పడమటి తీరాన ఓ కోయిల
Story Published in TANA 22nd Souvenir 2019
ఏ ప్రత్యేకతా లేని ఒక మాములు బుధవారం. మెల్లగా ఒక్కొక్కరే వచ్చి తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. గుడ్ మార్నింగ్ పలకరింపులు, చిరు నవ్వులు, తల పంకింపులు అన్నీ అయ్యాక తమ తమ పనులలో బిజీ అవుతున్నారు. కేలండర్ లో ఇంకో రోజు కరిగిపోడానికి సిద్ధపడుతోంది. ఎప్పుడూ పని తప్ప ఇంకో ధ్యాస లేదు అనేట్టు ఉండే అనిత, ఆరోజు ఎక్కడో ఏవో ఆలోచనల్లో చిక్కుకుపోయినట్టు కనపడుతోంది. మాటి మాటికీ కిటికీలోంచి ఎక్కడికో లాగేస్తోన్న చూపులని బలవంతాన స్క్రీన్ పైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. తను రోజూ ఎంతో గర్వంగా కూర్చునే సీట్ ఆరోజు ఎందుకో గుచ్చుకుంటున్నటుగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో సాధించిన ప్రాజెక్టులకి, చేరిన టార్గెట్లకి గుర్తుగా వచ్చిన మొమెంటోలు, సౌవనీర్లతో ఎంతో ఆర్టిస్టిక్ గా పెట్టుకున్న తన క్యూబికల్ ఈ రోజు ఇరుగ్గా తోస్తోంది ఆమెకి. కీ బోర్డు మీద టక టక లాడే చేతులు, మెల్లిగా శబ్దాలు చేసే ప్రింటర్లు, ఫాక్స్ మెషిన్లు, ఇటు అటూ తిరుగుతూ ఉండే కొలీగ్స్ …. ఈ హడావిడి వాతావరణం అంటే ఎంతో ఇష్టం అనితకి. తను ఎంతో కష్టపడి చేరుకున్న స్థానానికి చిహ్నాలు ఇవన్నీ. కానీ ఈ రోజొదెందుకో ఈ శబ్దాలు, ఈ హడావిడి అంతా గందరగోళంగా, ఊపిరాడని ఇరుకు గదిలో చిక్కుకుని పోయినట్లుగా తోస్తోంది ఆమెకి. ఆఫీస్ రూమ్ అంతా కుదించుకుపోయి, నాలుగు వైపుల నుండీ తనని ముంచేస్తున్న భావన. ఊపిరాడని, కంటికి కనపడని నిర్బంధం.
డెస్క్ పైన ఒక మూలగా పెట్టిన ఫ్రేములో ఆనందంగా, ఏ కల్మషం లేకుండా గుండెలనిండుగా నవ్వుతున్న ఇద్దరు పిల్లల ఫోటో. అనిత పిల్లలు వాళ్ళు. నిహాల్, నేహా. ముఖ్యంగా నేహా కళ్ళల్లో ఆ చిలిపిదనం, పద్దెనిమిదేళ్ల ప్రాయపు ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కాసేపు అలా తన ఇద్దరు పిల్లల ఫోటోని చూస్తే చాలు అప్పటివరకు ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోయి నిమిషంలో హుషారు వచ్చేస్తుంది అనితకి. కానీ ఈ రోజు అందుకు వేరుగా ఉంది ఆమె పరిస్థితి. అందుకు కారణం నిన్న రాత్రి అనుకోకుండా విన్న నేహా మాటలు.
“హలో, అమ్మా. థాంక్స్ అమ్మ. నేనే చెప్దామనుకున్నాను. ఇంతలో ఎలా తెలిసిపోయింది నీకు?” నేహాకి అండర్ గ్రాడ్యుయేషన్ సీట్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో వచ్చిందని అమ్మకి చెప్పాలనుకున్న వార్త ముందుగానే అమ్మకి తెలిసిపోయిందనే ఆశ్చర్యం, ఆశాభంగం కలగలిపి అడుగుతోంది అనిత.
