The great Indian Chikki theorem
వార్త:
హవాయి లోని అతిపెద్ద టెలీస్కోప్ నుండీ ఇప్పటివరకూ ఎక్కడా ఎవరూ తియ్యలేని విధంగా “సూర్యుని“ ఫోటోలు తీసి విడుదల చేసిన సైంటిస్టులు.
అచ్చం బెల్లంపాకంతో చేసిన చనిక్కాయల పప్పుండలా ఉందంటున్న భారతీయులు.
Derivation:
సూర్య భగవానుడు = ఆరోగ్యానికి అధిపతి
చనిక్కాయల పప్పుండ = ఆరోగ్యం
కాబట్టి భగవానుడు = చనిక్కాయలు
hence proved.
నే చెప్తానే ఉన్నానా .. దేవుడిచ్చిన ప్రసాదం రా మా “చనిక్కాయలు!”
Back to the Routine
“ఇదిగో .. ఎక్కడమ్మాయ్ ?”
“ఇక్కడ .. బాల్కనీ లో ఈ మూలకి .. జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ ఆ వార గోడని పట్టుకుని డేక్కుంటూ వచ్చేయ్ ! ఆఁ ..వచ్చేటప్పుడు ఆ ఫ్లాస్క్‌లో టీ, ఆ పక్కనే కాసిన్ని బిస్కట్లు, ఉప్పు కారం జల్లిన చనిగ్గింజలు ఉన్నాయ్ పట్రా !”
“ఇదుగో .. ఇందా ! ఏంటీ సందడీ ?”
“క్రిస్మస్ సెలవులు కదా .. ఈ ఆఖరి శుక్రవారం మనింట్లో ప్లే డేటు.. పిల్ల పేరంటాళ్ళు అంతా వచ్చారు ! సగం పందిరి అయిపోయింది . మిగతా ఇల్లంతా పీకి పందిరేసాక మంగళారతి పాడేసి పిజ్జా వాయనాలిచ్చేయడమే! ఇహ సోంవారం నాడు పరమ పూజ్యులు, గౌరవనీయులు అయిన వీళ్ళ టీచర్లకి అప్పగించేసి ఒక దండం పెట్టుకుని వచ్చేయడమే !”
**********************
Judge me as you want
“అమ్మా నీకు ఐ లవ్యూ కార్డు రాస్తాను!”
“నా బంగారు కొండా! వరాల మూటా!! అలాగే తల్లీ .. నా విలువ తెలిసింది నీకొక్కదానికే మరి .”
“ఐ తరువాత ఎల్ తరువాత ఓ తరువాత … యూ !!!”
“అమ్మా .. !”“ఊ !!”
“అమ్మా .. ఏదైనా చెప్పు రాస్తాను ..”
“అప్పటినుండి ‘టార్చర్ పెట్టుట’ అనే పదాన్ని నూట తొంబై సార్లనుండి దిద్దిచింది చాలదూ .. ఇహ చాలు .. పో .. ఆడుకుంటావో పాడుకుంటావో .. ఇల్లు పీకి స్లైమ్ రాస్తావో .. నీ ఇష్టమొచ్చింది చేస్కో పో !”
“ఏవమ్మా .. పిల్లది మురిపెంగా ఐలవ్యూ కార్డిస్తే అట్లా కసురుతావేం !”
“ఆ తరవాత ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల వారందికీ స్పెల్లింగులు అడిగి మరీ రాయించింది .. నా చేత! పో పోవమ్మా .. ‘తల్లి ప్రేమ – అమ్మ దీవెన’ పోస్ట్‌లు షేర్ చేస్కో పో !!”
***************************
They are everywhere!! There is no place to hide..I am telling that
నిన్న పెట్టిన పోస్టుకి ఈ రోజు ఫీడ్ లో సూచనలు ! “పిల్లల్ని అరవకుండా ఎలా పెంచాలి” ట ! ఎవడ్రా అది, గూఢాచారి 777 వాళ్ళ అమ్మగారి మొగుడిగారులా ఉన్నాడు. నాకు ఇంటరెస్ట్ పోయింది ! (అర్ధం కానోళ్లు నా ముందు పోస్టు చూడండి !)
ఒక్కోసారి మన వ్యక్తి స్వేచ్ఛ బలైపోతున్న విధి విధానాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందనుకో !! నిరంజన్ గారూ ..ఎక్కడండి మీరు ?ఇందులో బుడ్డి దాని ప్రమేయం ఏమీ లేదుకదా .. ?
ఈ మధ్య గూగుల్, అలెక్స లతో రహస్యముగా మంతనాలు చేయుట చూచాయిగా చూచితిమి కాదో !! ధిక్ ధిక్ ! యున్ననూ మనము పీకునది ఏమియును లేదనుకో !గ్రాంధికం అయితే బెస్టనీ .. అంతర్జాల వేగులకు అర్ధం కాదేమోననే ఒక ఆశ ! #నాకుఇంటరెస్ట్పోయింది
**********************
Oh my ఏడుచుక్కల ముగ్గు!! Happy Sankranthi
“ నాయనమ్మా మరీ అమ్మ నన్ను కసిరి పొమ్మంది !”
“నిన్నే ! ఎందుకుట ?”“నేను కూడా ముగ్గులోకి రంగులు వేస్తానంటే .. మరి నాకు చేతకాదంట .. బంగారంలాంటి ముగ్గు పాడుచేస్తావే అని ఛీ పొమ్మన్నంది !!”
