When someone disturbs my “ME TIME”😖😣
scene 1:
“ఎవ్వడి కోసం ఎవడున్నాడు … పొండిరా పొండి …మీ కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి !”
బేసిక్ సెన్స్ ఉండాలి కదండీ … మనసు, శరీరం ఏకం చేసి ఒక యోగ ముద్ర లోకి వెళ్లిపోయి నాపాటికి నేను ”టీ ” తాగుతుంటే … “మర్చిపోయిన మెయిల్సు , కనపడని ఐడి కార్డులు ” అంటూ ఒక వైపు … “తిరుపతి కొండపై కొన్న బుడుగుల బుట్టలో పోయిన బుల్లి బిందె , దోసల దబ్బ ఎక్కలా? పెప్పా పిగ్గు కార్ ఎక్కడా?” అని ఒకవైపు ఊదరగొడుతుంటే ఎల్లా అండీ!! .. నాకు ఇంటరెస్ట్ పోయింది .. పోతే పోయింది తొక్కలో సంసారం ..ఎవడికి కావాలి … ప్రతి నిముషానికి ఏపుకుతినేస్తుంటే .. నాకు వద్దండీ ..వద్దే వద్దు సార్ !!
scene 2: ప్రశాంతంగా టీ రంగు , రుచి మరియు చిక్కదనంతో సహా ఆస్వాదించిన తదుపరి :
“ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి ..ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి . ”
అరెరే పాపం ఎంత కష్టపడతాడో … పనిలో పడితే అస్సలు ప్రపంచం పట్టదు కదా ! ఈరోజు ఉల్లిపాయ్ పకోడీస్ చేద్దాం. బుడ్డిదేంటి ఇంత ముద్దొస్తోంది .. గోడనిండా వేసిన మోడరన్ ఆర్ట్ ముందు రంగుల్లో కలిసిపోయి నిల్చుని, ఆహా ఎంత ముద్దుగా ఉంది…చిట్టి పికాసో మాదిరిగా లేదూ !
కాబట్టీ … మా కంటూ కాస్త సమయం వదిలిస్తే సరి .
************************************************
Duties and Responsibilities of being a “pinni” 😍🤗
ప్రశ్న : చిన్నమ్మ పదవి యొక్క విధులు మరియు భాధ్యతలు ఏమిటి?
జ : 1. పెద్దలకీ పిల్లకాయలకీ మధ్య అంబికా దర్బారు వారి అగరుబత్తి వలె అనుసంధానమై ఉండుట.
2. ఇంట్లో పనులన్నీ గాలికొదిలేసి పిల్లలతో కలిసి బుడుగులతో ఆడుట, వారి బొమ్మలకు జడలు వేయుట, వారిని ఓహోహో, ఆహాహా అని ఓఓ …. పొగుడుట.
3. అవతలి వారిపై కన్నా నువ్వంటేనే నాకు రెండాకులు ఎక్కువ ఇష్టం అని ప్రతి ఒక్కరినీ రహస్యంగా నమ్మించుట.
4. పని తప్పించుకుని తిరుగుతున్నానని ఉరిమి చూసే అక్కలని, వదినలని తప్పించుకుపోవుట.
5. పొద్దుటినుండి బుర్ర తినేస్తున్నా, పిన్ని పక్కనే పడుకుంటాము అని వాళ్ళ అమ్మ దగ్గర నుండి పారిపోయి వచ్చి దుప్పట్లో సర్దుకునే వారిపై కోపం, ప్రేమా రెండూ కలగలిసి రాగా ఏడవలేక నవ్వుట.
6. ఈ వార్త విని పరుగు పరుగున వచ్చిన “తనని” చూడలేక ముసుగు తన్నుట.
************************************************
Still searching for your best holi pic?!… I give up 😐🙄
“ఏమైనా కాస్త మంచివి దొరికాయా ?”
“లేదే … అందరి మొబైల్స్ లో చూసాను ! అన్నీ ఇలాగే ఉన్నాయ్ .”
“ఛీ … సరేలే .. ఇప్పటికైనా పోస్ట్ చేద్దాం . ఇంకా లేట్ అయితే కాండిడ్ ఉగాది పచ్చడి ఫోటోలు వచ్చేస్తాయి.”
“నా దగ్గర ఉన్నదాంట్లో ఇది కాస్త మేలు , ఇంతకీ నువ్వెక్కడ, నేనెక్కడా … అసలు ఇందులో మనోళ్లు ఎవరెవరో కాస్త వెతుకుదాం.”