“నేహా వాట్సాప్ చేసింది నాకు. సో ప్రౌడ్ ఆఫ్ హర్. వాళ్ళ తాతయ్య గిఫ్ట్ ఇస్తాను అంటే, తనకి ఏం కావాలో ఆలోచించుకుని చెప్తాను తాతయ్య అని చెప్పిందిట.”
“ఓ…. నైస్. అవును మా. అప్పుడే తను తీస్కోవాలకున్న కోర్సెస్, డార్మ్ కి కావలసిన సామాను, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా ఒక జర్నల్ లో ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది. మేము జస్ట్ మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు. ఉంటానమ్మా బై” అంటూ ఫోన్ పెట్టేసి నేహాని డిన్నర్ కి లాక్కొద్దామని పార్టిషన్ డోర్ తెరిచింది అనిత. బాల్కనీలో నిల్చుని తన విజయాన్ని తన చిన్ని ప్రపంచంతో పంచుకోవాలని ఆరాటపడుతూ, ఆగకుండా వస్తున్న ఫోన్లతో, మెసేజీలతో కుస్తీ పడుతోంది నేహా. అనుకోకుండా అలా రావడంతో నేహా మాటలు చెవిన పడ్డాయి అనితకి.
“మై పేరెంట్స్ … నో వే… దే ఆర్ సో బోరింగ్ మాన్ ” అంటూ భుజాలు కదిలిపోయేలా నవ్వుతోంది నేహా. ఎంత మోడరన్ పేరెంట్స్ అయినా, ఒక్క నిమిషం మనసు చివుక్కుమంది అనితకి. అలికిడికి వెనక్కి తిరిగి అమ్మని చూసి, “ఒక టూ మినిట్స్ మా” అని గోముగా సైగ చేసింది. ఫోన్ పెట్టేసి ఇవతలికి వచ్చి తల్లిని వెనగ్గా గట్టిగా కౌగిలించుకుంది. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టలేని వయసు అది. పిల్లలకి వడ్డించి తను కూడా కూర్చుంది అనిత.
“మా…. నాన్న రాలేదా ఇంకా?” నిహాల్ అడుగుతున్నాడు.
“కాస్త బిజీ వర్క్ అంట. లేట్ అవుతుంది అన్నారు. వీకెండ్ ఫామిలీ డిన్నర్ కి వెళ్దాం అన్నారు. అక్క సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి కదా! ” పిల్లల్ని చూస్తూ సంజాయిషీగా అంది అనిత.
“ఆస్ ఆల్వేస్!” అంది నేహా భుజాలెగరేస్తూ. తన ఇంస్టా గ్రామ్ అకౌంట్ చూపిస్తూ, “అమ్మా మా ఫ్రెండ్, వాళ్ళ పేరెంట్స్ డాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో చూడు. సో క్యూట్ కదా! దాట్స్ సో రొమాంటిక్! ఈ రోజు మా గ్యాంగ్ లో అంతా ఈ టాపిక్కే నడిచింది.” గలగలా పారే సెలయేరులా చెప్తూనే వుంది నేహా. ఓ ఇదన్న మాట ఇందాక తమకి “బోరింగ్” అన్న బిరుదు రావడానికి కారణం అనుకుంది అనిత.
పిల్లలంతకై పిల్లలు చెప్తే కానీ ఏదీ రెట్టించి అడగడానికి లేదు. మనసుకి, నోటికీ ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. ఏమాత్రం అటూ ఇటూ తూలి మాట్లాడినా హర్ట్ అయిపోతారు. రకరకాల జాతుల పేరెంటింగ్ మధ్య పెరిగిన పిల్లలతో స్నేహాలు. ఏ మాటకి ఎలా అర్ధం తీసుకుంటారో తెలీదు. ఆచి తూచి ఉండకపోతే లేత హృదయాలు ఎటు దారి తప్పుతాయో అనే భయం. పేరెంటింగ్ లో కూడా అప్డేట్ అవుతూ జాగ్రత్తగా నెట్టుకొస్తోంది.
