If I have to share Bloopers for my write ups 😐🙄
“ముత్యపు జల్లులుగా కురుస్తున్న వాన చినుకులని దోసిట్లో నింపేసుకోవాలని ఆరాటపడుతున్న హీరోయిన్ని స్లో మోషన్ లో చూస్తూ తన మనసులో మాటని చెప్పేద్దామని గేటు తీస్కుని వస్తున్నాడు హీరో !”
*******
“అమ్మా … నాకు పెయింటింగ్ సెట్ తీసీ. ”
“తీస్కో … ఇష్టమొచ్చినట్టు వేస్కో .. తర్వాత చూసుకుందాం. వెళ్ళు , ఇల్లంతా నీదే … ఏలుకో పో!”
*******
తనని గుచ్చుతున్న చూపులకి చురుక్కుమని, ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది హీరోయిన్ ….
********
“అమ్మా .. నా చేతులు ఛి ఛీ గబ్బుస్ అయిపోయాయి . క్లీన్ చెయ్యవా !”
“ఏమీ పర్లేదు … నువ్వాడుకో ! ఒకేసారి చివరాఖరులో బాత్రూమ్ లో వేసి చేపని తోమి నట్టు తోమి పడేస్తా .. నువ్వు విజృంభించు , నే చూసుకుంటా .”
**********
ఏదో చెప్పాలి, ఎలా చెప్పాలి.. అని తడబడుతున్న హీరో . ఎలా చెప్పినా పర్లేదు, ఆ మూడు ముక్కలు చెప్పేస్తే చాలు అని ఎదురుచూస్తున్న హీరోయిను .
***********
“అమ్మా … ప్లే డో ఇంకా స్లైమ్ కూడా తీసుకోనా ?”
“నీ ఇష్టం … ఎవడు అడ్డు వచ్చినా నేను చూస్కుంటా ! నన్ను కాసేపు వదిలేయ్ చాలు.”
************
ఇద్దరు దగ్గరికి వచ్చేసారు . చూపులు కలుసుకున్నాయి . ఒకరి చేతులు ఇంకొకరి చేతిలో ఇమిడిపోయాయి !
**********
“అమ్మా … అయిపోయింది . టీవీకి, ఐపాడ్ కి కూడా మేకప్ వేసేసా ! అందరినీ ఒకేసారి తోమేస్తావా బాత్రూమ్ లో ?”
“ఓరినాయనోయ్ … కొంపలంటించేసింది . వస్తున్నా .. కదలకుండా ఎక్కడి దానివి అక్కడే ఉండు .”
***********
“ఇదుగో రైటరూ .. ఈ అమ్మాయికి ఏమని చెప్పాలో చెప్పు . ఓ … మెలికలు తిరిగిపోతోంది” …. హీరో గారి గోల.
ఈ వర్షాకాలం సాయంత్రాలు , ఈ అనుభూతులు , నువ్వు, నేను ఇవంతా ఒట్టి మాయ అని చెప్పు . చివరికి మిగిలేది బూడిద అని చెప్పి పారిపో .. బతికిపో !
********************************************************
Confessions of a homemaker 😐🙄😒
“ఏంటి ఆదివారం ఇంత తొందరగా లేచావు ?”
“ ‘ఆలస్యంగా లేస్తే ఆదివారం తొందరగా అయిపోతుంది కదా’ అందుకని .. ముందే లేసి కొంచం కొంచం కొసరి కొసరి ఎక్కువ సేపు ఆదివారాన్ని ఆస్వాదించాలనీ !”
“నిజం చెప్పు !”
“మరేమో ! వీళ్ళిద్దరూ సెలవని ఆలస్యంగా లేస్తారు కదా .. ఈ ప్రశాంతతని, నిశ్శబ్దాన్ని నాకోసమే ఉంచేసుకోవాలని . మళ్ళీ రేపటినుండీ పరుగే కదా ఎలాగూ.
****************************************************************
Times when we get to know our hidden talents 😄😃
“టీ .వీ చూడాలి అని చెప్పొచ్చుకదా ! నేను స్విచ్ ఆన్ చేసి రిమోట్ తెచ్చి ఇస్తా ఉండు.”
“ఏంటీ .. మంచి నీళ్లా .. ఉండు మరీ .. నేను , నేను తెచ్చి ఇస్తాగా .”
“ఏంటి అటు ఇటూ చూస్తున్నావు , ఓ ఫ్యానా , ఆగవోయ్ .. నేన్ నేన్ నేన్ .. నేను ఉన్నానుగా. ”
“పడుకుంటావా కాసేపు … ఒక్క నిమిషం . ఇప్పుడే వస్తా .
బెడ్ సెట్ చేసా .. బ్లయిండ్స్ వేసేసా … రిమోటు, చార్జర్ , నీళ్ల సీసా అన్నీ చేతికి వీలుగా పెట్టేసా … అన్నిటికన్నా ముఖ్యం పిల్ల పిచ్చుకని పక్క రూంలో పెట్టేసా , నాన్న దగ్గరికి వెళ్లకుండా నాలుగు రామ్ గోపాల్ వర్మ కథలు చెప్పేసా .
