ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అంతా కొత్తే…..భాష రాదు , మన ప్రాంతం కాదు . అప్పుడు ఎక్కడినుంచో ఒక తెలుగు మాట వినిపిస్తే మన కెంత సంతోషంగా వుంటుంది..ఎడారిలో ఒయాసిస్సు చూసినట్టు వుండదూ? అదే నండి ఒక భాష గొప్పతనం..మాతృ భాష అంటే మన ఉనికి, మన వ్యక్తిత్వం.ఫెబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో వారు గుర్తించారు.అందుకని ఈ రోజు ఒకసారి మన తేనెల తేటల తెలుగు బాష గురించి చూద్దాం.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు మన పెద్దలు.”ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్” అని పాశ్చ్యాత్యులు అన్నారు , ఎందుకంటే ఇటాలియన్ భాష తర్వాత ఎక్కువ అచ్చులు వున్న భాష మనదే అట.అంత గొప్పది కాబట్టే విదేశీయుడైన సి.పి.బ్రౌన్ దొర, తెలుగు భాష ని నేర్చుకోవడమే కాకుండా తెలుగు భాష లో నిఘంటువు కూడా రాసారు.
మన మనసులో భావాలను వ్యక్తం చెయ్యాలంటే మన మాతృ భాషను మించినది వేరే భాష లేదంటాను.అవునా?నవరసాలలోని అనుభూతిని మనకి తెలియజేసింది మన తెలుగు భాషనే కదా?అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు కదా? అటువంటి అమ్మను ఏదైనా అడగాలన్నా కూడా మనకు మన భాషే కావాలి.అటువంటి మాతృ భాష మీద మనం గౌరవం కలిగి వుండడం మన ధర్మం.
మన పిల్లలకు మనం మన సంస్కృతి , సాంప్రదాయాలు తెలియజేయాలంటే ముందుగా మాతృ భాష మీద వారికి అభిమానం ఏర్పడేటట్టు చెయ్యాలి. పిల్లలకి నైతిక విలువలు, నీతి సూక్తులు చెప్పాలంటే మన భాష లో ఎన్ని పద్యాలు ఉన్నాయో చెప్పక్కరలేదు..జీవిత సత్యాలను చిన్న చిన్న పద్యాలలో పిల్లలకు తెలియజేసే శతకాలు ఎన్నో వున్నాయి తెలుగు లో..ఎదో భట్టీయం వెయ్యడం కాకుండా వాటిని పిల్లలకు అర్ధం అయేట్లు చెప్తే వారి మానసిక అభివృద్దికి అది ఎంతో మేలు చేస్తుంది..మొక్కై వంగనిది మానై వంగునా? అన్నారు పెద్దలు..కాబట్టి చిన్ననాటి నుండే వారికి మన భాష లోని గొప్పతనం తెలియచెయ్యాలి.మాతృ భాష లో పట్టు ఉన్న వారికి సృజనాత్మక శక్తి ఎక్కువగా వున్నట్టు నిరూపిన్చబడినది కూడా.
మనకే ప్రత్యేక మైనటువంటి పద్యాలూ, పాటలు, సామెతలు , కధలు మన ముందు తరాల వారికి అందచెయ్యవలసిన భాద్యత మనపై ఎంతైనా వుంది.
“చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?” అంటూ మీ చిన్నారి పాప పాడితే మీకెంత సంతోషంగా వుంటుంది చెప్పండి.
అనగనగా కధలు మనకి పాతే కావచ్చు, కాని మన పిల్లలకి అవి కొత్తే కదా?పెద్దలకి పిల్లల మధ్య అనుభంధాలు, ఆప్యాయతలు పెనవేసుకోడానికి మాతృ భాష ఎంతో అవసరం….పెద్దలపై వీడని పాశాన్ని కలిగించే శక్తి ఒక్క మాతృ బాష కే వుంది .
“చేతి వెన్న ముద్ద చెంగల్వ పూదండ..”అని చెప్పించిన తాతయ్యని ఎవరు మరచిపోతారు?
“అనగనగా ఒక రాజు , ఆయనకి ఏడుగురు కొడుకులు , వాళ్ళు వేటకెళ్ళారు“…అని పడుకునేటప్పుడు చెప్పే బామ్మని మరచిపోగలమా?
“ఆకేసి , పప్పేసి, నెయ్యేసి…అమ్మకో ముద్దా,నాన్నకో ముద్దా, నీకో ముద్దా“..అంటూ గోరు ముద్దలు తినిపించే అమ్మ ప్రేమని ,మనకందించిన మన మాతృ భాషకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలం?
“నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేలా?
చదువ పద్య మరయ చాలదా ఒక్కటి?
విశ్వధాభిరామ , వినుర వేమా” ఇంత గొప్ప సదేశం ఎన్ని మానెజ్మెంటు క్లాస్సుల్లో చెప్పాలి? ఒక్క పద్యం లో జీవితానికి సరిపోను పాఠం నేర్చేసుకోవచ్చు కదూ?అందుకే అమృతతుల్యమైన మన భాష ను కాపాడి మన ముందు తరాలకు ఇవ్వవలసిన భాధ్యతని మనం తీస్కుందాం…..
ఆధునిక కాలంలో రాణించడానికి కావలసిన ఆంగ్ల భాషను నేర్చుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మన భాష ను మరువకూడదు.ఎందుకంటే మన భాష మన ఉనికి..మాతృ భాషని ప్రేమించలేనివాడూ, రానివాడూ ఆత్మ లేని శరీరం లాంటి వాడు.
ప్రపంచ మాతృ భాషా దినోత్సవ సందర్భంగా ఒక్క సారి మన తెలుగు తల్లికి మల్లెపూదండని వేద్దామా?
Leave a Reply