నే చెప్పానా !!

Ashadam ❤️ love 🤗😍

“నాన్నా ముక్కు పైన, చెవి వెనకాల అక్కలే .. గోకు నాన్నా .”

“అన్నయ్యా .. లైట్ వేసి వెళ్ళు రా, అలాగే ఛానల్ మార్చి పోరా ప్లీజ్”

“ఒరేయ్.. ఫోన్ తెచ్చి ఇవ్వు ఇటు. అలానే పట్టుకో మాట్లాడాలి.”

“పెద్దోడా స్టవ్ ఆఫ్ చేసానో లేదో చూసి, కూర గిన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయ్. ”

“ఇదుగో దూరం .. ఆపై బుగ్గలకి రంగు అంటితే నాకు సంబంధం లేదు.”

ఈ ఆషాఢం ప్రాజెక్ట్ కి రాళ్లెత్తి, మా అరచేత పొడిచే పొద్దులో తమ సంతోషం వెతుక్కునే నాన్నలకి, తమ్ముళ్లకు, అన్నలకు ఇంకా ‘ప్రియమైన వారికి’ ❤️🥰!!

 

****************************************************

Now I know from where adults get their maturity and wisdom 🤘🤘😎

“ఐహిక సుఖాల మీద వ్యామోహం పోయి, రాగ ద్వేష మోహాల స్పెల్లింగ్ కూడా మరచిపోయి , ఆధ్యాత్మిక మోక్ష … అసలిందంతా కాదు, గీతాసారం అంతా తేలిగ్గా అరటిపండు ఒలిచినట్లు తెలియాలంటే ఏం చెయ్యాలి !”

ఓస్ అంతే కదా … మా ఇంటికి రండి . మా బుడ్డి దాన్ని కుదురుగా కూర్చోపెట్టుకుని ఒక్కటి, ఒక్కటంటే ఒక్క సినిమా చూశారంటే చాలు … తను అడిగే
1. ఎందుకు ?
2. ఏమిటి ?
3.ఎలా?
ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు ఓపిగ్గా చెప్పారంటే .. చెప్పి తట్టుకుని సినిమా ముగించగలిగారంటే అరిషడ్వర్గాలనీ జయించడంలో మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు!!

నార్మల్ కోర్స్ కావాలంటే ఆర్ట్ ఫిల్ము.. ఫాస్ట్ ట్రాక్ లో కానిచెయ్యాలంటే కమర్షియల్ సినిమా చూపిస్తాం!
మీ ఇష్టం !!

 

                                                                                  ****************************************************

I have Aladdin’s ‘Genie’ in my home🥶

“ఇదిగో టీవీ రిమోట్ చూసావా ?”

“దాన్ని అడుగు… అన్నిటినీ అదే దాస్తుంది.”

“చెక్క గరిటె చూసావా ?”

“దాన్నే అడుగు! అన్నీ తెలుసు దానికి!”

ఎవరండీ అదీ , ఇన్ని విషయాలు కడుపులో దాచుకునేది !!

“ఇంకెవరు… ‘శ్రీ సోఫా అలియాస్ కౌచ్’ గారు. ఫోన్ల నుండి బ్యాటరీ బ్యాక్ అప్ల వరకూ, పెన్సిళ్ల నుండి పిన్నీసుల వరకు అన్నిటినీ మింగేసి ఏమి ఎరగనట్టు బుద్ధిమంతురాలు బువమ్మ మాదిరి నట్టింట్లో ఉంటుందే..ఈ సోఫా గారే !”

********

టిక్ టిక్ టిక్ !

“ఎవరు నాయనా !”

“నేనండీ … జగదేక వీరుడిని. మా నాన్న గారి కంటాపరేషనుకి గులేబకావలి పువ్వు కావాలండీ. అది వెతుకుతూ ఉంటే ఇక్కడ దేవకన్యలతో రొమాన్సుకి సమస్యగా ఉంది. మీ సోఫా గురించి విని వచ్చా …. అందుట్లో గులేబకావలి దొరికితే ఎంచక్కా ఇటు నుండి ఇటే వెళ్లి ‘ఉన్నది పగలైనా వెన్నెల విరిసెలే ’ అని పాడుతున్న వారితో జాయిన్ అయిపోతా !”