అలా నేహా నోటి వెంట వచ్చిన “బోరింగ్” అనే పదం దగ్గరే ఆగిపోయింది అనిత మనసు. ఎంతో పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉంటూ కెరీర్ వైస్ గా, సోషల్ సర్కిల్ వైస్ గా ఆక్టివ్ గా ఉంటూ చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనుకుంటున్న అనితని ఆలోచనలో పడేసింది ఆ మాట. ఒక్కసారి మళ్ళీ ఫోటోలో ఉన్న “నేహా” వైపు చూసింది. అంతా తన పోలికే. ఇరవయ్యేళ్ళ క్రితం తనని తాను చూసుకున్నట్లే ఉంది అనితకి. అప్పటి తనలో ఎంతటి హుషారు, ఎంతటి చలాకీతనం. ప్రపంచంలో ఉన్న జీవశక్తి అంతా తనలో ఉందా అన్నట్టు ఉండేది. ప్రకృతిలో ఉండే ప్రతి చిన్న సంగతీ తనని స్పందింపచేసేది. కోయిల కూసినా, గాలికి కొబ్బరాకు గలగలలాడినా కదిలిపోయేది. మబ్బు మసకేసి వెన్నెలని దాచేస్తే బాధపడేది. అమ్మమ్మ ఇంట్లో పాలు పిండడానికని ఆవు దగ్గర పొడిచి పొడిచి పాలు తాగుతున్న దూడని లాక్కెళుతుంటే ఎంతలా విలవిలలాడేదని. మళ్ళీ పాలు పిండేసాక వదిలిన దూడ తోక ఎత్తి పరుగు పరుగున తన అమ్మని చేరితే అంతే సంబరపడేది. ఏమైపోయింది ఆ అనిత. తను ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడి చేసే అనిత, గట్టు తెగిన గోదారిలా కబుర్లు చెప్పే అనిత, చెట్టుని పుట్టని ప్రతీ పిట్టనీ స్నేహంగా పలకరించి మురిసే అనిత, ఏమైపోయింది. కాలం గిర్రున తిరిగీ తిరిగీ ఇదిగో ఇక్కడ ఇలా నిలబెట్టింది తనని …. “బోరింగ్” అనిత గా. ఇక ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండలేకపోయింది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే పిచ్చెక్కిపోయేలా ఉందని, బాస్ కి ఒంట్లో బాగోలేదని మెయిల్ పెట్టి, కిందవారికి ఇవ్వాల్సిన వర్క్ ఇచ్చేసి బయట పడింది.
ఇంటికి వచ్చేసి స్ట్రాంగ్ గా కాఫీ చేసుకుని గార్డెన్ కి ఎదురుగా బీన్ బాగ్ వేసుకుని కూర్చుంది అనిత. నేహా “బోరింగ్” అన్నందుకు బాధ లేదు తనకి. ఇప్పటి పిల్లలు అంతే, ఏదీ మనసులో పెట్టుకోరు. “ఐ హేట్ యూ మామ్” అని తలుపులు ధడేలున మూసిన బిడ్డ, పది నిమిషాల్లో “యూ ఆర్ ది బెస్ట్” అని హత్తుకోవడం తెలుసు తనకి. తను ఇప్పుడాలోచిస్తోంది తనకి తెలీకుండా తాము “బోరింగ్” ఎప్పుడు అయ్యామా అని! పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక పెద్దరికం తెచ్చుకుని, హుందాతనం ముసుగు వేసుకున్నాకా? లేక పిల్లల్ని బాగా చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అని తమని తామే డబ్బు అచ్చు చేసే యంత్రాల్లా మార్చేసుకున్నాక? లేక ఆనందం అంటే వీకెండ్ లో ఒక ఫ్యామిలీ డిన్నర్, సమ్మర్ లో ఒక వెకేషన్, సోషియాలజీ ప్రాజెక్ట్ లో భాగం అయినట్టు ఒక ఇండియా ట్రిప్, అని లెక్కలు వేసుకుని గుడ్డిగా ఆ రూల్స్ ని యాంత్రికంగా ఫాలో అయిపోతున్నందుకా?
