కథ – వెన్నెల బాసలు
(Published in” Koumudi” online magazine – August 2018)
గంధం రంగుతో కొత్తగా పూసిన ఇల్లు, ద్వారబంధాలకి కట్టిన తోరణాలు, బంతిపూల మాలలు, ఇంటినిండా అల్లుకున్న మెలికల ముగ్గులు, మరుసటి రోజు కోసం చిన్న చిన్న బుట్టల్లో తెప్పించిన మరువం , సన్నజాజి, కనకాంబరం మొగ్గలు , వంట వారు ఒక్కొక్కటిగా మోసుకొస్తున్న గంగాళాలు మరియు వంట సామాన్లు… అన్నీ కలిసి ఆ ఇంటికి ఒక కొత్త సొబగుని అద్దుతున్నాయి. ఇంటి వెనుక మూలగా వున్న మల్లెపందిరి ముందు పరిచిన చాప పైన, ముక్కాలి పీటపై కూర్చుని, తన పరికిణీ అంచులని కాస్త పైకి లాక్కుని , అలవోకగా, మొహం పై ఎగురుతున్న పట్టు కురులని జాగ్రత్తగా ఒక వేలితో వెనక్కి తోస్తూ, అలవాటు లేని ఓణీ పిల్ల గాలికి తెరచాప లాగా పైకి లేస్తుంటే, ముంజేతి దాకా పెట్టుకున్న “మెహందీ” తో సరిచేసుకోవడం కుదరక, నాయనమ్మని రమ్మని పిలిచింది మన్విత . మనవరాలికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని కనిపెట్టుకుని ఉన్న సావిత్రమ్మ, పరుగున వచ్చి, మన్విత పైటని చుట్టూ తిప్పి నడుములో దోపింది. ఆఖరి మనవరాలి పెళ్లి ముచ్చట్లు అన్నీ తన ఇంట్లోనే, తన చేతుల మీదే జరగాలని సావిత్రమ్మ కోరిక. ఆమెరికా పెళ్లికొడుక్కి పల్లెలో ఏర్పాట్లు సౌకర్యంగా ఉండవని, మన్విత నాన్నగారి అభిప్రాయం. వీరిద్దరంటే మన్వితకి అమితమైన ఇష్టం , ప్రేమా .. కనుక ఎవరినీ నొప్పించకుండా పెళ్లికూతురుని చేసే పని సావిత్రమ్మ చేతుల మీదుగా తమ సొంత వారి మధ్యన తమ పల్లెలోని స్వగృహంలో జరిపించి, అక్కడి నుండి బయలుదేరి పక్కనే మదనపల్లెలో, ఫంక్షన్ హాలులో పెళ్లి చేసేటట్లు సర్ది చెప్పింది మన్విత.
“మరీ ఆర్భాటాల పెళ్లిళ్లు అయిపోతున్నాయి ఈ రోజుల్లో. అయినవారినందరిని పిలిచి చక్కగా మన ఊర్లో చేస్తే ఏం పోతుంది అంట. అమెరికా పెళ్లికొడుకైతే మాత్రం వాడేమన్నా అమెరికా దొరసానికి పుట్టాడా ? మన పక్క ఊరులోనే గా వాళ్ళ అమ్మని ఇచ్చింది! ఎటువైపు చూసినా అంతా బీరకాయ పీచు చుట్టరికాలే కదా !!అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అన్నట్టు, ఉద్యోగాలు మిడకడానికి పట్నం వెళ్లి, పిల్లల్ని దేశాలకి పంపేసి ఏమి సొగసులు పోతున్నార్రా మీరు?”, అంటూ అటు కొడుకునీ, ఇటు వియ్యపు వాళ్ళనీ కలిపి నిష్టూరం వేస్తోంది సావిత్రమ్మ.
“ఏదో మా చిన్నాన్న కోడలు సుజాత మధ్యవర్తిత్వం చేసి, పూచీ ఉండబట్టి, ధైర్యం చేసాము. నట్టింట్లో కంప్యూటర్ పెట్టి, అందులోకి పెళ్ళికొడుకుని పిలిచి, అటు ఇటూ పెద్దలు కూర్చుని పెళ్లిచూపులు కానిచ్చేసారు. ఇంకా నయం పెళ్లికన్నా తరలివస్తున్నాడు పెళ్ళికొడుకు, సంతోషం,” అని ఆపకుండా చెప్పుకు పోతూనే ఉంది. స్కైప్ లో జరిగిన మన్విత పెళ్లిచూపులు ఆవిడకి వింతగానూ, చికాకుగానూ అనిపించాయి.