“చూస్కో బాబూ … నీ అదృష్టం ! ఏమేమి దాచిందో దీని పొట్టలో . నీ పుణ్యాన మా నిధులు కూడా బయటపడొచ్చు .”

 

************************************

That one honest friend 💕
“హలో ! హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే వే !”

“యూ టూ వే !”

బ్లా బ్లా బ్లా బ్లా (అరగంట తర్వాత)

“నీకు గుర్తుందో లేదో.. ఫైనల్ సెమిస్టరు మెడిసినల్ కెమిస్ట్రీ ఎగ్జాం తర్వాత పానీపూరీ తిన్నాము, లాస్ట్ లో ఇచ్చే ‘చాట్ పూరీ ’ నాది నీకే ఇచ్చేసా !!”

“నీదెంత విశాల హృదయపు స్నేహమో”

“హా సరే కానీ ! ఆ రోజు మొత్తం 23 రూపాయలు లెక్క . నీ సగం నువ్వు ఇంకా తిరిగి ఇవ్వనేలేదు …. అదే గుర్తొచ్చి 😬

“….!”

************************************

Our honest sweet nothings 😁 It all started 7years ago 😍
#పెళ్లిరోజు

“ఎర్ర రంగు మేడా లేక ఆకుపచ్చ రంగు మేడా ?”

“ఆకుపచ్చ రంగు మేడ ! ఓనర్ వాళ్ళది తంజావూరు అంట తెలుసా!! ఊరెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చేసి పాలు పొంగిచెయొచ్చు. ”

“సర్లే తంజావూరు అంటే చాలు .. ఆస్తులు రాసిచ్చేస్తావ్ . అసలు చెన్నై రంగనాథన్ స్ట్రీట్ పక్కన నటేశన్ వీధి ‘కనకదుర్గా మెస్’ లో ఫుల్ మీల్స్ పెట్టించాలి నీకు. చివర్లో ఇచ్చే అమృతపాణి అరటిపండు తినేలోపు గానే తంజావూర్ మర్చిపోతావు.”

“అంత లేదు, మా తంజావూరు ‘ఆర్య విలాస్’ లో నాలుగు రకాల మసాలా దోశలు పెట్టించి, వేడి వేడి తుంపర్లు చిల్లేలా ఫిల్టర్ కాపీ ఇప్పించానంటే అర్జెంట్గా అక్కడే సెటిల్ అయిపోతావ్.”

“అవి తర్వాత తేలుద్దాం.. ముందు బెంగళూరు పని చూద్దాం . సాయంత్రం J.P నగర ‘ఛుల్హా చౌకి’ దాబా కెళ్దాం.”

“సరే మరి. 99 వెరైటీ దోస పాయింట్ లో 73 కవర్ చేసాం. మిగతావి కూడా ట్రై చేసెయ్యాలి . జయదేవ ఫ్లైఓవర్ దగ్గర బండిలో ట్రై చేద్దాం రేపు.”

“ఓకే !”

“కే ! 👍
(పిక్చర్ క్రెడిట్స్ : Yes.. బాపు గారి బొమ్మే .. మన స్వేచ్చానుకరణ )

************************************

I am exhausted and at the same time addicted to this lovely tiring hood 😍

అనేకానేక రోజుల్లో ఒక రోజు :
పగటి సమయం ఫార్వర్డ్ మెసేజిలు :

“సృష్టిలో తీయనైన బంధం, వీడలేని అనుబంధం, ఫెవికాల్ కన్నా దృఢమైన సంబంధం .. అమ్మ !”

నేను : వాకే ! అగ్రీడ్ ! అప్రూవ్డ్ ! ఆక్సెప్టెడ్ !