“అవును మనం ఐదుగురం కదా … ఈ మిగతా రెండు తలకాయలు ఎవరివే … దర్జాగా భుజాల మీద చేతులేసి మరి మనతో దిగారు … అన్నిట్లో వీడెవడో అయితే చెయ్యి లేదా కాలు పెట్టాడు … చి వెధవ ఫోటోలు … పెట్టకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు .. వచ్చే హోలీకి అప్పుచేసైనా, చందాలు వేసుకునైనా ఒక ఫోటోగ్రాఫర్ని మాటాడుకుందాం.”
ఇంస్టా తెరిస్తే చాలు … ఎలా తీస్కుంటారబ్బా ఇలా మంచి మంచి ఫుటోలు !
మనమూ ఉన్నాము .. “గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ ” బ్యాచ్ “దండుపాళ్యం” బ్యాచ్ get together పార్టీ చేసుకున్నట్టు.
#నాకుఇంట్రెస్టుపోయింది
************************************************
Happiness comes from the simplest things.. don’t miss to acknowledge them 🤗🤗❤️😍
“ఇల్లలకగానే పండుగ కాదూ … ఇడ్లికి నానపెట్టగానే సంబరంకాదు !”
“మరి అసలైన ఆనందము ఎప్పుడు వచ్చును !”
“ఎప్పుడంటే…. చలి దేశాల్లో ఓవెన్లలోనే, వంటింటి అల్మారాల్లోనో ఇంకా ఎవరెవరి తెలివితేటల్ని బట్టి కనుగొన్న రహస్య స్థావరాల్లోనే కష్టపడి పులియబెట్టిన పిండిని ఇడ్లి పాతర్లో వేసి ఆవిరికి పెట్టీ ….”
“ఆ పెట్టీ ….”
“ఆ పైన మూత తెరవగానే ఏ రాళ్లూ, రప్పలు చూడాలో అని గుండె చిక్కబట్టుకుని టెన్షన్ తో చూస్తూ….. ఆ ఆవిరి పొగలు అలా అలా మొహాన్ని తాకుతూ ఉండగా…. ఆ మబ్బులు వీడి, దూది రేకుల్లాంటి, మల్లె మొగ్గల్లాంటి, చంటి దాని బుగ్గల్లాంటి ఇడ్లిలు కనిపిస్తాయి చూడు అదీ ఆనందమంటే !! పరమానందం అంటే !”
సాంబ్రాణి ధూపం తొలగిపోవు సమయాన దేవుని దివ్యమంగళ రూపం చూసినంత ఆనందం ! అన్నం పరబ్రహ్మ స్వరూపం కదూ ! ప్రపంచం లో ఎన్ని సంఘటనలు , సంచలనాలు జరుగుతున్నా ఎప్పటికీ , దేనికీ ఆగని నిత్యాగ్నిహోత్రం … “సాపాడు జిందాబాద్.”
************************************************
That pain when you can’t talk to mom for a couple of days 😢
“జీవితం అంతా అంధకారమై పోయింది … ఇక ఇంతే … ఎటు చూసినా నిరాశే ….కారు చీకట్లు కమ్ముకున్నాయి…నీలి నీడలు మీదికి వచ్చేస్తున్నాయ్ ! పారిపోవాలి… పరిగెత్తాలి.. గమ్యం తెలీని చీకటి దారిలో ఒంటరి పరుగు … ఊపిరి ఆడటం లేదు ! నన్ను కాపాడేవారే లేరు !”
ఏమొచ్చింది .. ఏంటి ఈ పైత్యపు మాటలు ?
“ఎవరిదో పెళ్ళికి అమ్మ ఊరెళ్ళింది … సిగ్నల్స్ లేవు … రెండు రోజులైంది ఫోన్లో మాట్లాడి !”
******
ట్రింగ్ ట్రింగ్ …
“హలో మా ఎంజేస్తాన్డావు మా … మీ ఊరు వెళ్తే మాత్రం నన్ను మర్చిపోతావా ? ఒక్కదాన్ని ఇంత దూరంలో ఉన్నానని మర్చిపోయినా ? సర్లే పచ్చి పులుసు ఎలా పెట్టాలో మళ్ళీ చెప్పు !”
“ఎన్ని సార్లు చెప్పించుకుంటావే, అవును పెరుగు తోడుకుంటోందా, పాలు ఇంకా పొంగిస్తూనే ఉన్నావా , రోజూ ఇంత ఉడకేసుకుంటున్నారా,చిన్నదానికి చక్కగా చేసి పెడుతున్నావా లేదా !!
పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి మీరు ఉండే చోటేట. భోజనానికి పిలవమని చెప్పా.. పిలిచావా? … బద్ధకం వదిలించుకో ముందు… ఎలా వేగుతున్నారో ఏమో నిన్ను !”
ఆహా…అమ్మ మాట వింటే చాలు. .. ఫిల్టర్ కాఫీ తాగుతూ m.s. సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం వింటున్నంత ఆనందం .
******
అవును … నిరాశా .. నీర్ దోసా అని ఇందాకేదో చెప్తున్నావ్!
“అది అమ్మ కాల్ చెయ్యకముందు ..
ఆడెవడు ఈడెవడు నాకిప్పుడు అడ్డెవడు !
మేరే పాస్ మా హై రే !”
#అమ్మాచూడాలీ
************************************************
This is for you NANNA🙌🙌😎Miss you Bellampalli… My Home town 💕
చిన్న టౌన్లలో అందరూ అందరికీ పరిచయమే… అందులో నాన్న టీచర్ అయితే ఆ హోదా వేరే లెవెల్ 😎
“అంకుల్ ఇక్కడే మా ట్యూషన్ ఆపండి … ఇదుగో రూపాయ్ “
“వై .ఆర్. రెడ్డి సార్ బిడ్డ కదా నువ్వు , నా కొడుకు మీ నాన్న కాడే సదువుతాడు. ”
“అన్నా, సెల్లో పిన్ పాయింట్ రీఫిల్, రెండు నటరాజ్ పెన్సిల్స్ ఒక లాంగ్ నోట్ బుక్.”
“మా లెక్కల సార్ బిడ్డ కదా నువ్వు .. ఈ లెక్కలు మీ నాన్న నేర్పినవే .. మనదే రా ఈ షాప్ .. ఎమన్నా కావాల్నంటె చెప్పు స్పెషల్ గ తెప్పిస్తా. ”
ఇప్పటికి కూడా “మా Y.R. రెడ్డి సార్ బిడ్డ” అన్న పిలుపంటే నాకు ఎంతో ఇష్టం . అది ఒక బ్రాండ్ 😎. అలా ఎవరైనా పిలిస్తే వెంటనే నిటారుగా అయిపోతా .. లేని కాలర్ ఎగరెయ్యాలనిపిస్తుంది !
ఇన్నేళ్ల ఈ లెగసీ కి బ్రేక్ వేస్తూ రిటైర్ అవుతున్న నాన్న కి 🙏🙌 పదవీ విరమణ శుభాకాంక్షలు .
అలాగే ఇన్నేళ్లు మా ఇంట్లో దీపం అయిన Singareni Colleries మరియు Church of South India కి ప్రేమతో 🙏🙏.
మీ ముంగిట్లో పెరిగి ఇంతదాన్నైన
శ్రీ నిధి .
నాన్న నెక్స్ట్ ప్లాన్స్ ఏంటీ అంటే ..
“రేయ్ అమ్మలూ …ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ ‘రైతు బిడ్డకి’ రిటైర్మెంట్ ఉండదు కదా!” అన్నారు మా సొంత ఊరికి ఇన్నేళ్ల జ్ఞాపకాలని వెంటబెట్టుకుంటూ.
************************************************
Happy Sriramanavami
“ఈ ఏడాదైన క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయ్యాలి. మధ్యలో అనవసరంగా కెంపులూ, నీలాలూ ఏ కష్టం లేకుండా పద్యాల్లో, పాటల్లో మనతో పాటూ పేరు తెచ్చేసుకుంటున్నాయి. అదుగో పంతులు గారు పిలుస్తున్నారు, ‘తలంబ్రాలు’అని, చెప్పేది గుర్తు పెట్టుకోండి మర్చిపోవద్దు. “
“సరే సరే… అలాగే! “
“అబ్బ ఎంతందం, నీలాకాశం రాశి పోసినట్టు…అలా చూస్తూనే వుండిపోవాలి అనిపిస్తోంది. “
“ఇటు చూడు, ఎంత సుకుమారం. తామరపువ్వు లాంటి పెళ్ళికూతురు. మనల్ని పట్టుకుంటేనే కందిపోయేటంత సుకుమారం. మళ్ళి సంవత్సరం వరకూ ఈ అదృష్టం రాదుకదూ..”
అయిపోయింది , అదిగో జానకి చేతిలో కెంపుల రాశి, రాముని చేతిలో నీలపు రాశి అని చెపుతున్నారు. ఈ ఏడాది కూడా మర్చిపోయామన్నమాట…”శ్రీ రామ చంద్రా” అని తెల్ల మొహం వేసాయి ఆణిముత్యాల తలంబ్రాలు.
Leave a Reply