“నానీ … మీరోజుల్లోలా అన్నీ కుదరవు కదా ఇప్పుడూ! అవన్నీ వదిలేసేయ్, చూడు నా డిజైన్ . బాగుందా? ఇందులో మా ఇద్దరి పేర్లు ఉన్నాయ్ తెలుసా ? కనిపెట్టాలి నువ్వు, ఇటు రా నానీ,” అంటూ మన్విత టాపిక్ ని మార్చేసింది. టౌన్ నుండి వచ్చిన మెహందీలు వేసే అమ్మాయి, పక్కనే ఒకేలాంటి లంగా వోణీల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలకు చక చకా పెట్టడం మొదలెట్టేసింది. వాళ్లు మన్వితతో పాటూ చదువుకుని, ప్రస్తుతం బెంగళూరులో ఇల్లు తీసుకుని, కలిసి ఉంటూ జాబ్స్ చేస్తున్న మన్విత ఫ్రెండ్స్. పల్లెటూరిలో పెళ్లి, అందుట్లోనా తమ క్లోజ్ ఫ్రెండ్స్ లో మొదటి పెళ్లి అనే ఉత్సాహం వాళ్ళ నవ్వుల్లోనే కనిపిస్తోంది. బామ్మ మాటలు వింటూ ఆనాటి పెళ్లి కబుర్లు చెప్పించుకుంటూ , ఆడపిల్లలంతా నవ్వుతూ పెట్టించుకుంటున్నారు మెహందీ . నాయనమ్మ మెడ చుట్టూ చేతులు వేసి, దగ్గరగా లాక్కుంటూ ఒక ఫోటో తీయించుకుంది మన్విత. తర్వాత ఒకే లాంటి బట్టల్లో ఉన్న స్నేహితురాండ్రంతా కలిసి “బ్రైడ్స్ మైడ్స్ ” ఫోటోస్ రకరకాల పోజులు పెట్టి తీయించుకున్నారు.
అంతలో వంట మాస్టారు దిగాడు తన పటాలంతో. అదే సమయానికి మన్విత అమ్మగారు కూడా ఊళ్ళో ఉన్న తోడికోడళ్లందరిని పిలుచుకొచ్చింది, లడ్డూలు పట్టడానికి సాయానికి. ఇంట్లో పెళ్ళికి బంధువులే లడ్డూలు పట్టడం అదొక సరదా. వంట మాస్టారు చేసిచ్చిన బూందీని అందరూ అలా మధ్యలో ఉడ్డగా వేస్కుని, చేతులకి నెయ్యి రాసుకుంటూ, లడ్డూలు చెయ్యడం ప్రారంభించారు. ఇక సావిత్రమ్మకి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. వాళ్ళపై అజమాయిషీ చేస్తూ తాను కూడా కూర్చుంది.
ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న మన్విత , తన స్నేహితులైన అను, ద్విజా లతో కలిసి బయటికి బయలుదేరింది. నాయనమ్మ హడావిడిగా ఉంది కదా అని, మెల్లిగా పిల్లుల్లా బయటికి కదిలారు. ఎంత మెల్లిగా గేటు తీసినా , సావిత్రమ్మ పట్టేసింది దొంగలని.
” ఎక్కడికే మనూ, బయల్దేరావూ? రేవు పెళ్లికూతురిని చేస్తున్నాము, కాస్త ఇంటిపట్టునే ఉండరాదు!” అని కేకేసింది కూర్చున్న చోటునుండే.
“నానీ, మరేమో చెరుకు తోట చూస్తామన్నారు మా వాళ్ళు. అలా వెళ్లి వస్తాం నానీ . మళ్ళీ రేపు పెళ్లికూతురిని చేసాక ఎక్కడికి పంపవు గా, ఒక్కసారి తోట చూసి వస్తాను”, అని గోముగా అడిగింది.
ఏడుమల్లెల ఎత్తు తెలుగుతనం, అంత గారంగా అడిగితే కాదనే దమ్ము ఎవరికి ఉంది కనుక.
“సరే వెళ్లి రండి, డొంక దారిలో వెళ్ళు, ఊర్లో అందరి కళ్ళలో పడకుండా. దిష్టి తగులుతుండి,” అని కేకేసింది సావిత్రమ్మ చెరో చేతితో లడ్డుంటలు చుడుతూ ..
“హమ్మయ్య,” అని అనుకుని, ముగ్గురూ బయలుదేరారు. డొంక వెంబడి బయలుదేరి, మామిడితోపు దాటుకుని, గ్రామ దేవత గుడి వెనగ్గా ఉన్న చెరుకు తోటకి వెళ్లారు ముగ్గురు. ఏపుగా పెరిగిన తోట, వారి లాగే పరువంతో మిస మిస లాడుతూ, వాళ్ళ నవ్వులకి పోటీగా అన్నట్లు గాలికి ఊగుతూ చిరు సవ్వడి చేస్తోంది. పచ్చని పరికిణి పై ముదురు నీలం డిజైనర్ ఓణీతో, మెడలో నాయనమ్మ వేసిన స్వాతిహారంతో, నవ్వుతున్నప్పుడు ఊగే బుట్ట కమ్మలతో , గట్టుపైన పడకుండా జాగ్రత్తగా నడుస్తుంటే వసంత కన్యలా ఉంది మన్విత.
కాస్త దూరం నడిచాక పొలం మధ్యలో చాపలా ఉన్న విశాలమైన రాయిపైన కూర్చున్నారు ముగ్గురు మిత్రులు. ఆ రాయిని ఆనుకుని ఉన్న చింత చెట్టు, మన కావ్య నాయకి ఎండకి కందకుండా ఉండేటట్టు గొడుగుపట్టింది. కన్నె పిల్లల నవ్వులకి, పులకించినట్టుగా చింతచెట్టు కూడా చల్లని గాలిని వీస్తూ తన పూతని రాలుస్తోంది వాళ్లపై.