*************

రాత్రి 10 గంటలా 15 నిమిషాలా 11 సెకండ్లకు, అప్పటికే పందకొండు వేల నూటముప్పైమూడు సార్లు బేస్ వాయిస్ లో ‘అమ్మా! అమ్మా ! అమ్మా !’ అని పిలిపించుకుని, మంచంకింద మూలకి వున్న బాల్ దగ్గరనుండి గోడకి అతుక్కుని ఎండిపోయిన స్లైమ్ వరకు సర్ది, పిల్ల పేకి నిద్ర పోయిన తరువాత ఫోన్ తీసుకున్న క్షణాన ..

“సృష్టిలో తీయనైన బంధం, వీడలేని అనుబంధం, ఫెవికాల్ కన్నా దృఢమైన సంబంధం .. అమ్మ !” చూసి..

నేను: జానకీ … కత్తందుకో జానకీ ! నాయాల్ది .. వీడెవడో తేల్చుకోస్తా

************************************

I need to start my schooling again with my LO🙄

“అమ్మా ! సోలార్ సిస్టంలో ఎనిమిది గ్రహాలు ఉన్నయ్ .. అవేంటంటే మెర్క్యూరీ .. వీనస్ .. ఎర్త్ ………. నెప్ట్యూన్ !!”

“ఏడిసావ్ .. ఎనిమిది కాదు .. తొమ్మిది ! సౌర కుటుంబం – నవ గ్రహాలు !”

“కాదు! ఎనిమిదే .. మిస్ రమా ఎనిమిది ప్లానెట్స్ అని చెప్పింది. మా మిస్ ఎనిమిదంటే ఎనిమిదే … ఎనభై అంటే ఎనభై ఏ ! నేర్చుకో నువ్వు కూడా !”

*****

“ఇదేంటిది .. హే గూగుల్ మాతే !!”

“బాలా వచ్చితిన్ .. నువ్వు స్కూల్ వదిలిన రెండేళ్లకు ప్లూటో గాడ్ని కొన్ని నియమాలకు కట్టుబడలేని, కొన్ని షరతులు వర్తించని కారణాన ‘గ్రహ కూటమి‘ నుండి తొలగించితిరి. తరువాత జి .కే తో నీకు పని లేక తెలుసుకోలేక పోతివి. మంచిది. సెలవు !”

“అయ్యో ! అయ్యో ! ఏమిటీ ఘోరం ! పటంలో గుండు సూదంత ఉంటే మాత్రం ప్లూటో గాడిని గుటుక్కుమని మింగేస్తారా !! హవ్వ ! బుజ్జి వెధవ , ఏదో ఆ మూలకి తన మానాన తాను ఉండేవాడు చల్లహా ! మెతక వాడిని చేసి ఆటలో అరటిపండుని తీసేసినట్టు చేస్తారా ! అంతా మనిషి ఇష్టం అనమాట .. #నాకుఇంట్రెస్టుపోయింది

 

************************************

To Him to whom I would surrender myself 🙏

“యావమ్మోయ్ ! యశోదమ్మా .. రోళ్ళు – రోకళ్ళు , తాళ్లు – తాటిచెట్లు ఏవీ ఆనట్లేదుటగా మీ వాడి ముందు . ఎలా కట్టడి చేస్తున్నావు మరీ !”

“సామ భేద దండోపాయాలన్నీ వాడి చూసేసానమ్మోయ్! ఇలా లాభం లేదని చివరాఖరున ఇదుగో ఇదేదో మాయల పెట్టిట .. దీని ముందు కాసేపు కులేసి నేను కాస్త రెస్టు తీసుకుంటున్నాను. తన నోట్లో పట్టే పదునాలుగు భువన భాండాలనూ తానే చూస్కోవచ్చు H.D లో !” 

************************************

That guilt game every mom enjoys 🤓

“ఇదుగో ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండాలి .. ఒట్టు !”

“ఏ విషయం ?”

“ఈ రోజు బ్రష్ తనే చేసుకుంటాను అంది. ఓహో ‘మైల్ స్టోన్’ అని మురిసిపోయా . మరీ ఘుమాయించేస్తోంటే టూత్ పేస్టులో ఉప్పు కాకుండా ఇంకేమి ఉన్నాయబ్బా అని వెళ్లి చూసా .. సుబ్బరంగా హిమాలయా ఫేస్ వాష్ తో తోమేసుకుంది.”

