Toy story from overseas
ఏవమ్మా! నీతో పాటూ మమ్మల్ని కూడా తీస్కెళ్లమని నెత్తి నోరూ కొట్టుకుని చెప్పామా ? విన్నావా ? అప్పటి దాకా మమ్మల్ని వదిలిపెట్టని నువ్వు పెళ్లి అవ్వగానే “అమ్మ దగ్గర ఉండండేం!! జాగ్రత్తగా చూసుకుంటుంది! నేనప్పుడప్పుడూ వచ్చి ముద్దు చేస్తాగా!!” అని చెప్పేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు!
చూడు ! మమ్మల్ని చూడు .. ప్రతి పండక్కీ బయటికి తీసి పిండి ఆరేస్తోంది మీ అమ్మ !ఏంటి మాకు ఇదీ .. అహ! ఏంటీ అంట!
*******************************
Love is everywhere in my feed
“ఈ ప్రేమించడాలు, ప్రేమించబడడాలు అంతా బూటకం అంటావ్ ?”
“ఎస్ .. అంతేగా !”
“స్వచ్ఛమైన ప్రేమ, ఆర్గానిక్ ప్రేమ అనేవి లేవు అంటావ్ ?”
“అఫ్ కోర్స్ .. అంతే అంతే!”
“పాశ్చాత్య సంస్కృతిని మన సంస్కారవంతమైన సోపెట్టి ఉతికి ఆరెయ్యాలి అనే పోస్టులని వైరల్ చెయ్యాలంటావ్ ?”
“తప్పకుండా .. అది మన కనీస బాధ్యత.”
“ఈ బంధాలన్నీ హు బుచుక్కు .. అంతా డార్విన్ సిద్ధాంతం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది అంటావ్ ?”“బల్ల గుద్ది మరీ చెపుతా !”
“తెల్లారి మీ ఆయన లంచ్ బాక్స్ ఓపెన్ చెయ్యగానే కనిపించేలా వాలెంటైన్స్ డే కార్డు రాత్రంతా కూచుని స్వయంగా చేసి పెట్టి మురిసిపోతావ్ !”
“పర్ఫెక్ట్ .. అంతే అంతే .. ఆ అ ఆఁ .. అదీ మరీ .. అసలది ఏంటంటే!!”ఛా నీతో వాదన పెట్టుకుంటా చూడు నన్ను నేననుకోవాలి !!
**************************
You and Me
“ఎవరి గొప్ప వారిదే .. ఎవరికి వారే సరి !అయినా ఒకరికొకరు, ఒకరి పక్కన ఒకరైతే భలే ఉంటుందే !! ఏమంటావ్?!”
“అంతే అంతే !”
**************************
Holi it is
ఈ సమయంలో మూడో క్లాసు నేను:
అమ్మా చింటూ అన్నా వాళ్ళు వస్తే నేను లేను అని చెప్పేయ్. అత్తా వాళ్ళింటికో ఇంకెక్కడికో వెళ్లిపోయానని ఇప్పట్లో తిరిగి రానని చెప్పు. నీ చేత్తో () ఒక గుప్పెడు పల్లీలు బెల్లం ముక్కా పొట్లం కట్టి ఇచ్చేయ్. వెనుక పెరటి తలుపు దగ్గరికి మధ్యాహ్నం నా ఫ్రెండ్ వస్తుంది కుయ్ కుయ్ మని .. దానికి కొంచం బువ్వ పెట్టెయ్. మీరందరు జాగ్రత. అక్కకి ఏం పెట్టినా నా వాటా కూడా తీసి పక్కన పెట్టండి. నేను మూల గది మంచం కింద ఉంటాను. నీకు మరీ భయమేస్తే తప్ప పిలవకు. తలుపులు ఊర్కే తెరవకు, అసలే నీకు మంచితనం ఎక్కువ. హోలీ రోజు అస్సలు పనికిరాదు మంచితనం గుర్తెట్టుకో … ‘అవ్వ అప్ప ’ ఆట అని మోసం చేసి ‘దేవుడమ్మ దేవుడూ .. మా ఊరొచ్చేను దేవుడు’ అని నన్ను చేతుల మీద ఊరేగించి రంగు నీళ్లలో పడేసారు పోయిన సారి. ఈ సారి దొరుకుతానేంటి !!
************************
Leave a Reply