“ఇంతకీ మీ బావ నుండి, ఫోన్ వచ్చిందా మను? నీ ఉత్తరం తనకి చేరేసాడా?” కూడా తెచ్చుకున్న లడ్డుంటని కసుక్కున కొరుకుతూ మోచేతిపైన వెనక్కు వాలుతూ అడిగింది అను!
“ఏంటో దీని వెర్రి, ఎల్లుండి పెళ్లి పెట్టుకుని, ఇప్పుడీ పిచ్చి వేషాలేంటే బాబు. పైగా ఉత్తరాల గోలేంటే!” అంది ద్విజ.
“ఈపాటికి ఫోన్ చెయ్యాలె బావ. వచేటప్పుడే అడిగాను అక్కని, బావ బయల్దేరాడంట . అందుకే ఇక్కడికి తెచ్చా మిమ్మల్ని. ఇక్కడైతే సిగ్నల్ బాగా వస్తుందట. ఇంట్లో అస్సలు రాదు, మిద్దె పైకి ఎక్కి ఊరంతా వినపడేటట్లు అరిస్తే తప్పించి అవతలి వారికి ఏమీ వినపడదు. ”
ఇంతలో మన్విత తన బావకి చేస్తున్న కాల్ కనెక్ట్ అయ్యింది.
“హలో … ఆ… బావా……తను కలిసాడా? … నేనిచ్చిన లెటర్ ఇచ్చావా?…ఒప్పుకున్నాడా?… సరే సరే బావా!! ..ప్లీజ్ ఈ ఒక్కసారికి ..ఇంక ఏం అడగను నిన్ను ..థాంక్స్ ఎ లాట్ .” అంటూ ఫోన్ కట్ చేసింది.
అప్పటిదాకా మన్విత ఏకపాత్రాభినయం చూస్తున్న ఇద్దరూ, ఆసక్తిగా ముందుగు జరిగారు. ద్విజ భుజం పై ఆత్రంగా ఒరిగి పోయిన అను, “ఏంటంటే ..ఒప్పుకున్నాడా? .. వావ్ ..థ్రిల్లింగ్… లైఫ్ టైం ఎక్స్పీరియన్సు ,”…అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టింది.
“నీ మొహం, నాకైతే ఎందుకో భయంగా ఉందే. సిటీల్లో, టౌన్లలో ఓకే గానీ , పల్లెల్లో ఇంత సాహసం ఎందుకే బాబు. ఒక్కరికి తెల్సినా రచ్చ రచ్చై పోతుంది. అస్సలే మీ నానమ్మ మమ్మల్ని బంగారు తల్లులని సర్టిఫికెట్ ఇచ్చి, ‘మీరేమిటోళ్లు’ అని కూడా ఆరాతీసేసింది. తేడా వొస్తే …వామ్మో !” అంది దిజ్జు, గాల్లో చేతులు ఊపేస్తూ ….
“ఎల్లుండి ఈపాటికి పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వతంత్రం అవసరమా? చక్కగా అమెరికా సంబంధం. ఎందుకొచ్చిన గొడవా!! “అని ద్విజ అంటుండగానే తన నోరు మూసేసింది అను.
తన స్నేహితురాళ్ల మాటలు వింటూ, పైకి లేచిన మను, వాళ్ళని కూడా బయల్దేరదీసింది. ఎండ దిగిపోవడంతో కాస్త చల్లబడి, హాయిగా వీస్తోంది గాలి. కాస్త దూరం వెళ్ళాక , మోటార్ పంప్ దగ్గరికి వచ్చారు. మోటార్ పంపు లోంచి దూకే నీళ్ళని పట్టడానికి చిన్నసైజు స్విమ్మింగ్ పూల్ అంత గుంటని తవ్వి , అందులో కరెంటు ఉన్నప్పుడు నీరు నింపి, అవసరమైనప్పుడు నీరు పొలం లోకి వదిలేలా గట్టు కట్టారు.
నిలువ నీటిలో అక్కడక్కడా నాచు పట్టి, గట్టు చుట్టూతా ఉన్న కొబ్బరి చెట్లతో ఎంతో అందమైన పెయింటింగ్ లాగా ఉంది. నీళ్ళని చూడగానే ద్విజ, అను చిన్నపిల్లలైపోయారు. గట్టుపై కూర్చుని కాళ్ళని నీళ్ళల్లో పడేసి మెల్లిగా ఊపుతూ, చల్లటి నీళ్ళని, సాయంత్రం వెచ్చదనాన్ని ఒకేసారి అనుభూతి చెందుతున్నారు. మధ్యలో ఉన్న మన్విత చెరో భుజం పై వాలి, తమ చేతులను పెనవేసుకున్నారు స్నేహితులు ముగ్గురూ . సాయంత్రం నీరెండలో, కొబ్బరాకుల మధ్యనుండి నీళ్లపై పడ్డ బంగారు కిరణాలు, ముగ్గురి పైనా నాట్యం చేస్తున్నాయి.