“ఓ అదా .. వద్దు వద్దంటున్నా నన్ను కూడా ఆఫ్టర్ షేవ్ తో రుద్దేసింది .. నేనెవరికి చెప్పుకోనూ !”

“ఓర్చుకో .. ఎవరికీ తెలీనియ్యక . రేపు బుడ్డి దానికి ఇంకో బుడ్డిది పుట్టినప్పుడు ‘ఉష్షో బుష్షో’ అని ఆపసోపాలు పడుతుంది కదూ అప్పుడు చెపుదాం తన ఘనకార్యాలు !!”

“ఎందుకలా !”

“అదంతే .. అదో తుత్తి .. మా అమ్మమ్మ మా అమ్మ రహస్యాలు అలాగే చెప్పి ఉడికించేది .. మా అమ్మ అదే చేస్తోంది ఇప్పుడు ! ఆ రాక్షసానందం నేను ఎందుకు వదులుకుంటా.”

“సర్లే అలాక్కానీ!”

************************************

Sometimes online recommendations are real blessings 😁💕 To all those time /energy saving recommendations 🙏

“ఇదిగో బుడ్డిని ప్లే గ్రూప్ నుండి పిక్ చేస్కుని వస్తా .. ఈలోపు మంచి మూవీ కానీ సిరీస్ కానీ సెలెక్ట్ చేసి ఉంచు!”

“ఓకే ..డన్! అమెజాన్ ప్రైమ్, హులు, నెట్ఫ్లిక్ , యప్ ఫ్లిక్ …అన్నీ జల్లెడ పట్టేస్తా .. పిచ్చెక్కిస్తా !”

“ఇంకా వెతుకుతూనే ఉన్నావా .. సర్లే .. పాపని స్కూల్ నుండి పిక్ చేస్కుని వస్తా !”

“ఓకే ! ఇంకాస్త మంచి వాటికోసం చూస్తున్నా ఉండు.
హమ్మయ్య …మొత్తానికి దొరికేసింది. ఇదుగో రండి రండి ..
హా ..ఎవరు వీళ్లంతా?”

“మన బుడ్డి, దాని బుడ్డిది, అండ్ కో ! నువ్వు వెతికేలోపు ఇంకో తరం కూడా వచ్చేసింది మరి .”

దేవుడా .. ఇన్ని అప్షన్లు కూడా పెద్ద సమస్యే సుమీ ! ఏదో సంసార పక్షంగా మంగళవారం నాడు స్నేహా బుధవారం నాడు అన్వేషిత , గురువారం నాడు లేడీ డిటెక్టివ్ ఉన్న రోజులే నయం !

 

************************************

 

More you expect from someone more are the chances to get hurt 😏😖

“నిన్న పడ్డ వానకి మొన్న వేసిన రోడ్డు డోక్కుపోయినట్టు ఆ ఫేసు నువ్వూ నూ .. పో అవతలకి! మాట్లాడకు ఇక మరి.”

“ఇది మరీ బాగుంది. నేనేం చేసాను !”

“మళ్ళీ మాట్లాడతావే .. ఆపు! చక్కగా పోపు పెట్టి, ఉల్లీ వెల్లుల్లి దోరగా వేయించి, చక్కగా నిన్ను కూడా వేసి కాసిన్ని పాలు పోసి, కొబ్బరి పొడి వేసి మగ్గిస్తే .. నువ్వేం చేసావ్ చూడు !!”

“నా మీద ఎగిరి పడతావే ఊరికెనే ..! నే ముందే చెప్పా మూకుట్లో వేసే ముందు కాసింత కొరికి చూడమని .”

“అక్కడికీ భక్త శబరిలాగా కాయకి ఒక ముక్క చొప్పున కొరికి చూసామమ్మా… ఇలా మోసం చేస్తావని అనుకోలా ! కాయ సాంతం కొరుక్కుంటూ పోతే కూరలోకి పోపే మిగిలేది ఇక .”

“ఇన్నేసి అభాండాలే .. !!”