కాదు. ఇందుకు కాదు. నేహా అన్నది మా ‘ఇద్దరినీ.’ పిల్లలు, కుటుంబం, సోషల్ లైఫ్, వర్క్ లైఫ్ ఇన్నిటిని మానేజ్ చేస్తూ ఒకరినొకరం మర్చిపోయిన మమ్మల్ని. ఎదుగుదలని బ్యాంకు బాలన్స్ తో, స్థిరాస్తుల పోగుతో ముడివేసి, మొబైల్ రిమైండర్లతో అనుబంధాలని మెయింటైన్ చేస్తూ, అలారం మోతలకి, లంచ్ బాక్స్ లకీ, పిక్ అండ్ డ్రాప్ లకీ, గ్రోసరీ షాపింగులకి మధ్య నలిగిపోయిన తమ బంధాన్ని. ఒకే కప్పుకింద ఉంటూ హడావిడిగా, ఎవరో చెప్పిన ప్రామాణాలకి తగట్టు బతకడానికి పరుగులెడుతూ ఒకరినొకరం మర్చిపోయిన మమ్మల్ని. మబ్బులు తొలగి బయటపడ్డ సూర్యకాంతిలాగా అసలు కారణం ఏంటో అర్ధం అయింది అనితకి.
చక చకా ఏదో గుర్తొచ్చిన దానిలా పరుగున వెళ్లి స్టోరేజ్ లో ఉన్న బాక్స్ ఒకటి తెరిచింది అనిత. గడిచిన జీవితం తాలూకు జ్ఞాపకాలు పేరుకుపోతూ రాగా, కొత్త వాటికి చోటివ్వడానికని జాగ్రత్త చేసిన ఒకప్పటి ప్రియమైన వస్తువులు. అడుగున ఎక్కడో ఉంది తాను వెతుకున్నది. చేతుల్లోకి తీసుకోగానే తనతో పాటు ముడివేసుకున్న అనుభూతుల వెంట పరుగులు తీయించిన చీర, తన పెళ్ళిచూపుల నాటి చీర. ఒక్కసారి ఆ చీర మెత్తదనాన్ని బుగ్గలకి తాకించుకుంది, ఇన్నేళ్లు మర్చిపోయిన తనలోని ఒకప్పటి అనితని వెతకడానికా అన్నట్టు! లేత కనకాంబరం రంగు షిఫాన్ చీర. సన్నని బంగారపు అంచు ఉన్నది. ఆరోజు తనకి బాగా గుర్తు …పిన్నులతో ఎక్కడా జారిపోకుండా పకడ్బందీగా చీర కట్టుకుని, ఇంత బారు జడలో ఒకే ఒక్క రోజా పూవు పెట్టుకుని కాటుక దిద్దుకుంటుంటే, వెనగ్గా వచ్చి నిల్చున్న అమ్మ అలాగే కాసేపు చూస్తూ నిలబడిపోయింది. అప్పుడప్పుడూ తను నేహాని చూస్తుందే అచ్చం అలాగే…. తమలో మాయమైన భాగమేదో తిరిగి ప్రాణం పోసుకుని తమ కళ్ళముందే తిరుగాడుతుంటే సంభ్రమంగా చూస్తున్నట్టు.