పొడుగ్గా ఉన్న కొబ్బరి ఆకుతో నీటిపైన బొమ్మలు గీస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా చెపుతోంది మన్విత, ” బతకడానికీ , జీవించడానికి చాలా తేడా ఉందే. బతుకు పోరు లో ఎప్పుడైనా అలసిపోయినప్పుడు, జీవితం నిస్సారమైనపుడు, తలచుకోడానికి కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉండాలి. అవి, జీవితం పై ఆశని కలుగజేసి, మరింత కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఊహ తెలిసిన నాటినుండి ప్రేమ పై నాకు చాలా గౌరవం, మంచి అభిప్రాయం ఉన్నాయి. ఎంతో ఉన్నతంగా ఊహించుకునేదాన్ని. అమ్మానాన్న , నాకు కావలసినంత స్వేచ్చని ఇచ్చినా , బహుశా అందుకేనేమో నాకు ఎవరూ ఇంతవరకు నచ్చలేదు. కానీ, ఇది నా కోరిక వే, పెళ్ళైతే ఇవన్నీ కుదరవని కాదూ….. ఆ ప్రేమా, ఆ అధికారం వేరు. ఇది నా లాస్ట్ ఛాన్స్, ఇక పై అడుగు పెట్టబోయే జీవితాన్ని ఎదుర్కొని, నాకు తోడుగా నిలిచి నన్ను ఊరడించే ఒక్క అనుభూతి, నాకు చాలా అవసరం.” అంటూ చెప్పడం ఆపింది.
ఎంతో సున్నిత మనస్కురాలు, భావుకురాలు ఐన తమ స్నేహితురాలి మనస్సు తెలిసిన ఇద్దరూ , చెరో బుగ్గ పై ముద్దు పెట్టుకున్నారు.
” మనూ, ఆరేళ్ళ నా లవ్ స్టోరీ లో అలకలు, కోపాలు, కాంప్రమైస్లూ, గ్రీటింగ్ కార్డులూ, చోక్లేట్లు తప్ప ఏమి ఎరుగమే. నిన్ను చూస్తే తెలుస్తోంది ప్రేమ గురించి తెలియాలంటే, ప్రేమికులై ఉండాల్సిన పని లేదు. ప్రేమను ప్రేమించగలిగే మనస్సు ఉంటె చాలని. పైగా అబ్బాయిలతో పాటు పోటీగా చదువుల్లో, ఉద్యోగాల్లో పరిగెత్తే మనకి, సర్దుకుపోయే మనస్తత్వం తక్కువ. అందుకేనేమో ఎమోషనల్ బ్రేక్ డౌన్ కి ఎప్పుడు దగ్గరగా ఉంటాము మనం. ఎవరి పరుగులు వారివి అయిన నేటి లైఫ్ స్టైల్ ల్లో, జీవితాలను పెనవేసి ముడివేసే అనుభవాలు ముఖ్యమే కాదు అవసరం కూడా అనుకుంట,” అంది ద్విజ.
“ఏంటో మీ గోల. పదండి, పదండి.లేట్ అయ్యింది, ఈపాటికి అప్పుడే పిండిన, ఫ్రెష్ పాలతో కాఫీ ఇస్తుంది ఆంటీ” అంటూ బయలుదేరింది అను.
“ఏయ్, కాస్త ఉండవే బాబూ, పెద్ద దారి తెలిసిన దాని మాదిరి పోతున్నావు. ఇది మా ఊరు, గుర్తుంచుకో! అటు వైపు కాదు, ఇటు వైపు. డొంక వెంబడి. అటు వెళ్తే ఊర్లో నుండి వెళ్ళాలి. ప్రతి ఇంట్లోనూ చుట్టమే, రేపు పొద్దున్న గానీ ఇల్లు చేరం..”మందలించింది మన్విత.
“వామ్మోవ్! మీ వాళ్ళ క్వశ్చన్ బ్యాంకు కి, ఆన్సర్స్ ఇవ్వడం …..ఇంపాజిబుల్ ..”అంటూ పరుగున వెనక్కి వచ్చి మన్విత చెయ్యి అందుకుంది అను.
ముగ్గురూ ఇంటికి వచ్చేసారు. మొహాలు కడుక్కుని కాఫీలు, టిఫిన్లు కానిచ్చారు. మన్వితని వాళ్ళ అక్క, మిద్దెపైకి వెళ్లి ఎదురుచూడమంది. కాసేపటికి అక్క, బావా మిద్దెపైకి వచ్చారు. “అబ్బా, ఏంటే ఇంతసేపా?” అని విసుక్కుంది మన్విత, అక్కని.
“నీ మొకం. నీ ఆత్రం అందరికి ఉండొద్దూ. వీళ్ళ లడ్డులు ఏమో గానీ, పావు గంట కోసారి కాఫీలు అంటారు. ఈ రొండు రోజులకీ కలిపి మొత్తం మన ఊరి చెరువంతా కాఫీ పెట్టేస్తే సరి. పైగా ఆ వంట మాస్టారు అన్నీ ఒక్కసారి అడుగుతాడా అంటే, అదీ లేదు.. ఒకసారి చిన్న మిక్సీ అంటాడు, ఒకసారి యాలకుల పాకెట్టంటాడు .ఈయనకన్నా మా ఆఫ్ షోర్ మేనేజర్ నయం. ఇహ నానీ చెప్పే పనులతో పోలిస్తే మా ప్రాజెక్ట్ మేనేజర్ అసలు దేవుడే ,” హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరైన మన్విత వాళ్ళ అక్క, అలవాటులేని హడావిడి పనులకి విసుక్కుంటూ పిట్టగోడపై వాలి చెప్పుకుంటూ పోతోంది .