హమ్మయ్య .”
“వెళ్ళు , పడుకో హాయిగా . పాపం. ఆదివారం మధ్యాహ్నం కదూ . ఆ ఛాయలకి ఎవ్వరూ రాకుండా నే చూస్కుంటా .. వెళ్ళు ..”
******
“ఏంటీ … ఏమయినా నోము చేస్తున్నావా ? నువ్వే?”
“ష్ .. ఉష్షూ ! మెల్లిగా . మరేమో చాలా రోజులు వెతికి, చూసి చూసి ఒక ప్రొఫెషనల్ కెమెరా లెన్సు కొన్నాడు .. మనకి గుండెలో కలుక్కుమనేంత ధరలో .”
“అయితే !”
“జాగ్రత్తగా పెట్టమన్నాడు . ఎక్కడో పెట్టేసానబ్బా జాగ్రత్తగా… గుర్తురావడం లేదు . అందుకని వీకెండ్స్ లో ఈ బట్టరింగ్ ! ఇహ వెళ్లి వెతకాలి. ”
*****************************************************************
Karma is a boomerang 🤘😐
కర్మ ఫల సిద్ధాంతం అనగానేమి ?
చిన్నప్పుడు టీచర్ ఆటలో వేప పుల్ల బెత్తంతో, గోడ కుర్చీలతో విజృంభించి వీధిలో పిల్లలకి సింహస్వప్నంలా ఉండే నువ్వు ..
ఇప్పుడు నీ బుడ్డి ఆడే అదే ఆటలో ఫోనిక్స్ లో C కీ K కీ తేడా చెప్పలేక శిష్యురాలిగా ఘోరంగా ఓడిపోయి “ఒక మూలకి నెట్టివేయబడడం” అనేది ఏదైతే ఉందో … అదే కర్మ ఫలం .
***********************************************************************
So much has happened in between 😎🤗
విజయవాడకి నాన్నారు అప్పుడప్పుడు … అంటే సంవత్సరానికి ఒక రెండు సార్లు వచ్చి ‘ఔటింగ్’ కనిచెప్పి దుర్గమ్మ గుడిలో అటెండెన్స్ వేయించి … ఒక సినిమానో, భవానీ ఐలాండో చూపించి చివరాఖరులో హోటల్ మనోరమలో నాకిష్టమైన భోజనం పెట్టించే రోజులు అవి.
ప్రోటోకాల్ ప్రకారం జరిగిపోతున్న ఔటింగ్ లో మనోరమ హోటల్లో భోంచేసి లేచి వస్తున్న నన్ను మేనేజర్ అంకుల్ వచ్చి మాట్లాడించారు …
“ఏమ్మా … ఇంటరా తల్లి? ఏ కాలేజీ ! ఏ క్యాంపస్” అని .
“అరె .. భలే కనుక్కున్నారే ! ఎలాగబ్బా .. పదహారేళ్ళ వల్లనా? లేక రిజల్ట్స్ తర్వాత పేపర్లో పడే ఆణిముత్యాల పోలికలు ఏమైనా ఉన్నాయా” అని తికమక పడిపోతుంటే అన్నాడతను ..
“అబ్బే .. మరేమీ లేదు, వాష్ బేసిన్ కి ‘ప్లేటు…గ్లాసూ ’ కూడా తీసుకెళ్తుంటేనూ .. డౌటేసి అడిగా అమ్మడు ” అని!
అహో … సిరిమల్లె తోటల్లో పరిగెడుతూ తిరిగే పదహారేళ్ళ శ్రీదేవి, పాంచాలి వలె నన్ను చూసి నవ్విన ఫీలింగు …నన్నెరిగిన వారు ఎవరూ చూడలేదు కదా అనుకుని, ధిక్ ధిక్ మని వెనక్కి వచ్చి నా ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్క్రీం తినేపనిలో పడ్డా .
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే … 10 th క్లాస్ పాస్ అయ్యి చిన్ని ఊర్ల నుండి , చిట్టి టౌన్లనుండి భవిష్యత్ ‘విజయ’యాత్రలకు వీరతిలకాలు దిద్దుకుంటున్న నాతోటి సోదర సోదరీమణులందరికి … లాల్ సలాం మై డియర్ కామ్రేడ్స్ ! All the very best 🤘
#అదంతాఒకఇదిలే!
*****************************************************************
That pain when someone cannot relate to your emotions 😕😖
“నాకు ఇంటరెస్ట్ పోయింది …ఊఫ్ … its gone I say !”
“మళ్ళీనా ! ఏమైంది ?”
“నా పాటికి నేను ఓ మూల కూర్చుని, ఈ ప్రపంచాన్నీ, భవసాగరాన్నీ etc etcలని మర్చిపోదామని ఈనాడు ఆదివారం పద వినోదం పట్టుక్కూర్చున్నానా!”