“అంటుంది అంటుంది .. ఓయబ్బో మహా ముగ్గు మరి ..పెళ్ళైనప్పటి నుండీ వేసే ముగ్గే ..ఏడు చుక్కల ముగ్గు!! ..అది తప్పించి ఇంకోటి రాదు.
‘ఏవమ్మా కోడాలు పండక్కి వచ్చిందా? ఇంటి ముందు ఏడు చుక్కల ముగ్గు ఉంటేనూ అందరూ అనుకుంటున్నారు మరి’ అని ఓ ఇకిలిస్తున్నారు ఊరి జనం.
ఒక్క చుక్క ఎక్కువ పెట్టినా తీగ పాకంలో పడ్డ చీమలా ఓ గిజ గిజలాడిపోతుంది . నీకెందుకు నే వేసి పెడతా కదా బుజ్జి ముగ్గు నీకోసం ప్రత్యేకం. మన ముగ్గు మనకే మన గొబ్బెమ్మ మనకే !! పదా మరి!ఏడాది కోసారి ముగ్గేసి నడుము కాళ్ళు పట్టేశాయని వెళ్ళిపోతుంది కదా సుందరీ … అప్పుడు మనమెల్లి కావలసినన్ని ఫోటోలు తీసుకుందాం మనమే వేసినట్టు .”
అవ్వా మనవరాళ్ళ గూడు పుఠాణి తెలియక వారిని చూసి మురిసి మూడు వక్కలవుతున్న ఏడు చుక్కల ముగ్గు కోడలుమ్ గారు !
*************************
Give me some Sun shine .. just Sun shine nothing else
ఏదో మనుషులం కదా చపలచిత్తంతో నిండు వెన్నెలా- పండు జాబిలీ అని పాడుకున్నామే అనుకో !
చందమామా – చల్లగాలి అని పులకరించామే అనుకో.. అంతమాత్రం దానికే అలిగితే ఎట్టాగయ్యా ?? నీ ముందు చందమామ ఎంతా ? ఐసు ముక్కలా కరిగిపోడూ .
రోజుకొక కళ మార్చే వాడితో నిన్ను పోల్చవచ్చునా !!
నీ ఠీవి వేరొకరికి ఏదీ !నిను మించు వాడు నీయంత నీవే కానీ ఇంకొకరు ఉన్నారూ.. లేరే !!
రవి తేజములలరగ నీవు వెడలితే చూడగ రెండు కళ్ళు చాలునా అంట ! మూడు రోజులైంది నిన్ను చూసి .. ఈ వియోగం నే భరించలేను .. ఇహ చాలు నీ దోబూచులు .. ఆ మబ్బుల చాటున దాగుడు మూతలు చాలు గానీ బయటికి రావోయీ. నువ్వు లే పోతే సమయానికి లేవ లేను, ఆకలి వెయ్యదు, పని చెయ్యలేను. దేని మీదా మనసు నిలువదు. నువ్వు లేని లాంగ్ వీకెండ్ కూడా వ్యర్థముగా తోచినది కాదో !బాబ్బాబూ .. ఇంత బతిమాలించుకుంటావే .. ఏమమ్మా ఇంత కఠినంగా ఉన్నాడు ఇతగాడు!! ఏదో ఒకసారి ముసురేస్తే బాగుంటుంది కానీ .. ఇట్లా రోజుల తరబడి నిన్ను చూడక నేను ఉండలేనయ్యా సామీ !
*******************************
Oh my Pepper!
ఏమే పెప్పా పిగ్గు ఇటు రావే .. కాస్త వాటంగా కూర్చోమ్మా . ఏదో నాలుగు మంచి ముక్కలు నేర్పుతావని, నీ ఆట పాటల్లో నా బుడ్డిని కూడా కలుపుకుని జాం జాం గా పెరిగేస్తారనీ మీ ఇద్దరినీ జత చేస్తే నువ్వు చేసిందేంటీ .. ష్హ్ ..మాటాడకు ఇక. సైకిల్ ఆటలు, టీచర్ ఆటలు, హాస్పిటల్ ఆటలు నేర్పిస్తుంటే భలే భలే మని మేము కూడా గెంతులువేసుకుంటూ చూస్తున్నామా !?ఇప్పుడు చూడు మీ అమ్మలాగా నేను పారాచూట్ వేస్కుని హెలికాప్టర్ నుండి దూకాలిట .. వాళ్ళ నాన్నేమో గోనె సంచీలో దూరి ఆగకుండా గెంతుతూ రికార్డు క్రియేట్ చెయ్యాలిట ! లేకపోతే “ఉహ్ సిల్లీ అమ్మ!!అహ్ నాటీ నాన్న!!” అని ఓ ఇదైపోతోంది !మేము కూడా నీ ఫ్యాన్స్ అని ఏమైనా ఆపేక్ష ఉందా అసలు! నేనంత మంచి దాన్ని కాదు అసలే .. నీ మీద ఉన్నవి లేనివీ అల్లేసి బుడ్డిని డోరా వైపు మళ్లించేస్తా . ఆ పిచ్చిది పాపం తన కష్టం తానే పడుతుంది . పెద్దాళ్ళ పీకల మీదికి తేదు . ఏమనుకుంటున్నావో ఆఁ !
*************************
Leave a Reply