ఆరోజు కలిసింది అతన్ని. “పెళ్లి చూపుల్లో కొన్ని నిముషాలు మాట్లాడుకుని ఎలా డిసైడ్ చేసుకుంటారమ్మా పార్టనర్‌ని?” అని నేహా అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటుంది. ఏమో ఎలా తెలిసింది తనకి? తన ఒరవడిని తట్టుకుని నిలకడని ఇవ్వగలడు అతను అని. ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి అని పెరట్లోకి పంపించినప్పుడు, నంది వర్ధనం చెట్టు కింద మౌనంగా ఉన్న రెండు నిముషాలు, కొబ్బరి చెట్టు కింద చూపులు కలిపిన క్షణాలు, తరువాత సన్నజాజి పందిరి దగ్గర విరిసిన నవ్వులు. ఆ మొదటి చూపుల్లో ఎంత మాయ ఉందనీ. నూరు వరహాల చెట్టు పక్కగా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఒక కాలు పెరటి వైపు గోడకి ఆనించి ఏవో మాట్డాడుతున్న అతన్ని, బట్టలుతికే రాయిపైన కూర్చుని అత్యంత శ్రద్ధగా విన్ననన్నూ ఎలా మరచిపోయాను?… అనుకుంటూ మర్చిపోయిన ఆనాటి రోజులని, తమ బంధాన్ని సమీక్షించుకుంటోంది అనిత.
పది నిమిషాల మాటల్లోనే ఎంత దగ్గర మనిషి అనిపించాడు. ఎలా తెలిసింది తనకు? అప్పటి మొదలు ఇద్దరం కలిసి ఎన్ని జ్ఞాపకాలని పోగుచేసుకున్నాము. పెళ్లి వరకు ఉన్న మూడు నెలల వ్యవధిలో ఎన్నెన్ని ఊసులు, ఎన్నెన్ని కబుర్లు. సంతోషానికి, అల్లరి నవ్వులకి, చిరునామాలా ఉండేవాళ్ళం. ప్రపంచం మొత్తం ఉన్నది మమ్మల్ని ఆనందింపజేయడానికే అన్న ధీమా. అసలు మేమే ప్రపంచం అనుకునేంత వెర్రి ప్రేమ. ఈ చనువుతో జరిగిన పెళ్ళి. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అన్న భావనే లేదు అసలు. తప్పిపోయిన రెండు జిగ్ సా పజిల్ ముక్కల్ని కనిపెట్టి అతికించినంత సులువుగా కలిసిపోయాం. ఎక్కడ చూసినా మేమే, ఎటు చూసినా ప్రేమే అన్నట్టు ఉండేవాళ్ళం కదూ. ఎటెల్లిపోయాడు తను?
గుండెలపైన గుప్పెడు మల్లెలు చల్లినట్టు నవ్వే వాడు. ఒకసారి సెలయేటి ప్రవాహంలా, ఒకసారి సముద్రపు ఉప్పెనలా ఎన్నెన్ని రకాలుగా తనని ప్రేమించేవాడనీ. ఆ జలపాతపు హోరులో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే వెంటనే ప్రశాంతమైన కొలనులా అక్కున చేర్చుకునే వాడు కదూ. ఏమైపోయాడు తను? అతను కూడా తనలో మాయమైన భాగాన్ని వెతుక్కుంటున్నాడా? అసలు తను మారిపోయాడన్న ఆలోచన అయినా వచ్చిందా తనకి. నాకు మాత్రం వచ్చిందా? ఎదురెదుగా ఉంటే చాలు, కలసి ఒక ఇంట్లో ఉంటే చాలు అనుకునే స్టేజ్ కి ఎప్పుడు వచ్చాము అసలు? చీర మడతల్లోంచి జారిన ఫోటో ఒకటి చేతిలోకి తీసుకుంది. పెళ్ళైన కొత్తల్లో కాశ్మీర్ లో తీసుకున్నది. కాశ్మీర్ బట్టల్లో, చేతిలో బుట్టతో అందంగా నవ్వుతున్న తనని, అతను వెనుక నుండి వాటేసుకుని తీసుకున్న ఫోటో.