“ఊ ..ఉంటే !”
“అన్ని గడులు నింపేసా … ఇంకొక్కటి … ఒకే ఒక్కటి మిగిలింది . ‘ఉసిరికాయకి ఇంకో పేరు ఏంటి?’ అని. నేను నానా యోగాసనాలు అన్నీ వేసి ఒక ధ్యాన ముద్రలోకి వెళ్లి, సర్వేంద్రియాలనీ కూడగట్టుకుని ‘జ్వాలాద్వీప రహస్యం’ ఛేదించే వీరునిలా ఆలోచిస్తుంటే …. !”
“ఆఁ ..తుంటే !”
“నాకేదో సాయం చేసేద్దామని చెప్పి … చక చకా గూగుల్ ని అడిగి …నేను స్లో మోషన్ లో “నహీ” అని అరిచి దగ్గరికి వచ్చేలోపు…. “ఓ సో ఈజీ ‘ఆమలకము’ అంట” అని చెప్పేసాడు … పైగా ఇంత సాయం చేసినా కూడా నేను సంతోషపడలేదే అని ఒక వెర్రి చూపు కూడా !
‘రామ్మోహన్ రావ్ … నేన్ గెలిచాను’ అని అరుద్దామనే ఆశని తుంచేశారు.
అందుకే ఈ సమాజం మీద ప్రస్తుతానికి #ఇంటరెస్ట్పోయింది.”
**********************************************************
When u are HUNGRY and the restaurant is busy and on top it’s Friday 🤪
ఒరేయ్ నీకు దణ్ణం పెడ్తా. బుద్ధి తక్కువై వీకెండ్ ఒచ్చా . ఆకలేస్తోంది రా.. ఎంత సేపు ఇలా కూర్చోపెట్టి ఊరిస్తావు … ఈ ఆకలికి ఆ వాసనలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి . పొమ్మనవు అలాగని తిండీ తేవు .
ఉండాలా లేదో తేల్చి చెప్పు. చక్కా ఇంటికి పోయి పెరుగన్నం లో ప్రియా పచ్చడేసుకుని తినేసి బజ్జుకుంటా. ఫ్రైడే ఈవెనింగ్ పా…యే!#నాకుఇంట్రెస్ట్పోయింది
To all the #daddysprincess and other proud #daddyslittlegirl who went virally emotional on this special day!
“హలో నాన్నా ! బాగున్నారా ? హెల్త్ ఎలా ఉంది ? అమ్మ కి ఇవ్వవా ఫోన్ !”
******
“నాతోనేమో ఐసీయూలో పేషెంట్ తో విసిటింగ్ డాక్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. నీతోనేమో గంటలు గంటలు కబుర్లు చెబుతుందే మరి! మీరు మీరూ ఒకటి . హు .”
“అవునూ … అది హాస్టల్ లో ఉన్నప్పుడు సెమ్ రిజల్ట్స్ వస్తే ముందుగా ఎవరికి చెప్పేది ?”
“నాకే !”
“ఫస్ట్ జాబ్ వచినప్పుడు ఎవరికి ముందుగా చెప్పింది ?”
“నాకే !”
“ఈ అబ్బాయినే చేసుకుంటానని ముందుగా ఎవరితో చెప్పింది ?”
“నాతోనే!”
“అదే మరి … ముఖ్యమైన వాటికి మీరు . చీరలకి -మ్యాచింగులకి , నగలకి – నోములకీ , అలకలకి – ఆరళ్ళకి , పోపులకి – రుబ్బులకీ నేను .”
“ఇప్పుడేమంటారు!”
ఇంకేమంటారు …. అదుగో అలా మీసాలు దాచిపెట్టలేని ముసిముసి నవ్వులు నవ్వేస్తాలు .. నాన్నాలు !😍😍😍
**************************************************************************
Your kids Necessity is the mother of your creativity!!! 🙏
“పిట్టకి బువ్వ !”
అదుగో గింజలు వేసా మేడం !
“మరి లీళ్లు!”
అదుగో కప్పులో పోసాను మేడం !
“మరి రాత్రి బజ్జోడానికి ఇళ్ళు !”
అదుగో పూల పూల బుజ్జి గూడు .
“హ్మ్మ్ … ఒకే !”
మరైతే ఇక చెప్పిన మాట వింటారా? పెట్టిన బువ్వ తింటారా మేడం !
“మరి పిట్టలేవి? Where?? పిట్టలు వచ్చి బువ్వ తిని, లీళ్లు తాగితే అప్పులు !!”
బుల్లి …. మే …డం !!!!!
*******
నాగార్జున గారూ … చూసారా అండీ ఈ టార్చరు … నా వల్ల కాదండీ .. పోయింది.. #నాకుఇంటరెస్ట్పోయింది !!!
Leave a Reply