“సరేలే. అసలు పాయింటుకి రా, ఇంకాసేపాగితే మనూ ఏడ్చేటట్టు ఉంది. మనూ, నేను రాత్రి 9.30 కి ఇంట్లోంచి బయల్దేరి బైక్ తో, ఊరి మొదట్లో మైలు రాయి దగ్గర ఉంటాను. నువ్వు సరిగ్గా పావు గంట ఆగి, నన్ను కలుసుకో! సరేనా ? ”
“మరి తను?” అని అడిగింది మన్విత ఆత్రంగా!
అక్కా బావా ఒకరినొకరు చూస్కుని నవ్వుకున్నారు.
“హీరో రాకపోతే ఎలా మరి సీన్ పండేది! హీరో ఎంట్రీ కూడా అద్దిరిపోయేలా చూస్తాం లే!” అంటూ ఫోన్ రావడంతో పక్కకి వెళ్లి, ఊరంతా వినపడేలాగా అరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు సిగ్నల్స్ అందక.
పదవే కిందకి పోదాం అన్న మన్వితని లాగి కింద కూలేస్తూ, “కాసేపాగవే బాబూ , పూలు కడదాం రమ్మంటే , ద్విజాని, అనూని అక్కడ పెట్టి వచ్చా. ఇప్పుడు వెళ్ళగానే, జాకెట్టు ముక్కలు, పసుపు కుంకాలు రిటర్న్ కవర్లలో పెట్టమంటుంది నానమ్మ . కాంట్రాక్టుకి ఇచ్చేస్తే ఐపోయేదిగా అంటే, గయ్యి మని లేస్తుంది. కాసేపు కూర్చుని వెళ్దాం.” అంది మన్విత వాళ్ళ అక్క.
ఇంతలో సావిత్రమ్మ కేకలెయ్యడంతో కిందకి దిగారు ఇద్దరు. వరండాలో కూర్చుని బుద్దిగా సన్నజాజులనీ, కనకాంబరాలనీ జతలు జతలుగా సర్దుతోంది దిజ్జు, వాటిని చటుక్కున లాక్కుని, దారాన్ని సుతారంగా తిప్పుతూ మాల కడుతోంది సావిత్రమ్మ. మధ్య మధ్యకి మరువం అందిస్తోంది అను. కిందికి దిగుతున్న మన్వితని చూస్తూ , “హేయ్ మనూ , నీకోసం మాత్రమే స్పెషల్ గా, మీ నానీ స్వయంగా కడుతోంది, రేపు నీ జడ కోసం ,” అంది.
ఏదోలా నవ్వేసింది కానీ , మన్విత మనసు మనసులో లేదు. ఒక్కసారిగా వాతావరణం అంతా గందరగోళంగా అయిపోయినట్టు అనిపించసాగింది. తన గుండె చప్పుడు తనకే వినపడసాగింది. చూపులు తెలీకుండానే గోడపై గడియారం కేసి మాటి మాటికీ వెళ్తున్నాయి. ఫంక్షన్ హాలులో తన కోసం, ఏ చీరకా చీర జాకెట్టు, పెట్టికోటు, నగలూ, ప్రత్యేకంగా ఒక పెట్టిలో సర్దుతూ మాట్లాడుతోన్న అమ్మతో కూడా , మరబొమ్మలా ఊకొడుతూ ఉంది. తమ ఫ్రెండు బాధని గమనించి, పెళ్ళికూతురికి నిద్ర చాల అవసరం అని చెప్పి , త్వరత్వరగా అన్నాలు తిన్నామంటే తిన్నాము అనిపించి, ఎనిమిది కల్లా మిద్దె గదిలోకెళ్ళి పడుకునేసారు ముగ్గురూ .
నిమిషం ఒక యుగం లాగా గుడుస్తుంటే, నిద్ర నటిస్తూ సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో తొమ్మిదిన్నర కల్లా వెళ్తూ వెళ్తూ, మన్విత వాళ్ళ బావ, మిస్డ్ కాల్ ఇచ్చి వెళ్ళాడు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉండగా, ప్రాణం అంతా ఫోన్లోనే ఉందేమో అన్నట్టు, క్లాక్ లో మారుతున్న అంకెలను చూస్తూ ఉంది మన్విత. సరిగ్గా పావుగంట తర్వాత నెమ్మదిగా లేచి, తానులేని సమయం లో మేనేజ్ చెయ్యమని స్నేహితురాళ్ళకి చెప్పి, వెనక గుమ్మంనుండి, బయల్దేరి, అప్పటికే తన కోసం ఎదుచూస్తున్న అక్క తో కలిసి, ఊరి మొదల్లో ఉన్న బావ దగ్గరికి చేరింది. చప్పున, ఇక్కడ ఉన్నట్లు వచ్చేయాలి అని మనూకి చెప్పి, వెనుదిరిగింది మన్విత అక్క .
బావతో కలిసి బండిపై కూర్చుంది కానీ, ఎందుకో ఒళ్ళంతా చల్లబడిపోయింది మన్వితకి. కొన్ని పనులు అనుకున్నంత తేలిక కావు. తెలీని ఒక సంచలనం, ఆనందం, భయం తనని ముప్పిరిగొన్నాయి.