ఎన్ని రోజులైంది అతను ఇలా నవ్వి? గుర్తు చెయ్యాలి … తనకే తెలీకుండా ఎంతలా మారిపోయాడో గుర్తుచెయ్యాలి. అప్పటి అల్లరి నవ్వులని ఒకసారి గుర్తు చెయ్యాలి, అనుకుంది. అనుకున్నదే తడవుగా వెంటనే లేచి ఫ్రెషప్ అయింది అనిత. పెళ్లిళ్ల కోసమో, పార్టీల కోసమో, ఆఫీస్ మీటింగుల కోసమో కాకుండా అచ్చంగా అతని కోసమే రెడీ అయింది. నిజమే! అతని కోసం, తనని కలవడం కోసం మాత్రమే రెడీ అయ్యి కూడా ఎన్ని రోజులైంది. ఇష్టమైన వారిని కలుసుకునే క్రమంలో ఉండే ఉద్విగ్నత అనుభవించి ఎన్ని రోజులైంది. అనిత అతన్ని కలవడం కోసం బయల్దేరింది. తెలియని సంచలనం ఎదో సీతాకోక చిలుకల రెక్కల సందడిలా కొట్టుకోవడం మొదలయ్యింది కడుపులో. ఇప్పటికిప్పుడు అతని చేతుల్లో వాలిపోవాలనే ఆతృత నెలకొంది. ఇంకో గంట గడిస్తే కానీ చేరలేను అతన్ని, అనే ఆలోచనే భరించలేకపోతోంది. ఇన్నేళ్లు గంటలు గంటలు క్షణాల్లా దొర్లించేసిన తను, మళ్ళీ క్షణాలు యుగాల్లాగా తోస్తున్న ఈ బాధని సరికొత్తగా అనుభవిస్తోంది. చూడాలి, అతన్ని చూడాలి అన్న ఆలోచన మాత్రమే. కార్ తీసి అతని ఆఫీస్ అడ్రెస్స్ గూగుల్ మ్యాప్స్ లో పెట్టి, తన మనోవేగంతో సంబంధం లేని ట్రాఫిక్ లో బయలుదేరింది అతని దగ్గరికి.
దారి పొడవునా తాను ముందుకు వెళ్తుంటే ఇన్నేళ్లలోని జ్ఞాపకాలు, సంతోషపు క్షణాలు ఒక్కొక్కటే పలకరించి నవ్వుతూ వెనక్కి వెళ్లిపోతున్నాయి, ఇంకాస్త విరహాన్ని పెంచుతూ. పెళ్ళికి ముందు ఎవరికీ చెప్పకుండా ఒకసారి ఊరిచివర తోటలోని శివాలయానికి వెళ్లిన సంగతి గుర్తొచ్చింది అనితకి. కాలేజ్ అయిపోయే సమయానికి ఇంటికి చేరొచ్చులే అని. ఎవరికి తెలుసు వాళ్ళు వచ్చిన బైక్ ఫెయిల్ అవుతుందనీ. ఆ బైక్ ని పూజారి గారింట్లో వదిలేసి ఆ ఊరుగాని ఊరిలో లాస్ట్ బస్సు పట్టుకుని ఇంటికి చేరేసరికి పది గంటలు. రాత్రి తొమ్మిది తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో తెలీని నాన్న పెంపకం. “ఇంటికి వెళ్ళను, నాన్నను చూడలేను ఎటైనా పారిపోదాం” అని రాగాలు తీస్తున్న తనని ఇంటికి తీస్కుని వచ్చి దింపాడు. అగ్నిహోత్రంలా ఉన్న నాన్నని దాటుకుని లోపలికి పరిగెట్టి అమ్మతో మొట్టికాయలు తిని బయటికి వచ్చి చూసేసరికి ఏముంది, ఏమి చెప్పాడో ఏమో ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అతను వెళ్ళాక నాన్న నా తలపై ప్రేమగా నిమిరి నిశ్చింతగా చూసిన చూపు మరచిపోగలనా! విడిచి వెళ్లే ప్రతి సారీ “ఉంటాను అమ్మాయ్!” అంటూ తన చేతిలోకి నా చెయ్యి తీసుకుని నొక్కి వదిలే ఆ ప్రేమని ఎలా మర్చిపోయాను. నా కోసం, మా కోసం, ఇప్పుడు కుటుంబం కోసం తనని తాను మరచిపోయి పరుగులు తీస్తున్న మనిషిని ఎలా మర్చిపోయాను… ఇలా ఒక్కసారిగా అతని గురించిన ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా శరీరంలో ప్రతి అణువు నిద్రలేచి మరీ అతని కోసం చూస్తున్నట్టు అనిపించింది అనితకి.
