3rd క్లాసులో మల్టిప్లికేషన్లు,దివిషన్లు కూడా వచ్చి చేరాయి.ఇంకా 4త్ క్లాసుకి వెళ్తే ఇంకా పెద్దపెద్ద లెక్కలు ఉంటాయంట, చింటు అన్న చెప్పాడు.ఛ ఛ..పెద్దాల్లున్నారే ఎప్పుడూ ఇంతే.
రేపు మాకు సెలవు ఇచ్చారు.శ్రీ రామ నవమి కదా అందుకు.హమ్మయ్య సెలవు కదా ఇంకొంచం బాగా చదువుకోవచ్చు.పుస్తకం తీసానో లేదో ప్రియా అన్న,చింటూ అన్న వచ్చారు.మా ఇల్లు రామాలయం వీధిలో వుంటుంది.మా ఊరికి అదే రాముని గుడి.చాలా గొప్పగా చేస్తారు తెలుసా.నిజంగా పెళ్ళి లాగానే వుంటుంది.అప్పుడే చిన్నచిన్న షాపులన్నీ పెట్టేసారట.అన్నా వాళ్ళు, “ఒకసారి వెళ్ళి చూసి వద్దాం, రేపు ఏం కొనుక్కోవాలో డిసైడ్ చేస్కుందాం”, అని అన్నారు.సరేలే వచ్చాక చదువుకోవచ్చు అని వెళ్ళాను.
అబ్బో గుడి చుట్టూరా చిన్ని చిన్ని దుకాణాలు పెట్టేసారు.బొమ్మలూ,బెలూన్లు,ఐస్ క్రీం,బాదం పాలూ, ఇలా చాలారకాల దుకాణాలు వున్నాయ్.ఈ సారి కొత్త కొత్త బొమ్మలు చాలా వచ్చాయ్.అన్నిటికన్నా నాకు బైనాకులర్స్ చాలా నచ్చింది.కళ్ళకి పెట్టుకుంటే అన్నీ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి.ఇంకో రూపాయ్ ఇస్తే నెగిటివ్స్ కూడా ఇస్తాడు, వాటిని అందుట్లో పెడ్తే సినిమా పోస్టర్లు కనిపిస్తాయ్.చాలా బాగుంది.ఎలాగైనా ఈ సారి దీన్ని కొనేయ్యాలి.ఇంకా రంగునీళ్ళు వున్న గాజు ట్యూబులు,ఈ సారి కొత్త గా వచ్చిన వాటర్ బెలూన్లు, పెప్సీ పిక్నిక్ సెట్ బుడుగులు ఇలా చాలా పెద్ద లిస్టు తయారుచేసుకున్నాం.అన్నా వాళ్ళు బ్యాటూ,బాలు కొందాం అనుకున్నారు.ఏంటో ఈ అబ్బాయిలకి ఎప్పుడూ బ్యాట్లు,బాలు తప్పించి ఇంకేమి వుండవు.మాకైతే చక్కగా ఎన్ని బొమ్మలో…హమయ్య నేను అమ్మాయిని కాబట్టి సరిపోయింది.ఎంచక్కా గౌన్లు,పట్టు పావడాలు,పరికిణీలు, చీరలు,నగలు,జడలు అబ్బా….అబ్బాయిలైతే ఏముంది అయితే నిక్కర్లు,లేకపోతే ప్యాంట్లు.
ఇంక ఇంటికొచ్చి కాసేపు చదువుకుందామని పుస్తకాలు తెరిచాను.పుస్తకం నిండా గుడి దగ్గర చూసిన బొమ్మలే కనిపిస్తున్నాయ్.అలా అరగంట కూర్చుని రేపటి గురించి ప్లాన్ వేస్కునేసరికి నేను తెగ చదివి అలసిపోయానని అమ్మ నాకు బువ్వపెట్టి బజ్జోపెట్టేసింది.
“సీతారాముల కళ్యాణం చూతము రారండి”, గుడి స్పీకర్ లోంచి వస్తున్న పాటకి మెలకువ వచ్చింది.అమ్మ గబ గబ నాకు స్నానం చేయించి ఎండాకాలం కదా అని కొత్తగా కుట్టించిన కాటన్ ఫ్రాకు వేసి రెడీ చేసింది.నన్ను మా నాన్నకి అప్పగించి తను పక్కింటి ఆంటి తో పెళ్ళికి వెళ్ళింది.నాన్న నన్ను తీస్కుని, పెళ్ళి చివర్లో వస్తాలే అని చెప్పాడు.అమ్మ వెళ్ళాక చింటూ అన్న వచ్చాడు, గుడి దగ్గరికి వెళ్దాం అని.నాన్న నాకు పది రూపాయలు ఇచ్చాడు.అమ్మో పదిరూపాయలే జాగ్రత్తగా చూసుకోవాలి.ఒక గంటలో వచ్చెయ్యమని చెప్పి పంపించాడు.మేము ప్రియ అన్న వాళ్ళింటికి వెళ్ళి అక్కడినుండి అంతా కలిసి గుడి దగ్గరికి వెళ్ళాము.నిన్న చూసిన బైనాకులర్సు,ఒక చిన్ని పాప బొమ్మా, రెండు బెలూన్లు కొనుక్కున్నాను.అన్నా వాళ్ళు ఒకరు బ్యాటూ ఒకరు బాలూ కొని చెరి రెండు బెలూన్లు కొనుక్కున్నారు.