కొంచెం దూరం వెళ్ళాక, చెరువు కట్టపైన బైక్ ఆపాడు మన్విత బావ. “జాగ్రత్త మనూ,” అని తాను అక్కడే ఆగిపోయాడు. ఆ చోటు మన్విత వాళ్ళు చెఱకుని బెల్లం ఆడించే గానుగ. కట్టకి ఎడమవైపు ఉన్న సన్నటి కాలిబాట వెంబడి కాస్త ముందుకి వెళ్ళి ,చిన్న సిమెంటు గూడులో, కోలగా వున్న నున్నని నల్లని రాయికి పసుపు రాసి, బొట్లు పెట్టిన అమ్మవారి రూపుని దాటుకుని మలుపు తిరగగానే ,అదిగో అక్కడే ఉన్నాడతను. తాను చూడాలనుకున్న వాడు. పుచ్చపూవులా పూసిన వెన్నెల్లో , గడ్డివాము ముందు, చెరువుకి ఎదురుగా , మిణుగురు పురుగులతో చుక్కల తెర కప్పినట్టుగా వున్న కానుగ చెట్టు కింద, పాత చెరుకు మిషన్ని ఆనుకొని, ఈ దారి వెంబడి వచ్చే తన కోసం ఎదురుచూస్తూ… ఒక్కసారి ఊపిరి తీస్కోవడం ఆపేసింది మన్విత. ముందుకి నడవాలంటే అడుగులు తడబడుతున్నాయి.
“ఇంతదాకా వచ్చి, నన్ను ఇంత దూరం రప్పిచ్చి , అంతలోనే అంత దూరంలో ఆగిపోయావేంటి అమ్మాయ్?” అన్నాడు తను, చెయ్యి చాస్తూ .
మంత్రం వేసినట్టు తన చేతిని, అతని చేతిలో పెట్టింది మన్విత. అతని కూడా వెళ్లి , అక్కడే ఉన్న చెక్క బెంచిపై కూర్చున్నారు, చెరువుకి ఎదురుగా . ఎప్పుడూ గల గలా మాట్లాడే మన్విత, మొదటిసారి మాటల కోసం వెతుక్కుంటూ ఉండిపోయింది. తన తనువంతా కనులై, అక్కడున్న ప్రతి, చిన్న విషయాన్నీ నిశితంగా గమనిస్తూ, గుండె గూటిలో భద్రంగా దాచుకుంటున్నట్టుగా ఉంది.
“మాట్లాడవా? అయితే వెళ్లిపోనా ?” అన్నాడతను.
చప్పున చూసింది అతని కళ్ళల్లోకి మన్విత , కంగారుగా!
“చీకటంటే భయం అన్నావుగా? భయం వెయ్యలేదూ,?” చటుక్కున అడిగేసి, మనసులో అంత చచ్చు ప్రశ్న వేసినందుకు తనని తానే తిట్టుకుంది మన్విత. సెమినార్లలో, కాన్ఫరెన్సులలో దడ దడలాడించే పిల్లకి, మాట్లాడదామంటే ఇప్పుడు నాలుక తడబడిపోతోంది .
“ఏమో, మీ ఊర్లో వెన్నెల ఎంత అందంగా ఉంటుందో, ఈ చోటు ఆ వెలుగులో ఇంకెంత బాగా ఉంటుందో, మనసు ఊరేట్టు చెప్పేదానివి కదా, చూద్దామనీ!! అందులోనూ ఈ రోజు లంగా ఓణీ వేసుకుంటానన్నావు గా! వెన్నెల్లో నడిచొచ్చే ఈ కన్నె బంగారుని ఎలా మిస్ అవ్వాలి చెప్పూ!!! పైగా వచ్చి కలిసే వరకు మెస్సేజ్ లు , ఫోన్ కాల్స్ బంద్ అని చెప్పావు కదా! అందుకే భయాన్ని అటకెక్కించి వచ్చేసా!” అన్నాడతను .
అందంగా నవ్వేసింది మన్విత, ఆ వెన్నెల రాత్రికి ఇంకొన్ని జిలుగులని అద్దుతూ.
కాసేపు, లోకంలో ఎవరికీ అక్కరలేని, వారికి మాత్రం అపురూపమైనవీ అనుకునే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మన్విత తనకి తెలియకుండానే, అతని భుజంపై తల వాల్చింది. తన వెనగ్గా వచ్చి, తన నడుముని చుట్టిన అతని చెయ్యి , ఒక భద్రతాభావాన్ని కలిగించింది మన్వితలో.
కాసేపలాగే ఉండిపోయారు ఇద్దరూ.. ఆ క్షణం అలాగే శాశ్వతంగా తమ గుండెల్లో నిలిచిపోయేలా .
“ఒక సెల్ఫీ తీసుకుందామా? ” అడిగాడు అతను.
” ప్లీజ్ వద్దు. ఈ క్షణం ఇలాగే మన మనస్సులలో మిగిలిపోనీ … ఇది కేవలం మన ఇద్దరికే సొంతం.. మూడో కంటికి కాదు కదా, చివరికి కెమెరా కంటికి కూడా తెలీడానికి వీల్లేదు! మనం ఒకరినొకరం తొలిసారి కలుసున్న ఈ క్షణం ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఎదురుగా నిలిచే తియ్యటి స్వప్నం అయ్యుండాలి,” అంది మన్విత, తన చేతిలో ఉన్న అతని చేతిని పెదవులకి ఆన్చుకుంటూ. మన్విత కోరికకు అంగీకారంగా , తన నడుముపై ఉన్న పట్టుని మరి కాస్త బిగిస్తూ , దగ్గరికి లాక్కున్నాడతను.
