ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను,
కాలిఫోర్నియా లో విలియం సన్ ఫారెస్ట్ రేంజ్ అని ఉంది.అది ట్రెకింగ్ కి బాగా ఫేమస్ . ఏటా ఈ కొండపైకి ఎక్కడం ఇక్కడి ప్రజలకి ఒక మంచి అనుభూతి .కాని ఆ అనుభూతిని కేవలం జ్ఞాపకం గా మార్చేసింది ఒక జీవి. ఎవరనుకున్నారు ఒక కప్ప గారు.
నిజమండీ, మౌంటెయిన్ యెల్లో లేగ్ద్ ఫ్రాగ్(mountain yellow legged frog) అని ఒక అంతరించిపోబోయిన కప్ప గారి జాతి . ఈ విలియంసన్ రాక్ ప్రాంతం ఈ జాతి కప్పలు పెరిగే ప్రాంతమట.2005 లో వీటిసంఖ్య 5-6 మాత్రమే. ఇక్కడికి వచ్చేటూరిస్టుల వల్లే ఈ కప్ప గారి జాతి అంతరించిపోతోందని మొత్తం ట్రెక్కింగ్ నే మూసేసారు.అప్పటినుంచి ప్రజలు ఎన్ని సార్లు పిటిషన్లు పెట్టినా కూడా కప్ప ల గురించి ఆలోచించి ఆ కొండని ముసివేసారట.ఇక్కడి అటవీశాఖ వారి ప్రయత్నం ఫలించి ప్రస్తుతం కప్పల సంఖ్య 105 కి చేరుకుంది.మొత్తానికి అంతరించిపోతున్న జాతిని బతికిన్చారన్నమాట.
ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయాలు ఏంటంటే
1.మనుషుల వల్ల ప్రస్తుతం,వాటికి ప్రమాదం వుండే అవకాశాలు ఒక్క శాతం మాత్రమే, ఐనా కూడా ఆ కొంచం రిస్కు కూడా తీస్కోలేదు ఇక్కడి ప్రభుత్వం.
2.ఇక్కడ చెప్పేవిలియం సన్ రాక్ చుట్టూ వుండే అడవుల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నాయి.
3.ఇక్కడ ప్రజల అసంతృప్తి కన్నా పర్యావరణ సమతుల్యత(ecological balance) కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.
అంతా చదివాక నిజంగా ఆ కప్ప ఇక్కడ వుండడం దాని అదృష్టం అనిపించింది.అదే మన దేశం లో ఐతేనా అలాంటి జాతి కప్ప ఒకటి ఉందని మనకి తెలిసే లోపు కప్పనీ,, కప్ప ఉన్న గ్రానైట్ కొండను కూడా మింగేసేవాళ్ళు మన భూభకాసురులు.
కప్ప వరకూఎందుకండీ బాబు, పోయిన వారం పేపర్ లో వేసారు, మన జాతీయ జంతువు శ్రీ శ్రీ పెద్ద పులి గారిని, మెహబూబ్ నగర్ జిల్లాలోచంపేసారు. అక్కడి తో ఊరుకోక దాని కాళ్ళ గోర్లు, పళ్ళు పీకేసి ఎత్తుకుపోయారు.ఎంత దారుణం.అంతేలే,.. మనిషి ప్రాణాలకే విలువ లేదు,ఇక జంతువుల్ని ఎక్కడ బ్రతకనిస్తాం.
ఇప్పటికే పిచ్చుకలని పోగొట్టుకున్నాం, ఇంకా ఏమేమి పోగొట్టుకుంటామో.పిచుకలు గుర్తున్నాయా ఇంతకి మీకు. మనం మన పిల్లలు మాత్రమే ఉంటే చాలదండి భూమ్మీద మనతో పాటు ఉండడానికి ప్రతి ప్రాణమున్న జీవికి హక్కు వుంది. వాటికే గనక నోరు వుండివుంటే, వాటికే గనక మనలా కోర్టులు వుంటే, ఈపాటికి మనమంతా జైళ్ళల్లో వుండాల్సి వచ్చేదేమో.
కొసమెరుపు: అన్నట్టూ పైన కాలిఫోర్నియా విశేషాలు మన నాయకులకు చెప్పకండి బాబూ, ఎందుకేంటి….ఇంకేమన్నా ఉందా…బంగారం లాంటి గ్రానైట్ కొండలని వదిలేస్తారా కప్పల కోసం అని ఇక్కడి వాళ్ళని కూడా పాడు చేసేస్తారు.పాపం….మంచితనాన్ని, మానవత్వాన్ని ఎక్కడో ఒక చోట బతకనిద్దాం.
Leave a Reply