సాయంకాలం తీసుకునివచ్చే చీకట్లకి తన దగ్గర తావు లేదన్నట్లుగా నియాన్ లైట్ల వెలుగుల మధ్య ముస్తాబయ్యి మెరిసిపోతోంది సాన్ ఫ్రాన్సిస్కో నగరం …తన లాగే ఎవరో ప్రియమైన వారికోసం ఎదురుచూస్తున్నట్లుగా. కార్ పార్క్ చేసి మెసేజ్ చేసింది తనకి. రిప్లై వెంటనే రాదు …తనకు తెలుసు. అఫీస్ …బిజీ…బ్లా బ్లా బ్లా!
మాములుగా అయితే చికాకు పడేదే … ‘ఎప్పుడూ ఏమి పట్టించుకోడని’… అందుకే కదా తాను కూడా అంతే బిజీగా మారిపోయింది. ఇప్పుడు చికాకు లేదు. పందొమ్మిదేళ్ళ క్రితం అతని కోసం కాలేజ్ బస్టాప్ దగ్గర ఎదురు చూసినప్పటి ఉద్వేగం తప్ప.
కాల్ చేసింది!
కట్ చేసాడు!
చేస్తాడని తనకు తెలుసు, మీటింగ్ లో ఉండి ఉంటాడు. తను మళ్ళీ చెయ్యకపోతే అసలు కాల్ చేశానన్న విషయం కూడా తనకి గుర్తుండదనీ తెలుసు.
ఈ బిజీనేగా తమని మార్చేసింది, పంతాలకి పోయేలా చేసింది. ‘డిపెండెన్సీ’, ‘ఇండిపెండెన్సీ’ అని ఏవేవో తమ మధ్యలోకి తీసుకుని వచ్చి ఈగోలని పెంచింది.
కానీ ఈసారి కోపం రాలేదు, అసహనం అస్సలే లేదు. ‘పట్టించుకోడు, అందరి మగాళ్లలాంటి వాడు’ అని ఒకతాటికి కట్టేసి తిట్టుకోలేదు ఈసారి. ఎదురుచూసింది.
పెళ్లైయ్యాక మొదటి సారి అమ్మావాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తనని తీసుకెళ్లడానికి వస్తానన్న ఈ మనిషి కోసం ఒళ్ళంతా కళ్ళు, చెవులు చేసుకుని, పరధ్యానంగా ఉండి అమ్మ దగ్గర చివాట్లు తిని ఒకప్పుడు ఎదురుచూసినంత ఓపికగా ఎదురుచూస్తోంది ఇప్పుడు.
ఏ రెస్పాన్సు లేదు … ఉండదు, తెలిసిందే కదా మనంత మనం తెచ్చిపెట్టుకున్న బిజీ.
మళ్ళీ కాల్ చేసింది… వాయిస్ మెయిల్.
ఇంకోసారి …!
ఈసారి ఒక మెస్సేజ్. ” ఈజ్ ఎవెరీథింగ్ ఆల్ రైట్? బిట్ బిజీ! ఎనీ ఎమర్జెన్సీ?” అని.
“ఎస్ … అర్జెంట్ …వెంటనే ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలి”
“కమాన్! ఆర్ యూ ఓకే! మిడ్ వీక్ ఇష్యూస్ లో ఉన్నాను. ”
“మీ ఆఫీస్ దగ్గరగా ఉన్నాను…వస్తావా! ఉహు …రా …రావాలి … రా చిన్నూ!”టైప్ చూస్తుంటేనే గొంతులో ఎదో అడ్డొచ్చినట్టు ఉంది అనితకి. ఎన్ని ఏళ్లైయింది అలా పిలుచుకుని.
వెంటనే మోగింది తన సెల్…. “నాకు తెలుసు… అతను మర్చిపోలేదు…మరిచిపోలేడు కూడా. నేనే గుర్తుచెయ్యలేదు ఇన్ని రోజులు. గుర్తుతెచ్చుకునే అవకాశం ఇవ్వలేదు ఎప్పుడూ,” అనుకుంటూ తనలో చెలరేగుతున్న సంచలనాన్ని అదుపుచేసుకుంటూ ఫోన్ ఎత్తింది అనిత.