“అమ్మాయిగారి కోరిక తీరినట్టేనా?” అడిగాడతను మన్విత గుండెలపై మెలికలు పడి ఉన్న స్వాతి హారాన్ని సరిచేస్తూ!
“అవును మరి, ఇదంతా నాకోసమేనా? మన కోసం కాదూ !! స్కైప్ లో పెళ్లిచూపులు కానిచ్చేసావు. నీకు పగలైతే నాకు రాత్రి! కాబట్టి మాట్లాడేటప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ నిద్రలో జోగాడుతూ ఉండేవాళ్ళం. అప్పట్లోనే మా తాతయ్య మా నానీని చూడడానికి, పెళ్లి ముందే వచ్చేవాడంట తెలుసా? మీ కన్నా మేమే నయం అని నానీ నవ్వినప్పుడల్లా ఎంత ఉడుక్కునేదాన్నో !” ఉక్రోషం నటిస్తూ, అతన్ని కాస్త విడిపించుకుని రెండు చేతులూ నడుముపై పెట్టి ఆరోపిస్తోంది మన్విత.
“అవును మరి, వాళ్ళ ఊరికీ వీళ్ళ ఊరికీ ఈ చెరువేగా అడ్డం, మనలా సప్తసముద్రాలు దాటాలా ఏంటి? పైగా మేనత్త కూతుర్ని చూడడానికి కూడా ఎంత సాహసం చేసి ఉంటాడో, తోటరాముడు తాతయ్య!” తనూ అంతే ఉడుక్కున్నాడు.
“అయినా నేనేమన్నా బలవంతం పెట్టానా, నీతో పెళ్ళిచూపుల్లోనే….. ”
“అవి పెళ్ళిచూపులా?”, దబాయించింది మన్విత.
“అదేలే, స్కైప్ చూపుల్లోనే, లోపల గదిలోకి వెళ్ళమని, మాట్లాడానా లేదా? చేసుకుంటే ఈ అబ్బాయినే చేస్కుంటా అని తెగేసి చెప్పిందెవరో ?” అని తనూ దబాయించాడు .
“నీతో కాసేపు మాట్లాడి, నిన్ను కాదనే అమ్మాయి ఎవరో చూపించు? పెద్ద పోజు కొట్టొద్దులే!” వెక్కిరిస్తున్నట్టుగా అంది మన్విత .
తనని పొగిడిందో, తిట్టిందో అర్ధం కాక, అయోమయం మొహం పెట్టేసాడు .
“రేపొద్దున పిల్లలకీ, వాల్ల పిల్లలకి చెప్పుకో, మేము రాతియుగం వాళ్ళ లాగా ఒక్కసారి కూడా ఎదురెదురూ కలుసుకోకుండా పెళ్లి చేసేస్కున్నాం అని!! పప్పీ షేమ్ అయిపోతాం!” అంది.
“ఎలాగూ ఇంకో 48 గంటల్లో అయిపోతాం కదా !!” చిన్నపిల్లాడిలా మొహం పెట్టి అన్నాడు .
“ఏంటీ అయ్యేది ?”
“పప్పీ షేమ్ !!” అంతే అమాయకంగా అన్నాడతను .
“ఛీ ! నే చెప్పేదేంటి , నువ్ అడిగేదేంటీ ?” అలిగినట్లుగా చేసి దూరం వెళ్ళబోయింది.
చట్టుక్కున బలంగా వున్న తన రెండు చేతులతో మన్విత నడుం పట్టి లాక్కుని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నాడతను.
“సరే సరే మన కోసమే. ఒప్పుకుంటున్నాగా.” అన్నాడు.
తన చేతులని అతని మెడ చుట్టూ వేసి , అతని ఒళ్ళో ఒదిగి కూర్చుంది మన్విత. “అలా ఉత్తరం రాసి తప్పకుండా రావాల్సిందే అని, వచ్చి కలిసేదాకా మాట్లాడనని రాసినందుకు కోపం వచ్చిందా?” అడిగింది మన్విత.
“ఎక్కడో తిలక్ గారి అక్షరాల్లో ఉండే, వెన్నెల్లో ఆడపిల్ల, స్వయంగా రమ్మనీ, కలవాలనీ ఉందని అంటే, రాకుండా ఉండగలనా?” అన్నాడతను.
” నేను నమ్మను,” అంది మన్విత తలెత్తి చిలిపిగా తననే చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ.
“నిజం చెప్పనా? సరిగ్గా పది రోజుల ముందు దిగానా ఇండియాలో, ఆలోపూ నువ్వు నీ పోస్టింగు, వీసా పనులు ముగించుకుని ఊరు వచ్చేసావు. ఇక నేను వస్తూనే షాపింగ్ అనీ, పెళ్లి పనులనీ హడావిడి పెట్టేసారు!!రోజూ చాటింగ్ చేస్కుంటున్నామా?, వీలైనప్పుడు స్కైప్ లో చూసుకుంటున్నాం కదా? మళ్ళీ కలవడం ఎందుకూ అనుకున్నాను నేను ! పైగా సిటీలో షాపింగ్ చేసి అలసిపోయి ఊరికి వచ్చానో లేదో, బోలెడు చుట్టాలు, పెళ్లి పనులు. ఇంతలో మీ బావతో రాయబారం పంపావు.అది కూడా ఉత్తరం.నిన్నుఫలానా చోట పెళ్ళికిముందు ఒక్కసారి కలుసుకోవాలి అనీ, అంతవరకు మెసేజీలు , ఫోన్లు బంద్ అని. కోపం రాదూ మరి! ఎంత భయపడుతూ వచ్చానో తెలుసా? నువొచ్చేదాకా హనుమాన్ చాలీసా వింటూ కూర్చున్నా!! ఆ” అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.
“అంత కోపం వస్తే, మరెందుకు వచ్చినట్టో?” తాను అలిగి ఉన్నానన్న సంగతి మరచి, నవ్వుతూ అతని ముక్కు పట్టి లాగుతూ అడిగింది మన్విత.
“ఈ వెన్నెల బొమ్మ కోసం, మన కోసం. ఒక జీవితానికి సరిపోయే తియ్యని అనుభవం మనూ ఇదీ. నువ్వు, నేను మనంగా మారడానికీ, ఎప్పటికీ ఒక్కటై ఉండడానికి మన ఇద్దరికి మాత్రమే సొంతమైన ఒక అనుభవం కావాలి అన్నావు గా… అందు కోసం. మనం కాపురం మొదలుపెట్టే కాంక్రీట్ జంగల్ లో, మనకంటూ నీడనిచ్చి, ప్రాణ వాయువుని అందించే మధురానుభవాల్లో ఇది మొదటిది. ఇలాంటివి మరెన్నో నీతో పంచుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను మనూ ..” అన్నాడతను తన ఒడిలోని మన్వితని గాఢంగా గుండెలకి హత్తుకుంటూ.
చిన్నప్పటినుండీ వింటున్న “మనూ ” అనే పిలుపు, అతని నోటి నుండి వచ్చేసరికి , గమ్మత్తుగా, తాను అప్పుడే సరికొత్తగా పుట్టినట్టుగా అనిపించింది మన్వితకి. మనసు పులకరించగా మరింత దగ్గరగా హత్తుకుంది అతన్ని. వారిరువురి హృదయాలు తమ జతులని సరిచేసుకుని, ఒకే తాళంతో కొట్టుకోవడం ఆరంభించాయి.
ఆ వెన్నెల బాసలే , వారి భావి జీవితానికి పూల బాటలు వేస్తున్నట్టుగా ఉంది .
కాసేపటికి ఇద్దరి ఫోన్లు రింగైనాయి .” ఆ వచ్చేస్తున్నాం ” అంటూ ఇద్దరూ అవతలి వారితో చెప్పారు.
“అవును ఇంతకీ నువ్వు కూడా తోడు తెచ్చుకున్నావా?” మునిపంటికింద పెదవిని కొరుకుతూ నవ్వాపుకుంటూ అడిగింది మన్విత.
“భయానికి, ఆడా మగా తేడాలేదమ్మాయ్. మా బావ వచ్చాడు తోడు. మరి కాబోయే పెళ్ళికొడుకుని ఒంటరిగా పంపిస్తారేంటి? అయినా మా అక్క పెళ్లప్పుడు ఎంత సర్వీసు చేసాను తనకీ? ఆ మాత్రం ఋణం తీర్చాలి కదా?” అంటూ నవ్వాడతను, మన్విత గుండెలు తుళ్ళి పడేలా, సన్నజాజుల వానలా !
“లవ్ యూ ”
“నాకు తెలుసు అమ్మాయ్”
“మరి నువ్వు?” అడిగింది మన్విత.
మాటల్లో చెప్పలేను అన్నట్టు మరొక్కసారి దగ్గరికి తీసుకున్నాడు.
ఉరకలు వేస్తూ, కుదురులేకుండా ప్రయాణిస్తున్న నది, సాగర సంగమం చేరగానే తన అలజడిని తగ్గించుకుని, ప్రశాంత అనంత సాగరునిలో ఐక్యం అయినట్టు. ఎన్నో సందేహాలతో, అర్ధం లేని భయాలతో, వున్న మన్విత మనసుకి కూడా, తన ఇన్నేళ్ల నిరీక్షణకి జవాబు దొరికినట్టు, పెనవేసుకున్నది అతన్ని.
వెళ్లలేక వెళ్తోన్న మన్వితని, మరొక్క సారి దగరికి తీస్కుని, నుదుటి పై ముద్దు పెడుతూ, చెరో వైపు వీడిపోయారు, ఇంకో రోజులో ఒక్కటైయ్యే వారిద్దరూ .
ఇంటికి దగ్గరగా వస్తుంటే, అంత దూరం నుండి, ఇంటికి కట్టిన సీరియల్ లైటింగుల్లో వెలిగిపోతున్న “మన్విత వెడ్స్ శర్విల్ ” అన్న బోర్డుని తృప్తిగా చూసుకుంది మన్విత.
—SRINIDHI YELLALA
No Comments