“మరి లేకపోతే … వేడన్నంలో కలుపుకునే మొదటి ముద్దపైన పెద్ద హీరో పై తీసిన భారీ బడ్జెట్ సినిమాలా ఎంత ఎక్సపెక్టేషన్ ఉంటుందో తెలుసా .. ముద్ద కలిపి నోట్లో పెట్టగానే చేదుగా పలకరించావ్ .. ఛీ బ్రష్టురాలా ! నీపై మనసు విరిగిపోయింది .. పో! చేదు బీరకాయ్ మొహం దాన !!” #నాకుఇంట్రెస్టుపోయింది

చేదు బీరకాయలందు నేతి బీరకాయలు వేరయా !

 

************************************

 

Beware of these smarty pants 🙄💕

“అమ్మా ఆమ్లెట్ వేసివ్వు..! అర్జెంటు !”

“ఉండు.. రెండు నిముషాలు !”

“ఊహు .. ఆమ్లెట్.. ఆమ్లెట్ .. ఆమ్లెట్ !!”

“అబ్బబ్బా .. వేస్తా .. మీ నాన్నని అడగొచ్చు కదా.. వాళ్ళ సర్కిల్ లో ఫేమస్ కుక్కు తెలుసా !!”

“వద్దు.. నాకు అమ్మా ఆమ్లెట్టే కావాలి. నాన్నది వద్దు.నాన్న బాగా చెయ్యడు.. ఐ లవ్ యూ !!”

****ఇదిగో తింగరి నిన్నే .. ఈ ఖిలాడీ మాటలు వినకు.. నా మాట విను ! నిన్నే ! ఓయ్ !****

“ఇదుగో ఆమ్లెట్టు రెడీ .. తిను పో !!”

****
“నాన్నా .. క్యాండీల డబ్బా పైన ఉంది ఇవ్వు !”

“పనిలో ఉన్నా .. అమ్మనడుగు!!”

“అమ్మకి ఏమీ తెలీవు .. సిల్లీ అమ్మా కాంట్ రీచ్ .. నువ్వు స్ట్రాంగ్ .. సూపర్ డాడీ ఇన్ ది ప్రపంచం . ఐ లవ్ యూ !”

****ఇందాకే ఆవిడకి చెప్పా .. వినకు.. యోవ్ నీకే చెప్తండేది !***

“ఇదిగో కాండీల డబ్బా .. ఎన్ని ఇవ్వాలో నాకేం తెలుసు .. నీకావాల్సినన్ని తీస్కో .. తరవాత నే ఎత్తి పెడతా !”
******
**అయిపోయింది .. ఈ చిలక మాటలు నేర్చింది .. వీళ్ళని బుట్టలో వేసే మంత్రం నేర్చింది .. ఇహ మోక్షం లేదు వీళ్లకు .. పరమపదసోపానమే ఇక**

 

************************************

Festival season on full swing 🙏💕

శ్రీ రస్తు శుభమస్తు చిరకీర్తిరస్తు..సత్య ధైర్య స్థైర్య సంప్రాప్తిరస్తు …. !!

ఆ విధంబున ఆశ్వయుజ శ్రీ శుద్ధ నవరాత్రులందు పురజనులంతా నానా విధ వస్త్రాలంకారాలు ధరించి, వాట్స్ ఆప్ ఇంస్టా ఫేస్బుక్ లందు స్టేటస్ అప్లోడ్ చేసేసి ఖండాంతర బంధుజనాలతో ఆన్లైన్ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

షరామాములుగా ఈటీవీ వారు శ్రీ కృష్ణ పాండవీయంతో మొదలు పెట్టి నర్తనశాలతో ముగించి భక్తిరసాన్ని పంచారు!!

విజయ దశమి శుభాకాంక్షలు అటూ ఇటూ పంపి అలసిపోయిన మెసెంజర్లు ఊపిరి పీల్చుకున్నాయి… మళ్ళీ దీపావళి సంబరాలతో పునః దర్శనం !