“ఆర్ యూ సీరియస్ … సాన్ ఫ్రాన్సిస్కో వచ్చావా? ”
“హ్మ్మ్ ”
“ఎక్కడున్నావ్”
“మీ ఆఫీస్ కి ఎదురుగా … నార్త్ సైడ్ వస్తున్నా.”
ఆపైన కట్ చేసేసాడు.
పెయిడ్ పార్కింగ్ లో కార్ పెట్టి నడుస్తోంది అనిత వడి వడిగా. ఎత్తులు పల్లాల మీద కట్టిన సాన్ ఫ్రాన్సిస్కో నగరం. ఎటు వైపు చుసినా ఆకాశాన్ని అంటే అద్దాలమేడలే. తన కోసం వస్తానన్న రాకుమారుడు అలసిపోయి ఎంతకీ రాకపోయేసరికి అతని కోసం అద్దాలమేడ లోంచి రాకుమారే వెళ్ళింది ఈసారి.
ఈ కింది నుండి ఏటవాలుగా ఆ పైకి ఒక ఐదు నిముషాలు నడిస్తే అతని ఆఫీస్. పెడిస్ట్రియన్ సైన్ పడగానే హడావిడిగా పరుగులు పెడుతున్న జనం. వారి మధ్యలో నడుస్తూ, చిన్నగా పరిగెడుతూ వెళ్తోంది. అదిగో అక్కడే ఉన్నాడు అతను, ఆ పైన. మబ్బుల పువ్వుల్లాంటి చెర్రీ పూల చెట్టు కింద, తోరణంలా వేళ్ళాడుతున్న ఎలక్ట్రిక్ బల్బుల కింద. అనిత కనపడగానే రెండు చేతులు జుట్టులోకి పోనిచ్చి ఆశ్చర్యంగా సంభ్రమంగా ఆమె వైపు చూస్తూ. అడుగుల దూరానికి వచ్చేసారు. చెయ్యి చాపాడు… అందుకోకపోతే ఇదంతా కలలోలాగా ఎక్కడ మాయమైపోతుందో అన్న భయంతో వణికే కాళ్లతో ఎక్కడ పడిపోతానో అన్న ఆతృతతో వెంటనే అతని చేతిని అందుకుంది అనిత. అందుకోగానే అప్పటి వరకు తాను పడ్డ సంఘర్షణని మాటల్లో చెప్పలేను అన్నట్టుగా గట్టిగా కౌగిలించేసుకుంది. ఏ భాషకీ అందని ఊసులు ఏవో కలబోసుకోవాలి అన్నట్టు కలిసిన పెదవులు. విడివడుతూ ఉండగా చూసింది అతని కళ్ళలోకి, తాను వెతుకుతున్న దాని కోసం. జుట్టు పలచబడినా, కొలతలు మారినా ఏ కాలం ఎన్నటికీ మార్చలేని ఆ కనులలో మెరుపుని. అప్పటి అనితకి ‘ఇతను తనకోసమే’ అన్న భావన కలిగించిన ఆ చూపుని. ఇన్నేళ్లు తాను చూడడం మర్చిపోయిన, చూడాలి అనుకోవడం కూడా గుర్తులేకుండా పోయిన ఆ మెరుపు…. అదిగో. తనలో ఉన్న పాత “అనీ” ని మేల్కొల్పే తను.
“మిస్ యూ, చిన్నూ! మిస్డ్ మైసెల్ఫ్ టూ!” అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది అనిత.
ఎలా వచ్చిందో, ఎవరు తెచ్చారో… ఎక్కడో దూరంగా తూర్పు వైపు నుండి వచ్చిన కోయిల ఒకటి ఈ పడమటి తీరాన తియ్యగా కూస్తోంది.
Srinidhi Yellala
Leave a Reply