తర్వాత నిన్నలేని కొత్త షాపులు అన్నీ మళ్ళి ఒకసారి చూసి వచ్చాము.బాదం ఇసుక్రిం కొనుక్కుని తిన్నాం.భలే రుచిగా వుంది.ఐసు క్రీం కోసమైనా ఈ ఎండాకాలం ఎండలు భరించాలనిపిస్తుంది. ఇంకా ఒక రూపాయ్ మిగిలింది దాంతో సాయంత్రం ఇంకో ఐస్ క్రీం తిందామని దాచుకున్నాను.
అన్నా వాళ్ళు నన్ను ఇంట్లో దింపేసి వెళ్లారు.నాన్నకి నా బొమ్మలన్నీ చూపించాను.కాసేపు అయ్యాక గుడికి వెళ్ళాం.ఎంత మంది వచ్చారో.మేము బొమ్మలతో ఆడుకున్నట్లు చిన్నిచిన్ని బొమ్మ దేవుళ్ళకి పెళ్ళి చేస్తున్నారు.నాకేమో కనిపించట్లేదు అప్పటికీ నాన్న నన్ను ఎత్తుకుని నిల్చున్నాడు. కాసేపు చూసాను,ఆ పూజారి మాట్లాడుతూనే వున్నాడు.”ఇంకా ఎంతసేపు నాన్నా తొందరగా పెళ్ళి చేసుకోమను దేవుణ్ణి “,అంటే అందరూ ఉష్ అంటూ చెంపలు వేస్కోమన్నారు.
కాసేపు నా గోల భరించి ఇక వల్ల కాక మా అమ్మని ఆ గుంపులో వెతికి పట్టుకుని అందరి కాళ్ళు తొక్కి,తిట్టించుకుని ఎలాగో మా అమ్మ ఒల్లో నన్ను కూలేసి నాన్న వెళ్ళిపోయాడు.చెమటలు కారిపోతున్నాయ్ బాబోయ్, తొందరగా పెళ్ళి చేస్కోడేంటి ఈ దేవుడు.ఐనా ఎండా కాలం లో ఎందుకు చేస్కోవాలనిపించిందో ఈయనకి, అనుకుంటూ ఉన్నానా… ఇంతలో నాకు నిద్రపట్టేసింది.ఒక్కసారిగా పెద్దగా చప్పుళ్ళు వినిపించడంతో ఉలిక్కిపడ్డాను, అందరూ బియ్యం చల్లుతున్నారు దేవుడిపైన,నా మీద కూడా పడ్డాయ్.దేవుడ్నిచూపించి దండం పెట్టుకోమంది అమ్మ,కనిపిస్తే గా అసలు.నాన్న దగ్గర వున్నా బాగుండేది, భుజాలమీద ఎత్తుకుని చూపించేవాడు.వడపప్పు,పానకం ప్రసాదం పెట్టారు.నాకు వద్దంటే అమ్మఅస్సలు వినలేదు.ఎండాకాలంలో చాలా మంచివట, ఎండదెబ్బ తగలకుండా ఉంటుందని బలవంతంగా తాగించింది.
తర్వాత ఇంటికి వచ్చాక బువ్వ తినేసి చదువుకున్దామంటే నాన్న టి.వీలో సినిమా పెట్టాడు.రామాయణం సినిమా …చూస్తుంటే చూడాలనిపించింది.అబ్బ ఎంత బాగున్నారో రాజులూ రాణులూ.పెళ్ళి ఎంత బాగా చేసారో.పోనిలే ఇక్కడన్నా చూసాను సరిగ్గా ….గుళ్ళో కంటే బాగా.సీత ఎంత బాగుందనుకున్నారు..రాముడి పక్కన ఉంటే ఇంకా చాలా బాగుంది.ఎంత బాగుందంటే అంత బాగున్నదన్నమాట.ఇహ అంతకన్నా నేచెప్పలేను బాబూ.పాపం రాముడు సీతా అడవికి వెళ్ళిపోయారు.తర్వాత హనుమంతుడు వాళ్ళని కలిపాడు.ఎంత బలమో తెలుసా హనుమంతుడికి,ఐనా రాముడు ఎంత చెప్తే అంత ఆయనకి.రావణాసురుడు విలన్ అన్నమాట, చాలా చెడ్డవాడు.చాలా బాగుంది సినిమా.పాపం రాముడికి,సీతకి ఎన్ని కష్టాలో తెలుసా…ఐనా కూడా ఎప్పుడూ కోపం రాలేదు వాళ్ళకి…ఎంత మంచివాళో పాపం..మంచివాడు కాబట్టే రావణుడికి పది తలలు వున్నా ఈజీగా చంపేసాడు…నాన్న చెప్పాడు, మొదట్లో కష్టాలు పడినా కూడా చివరాఖరులో మంచే గెలుస్తుందట…చెడ్డ వాళ్ళు మొదట్లో సుఖపడినట్లు ఉన్నా చివర్లో ఓడిపోతారట…చెడుపై ఎప్పుడూ గెలుపు మంచికేనట.ఓహో ఇందుకన్న మాట రాముడిని అందరూ దేవుడనేది.
ఇంతలో సాయంత్రం అయిపోయింది.అమ్మ గుర్తుచేసింది లెక్కల గురించి అంతే మళ్ళి జ్వరం ఒచ్చేసింది.అయ్యబాబోయ్ ఒక రోజు సెలవొచ్చినా కూడా ఎక్కువ ఏమి చదవలేదు.ఆ పక్క బొమ్మలన్నీ ఊరిస్తున్నాయ్.పోనిలే ఇంకో మూడు పరీక్షలు రాసేస్తే పనైపోతుంది.ఎంచక్కా అన్నీ సెలవులే అప్పుడు, చక్కగా ఆడుకోవచ్చు.
ఇప్పుడు ఇంక చదువుకోవాలి..మరి ఉంటాను.అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
Leave a Reply