In many situations మేలుకో తెలుగోడా is a savior 😬

నాకు తెలీక అడుగుతాను .. అక్కడ స్పీడ్ లిమిట్ 40 మైళ్ళు కదండీ !! పాండురంగ మహత్యంలో పెద్దెంటీయారు లాగా, కర్తవ్యం సెకండాఫ్ లో నడక ప్రాక్టీస్ చేసే విజయశాంతి లాగా 20 మైళ్ళ లోపు అలా పాక్కుంటూ, దేక్కుంటూ వెళ్తే ఎలాగండీ! హౌ!! బీపీలు పెరిగిపోతున్నాయి ఇక్కడ !

పొద్దున్నే ముందు వెనకా ఒక ఐదు నిముషాలు గ్రేస్ పీరియడ్ పెట్టుకోకుండా సరిగ్గా గూగుల్ మ్యాప్స్ లో చూపించే టైం ని బట్టి టంచనుగా బయల్దేరే వాళ్ళకి ఎంత ఇబ్బంది ! టెల్ మీ ఐ సే !

ఏమన్నా అంటే హర్ట్ ఐపోతారు ! మనోభావాలు గాయపడతాయి. నిరంజన్ గారూ మీ పని మీరు కానీయండి సార్ !! #నాకుఇంట్రెస్టుపోయింది

 

************************************

 

The magical season is over the corner ❄️❄️

“ఓయ్ ..ఎక్కడున్నావ్?”

“ఇక్కడ …ఈ మూలన ..ధ్యాన ముద్రలో ఉన్నాను! దూరం దూరం ..నన్ను తాకొద్దు !”

“ఏమొచ్చింది ?”

“నాలో ఏదో అతీత శక్తి దాగిఉంది . ఏవో మానవాతీత శక్తులు నాతో మాట్లాడాలని చూస్తున్నాయి . నా వేలి చివరి నుండి విద్యుత్తు ప్రవహిస్తోంది . నేను తాకగానే పాపం మాములు మనుషులు ఒకానొక గగుర్పాటుకి లోనవుతున్నారు. ఏంటో మరి! ఇన్నాళ్లు మట్టిలో మాణిక్యంలా, నివురుగప్పిన నిప్పులా ఉండిపోయా .. ఇహ ఇలాక్కాదు … ఈ శక్తి ని లోక కల్యాణానికి వాడాలని నిర్ణయానికొచ్చి పరిష్కారం కోసం ధ్యానం సాధన చేస్తున్నా !”

”ఏడిసావ్ .. మానవాతీత శక్తులూ కాదూ వల్లకాడు కాదూ ! చలికాలం మొదలయ్యింది కదూ.. గాలి పొడిబారి స్టాటిక్ ఫోర్స్ ఇచ్చుక్కొడుతోంది అంతే ! నువ్వు ఫిజిక్స్ లో వీక్ కదూ..మర్చిపోయుంటావ్ లే! ఆ కాషాయాలు కమండలాలు ఇచ్చేసి మాలో కలిసిపోమ్మా … .అసలే తెల్లారి లేస్తే సోం వారం.”

“కాసేపు కూడా సంతోషంగా ఉండనీయదు కదా ..పాడు లోకం. ఎన్నెన్ని ఉహించుకున్నాను . ఏం జేస్తాం .. ఆ బ్లాక్ లెగ్గిను జాకెట్టు ఇలా నా మొహాన కొట్టు ..లాగించేద్దాం”#వాట్దచలికాలం  

 

************************************

I told you 🙄

”ఏంటీ ! వారం మధ్యలో పూరీ పొటాటో టిఫిన్ చేసిస్తే పల్లీ పచ్చడి కూడా కావాలన్నారా !! “

“మరే ! మా సీమోళ్ళు అంతేనమ్మా 😢ఇప్పుడు ఒకరికి ఇద్దరు తయారు .. వేలెడంత లేదు “వేరీస్ ది చట్నీ” అంటోంది !!”

“ఊరుకో ! ఊరుకో ! ’ఇంటరెస్ట్ పోయింది .. ఇంటరెస్ట్ పోయింది’ అంటుంటే ఎందుకో అనుకున్నా .. పోదు మరీ ! కష్టాలు పరీక్షలు మనుషులకే వస్తాయి తల్లీ .. మాన్లకు రావు కదా ! “
#పల్లీపచ్చడి

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *