కుడి ఎడమైతే
Story published in Koumudi online magazine
తంజావూరు లో పీజీ సీటు వచ్చినప్పటి నుండి అమ్మ ముభావంగా ఐపోయింది. మూడు రోజుల నుండి చెప్పిన జాగ్రత్తలే మళ్ళి మళ్ళి చెపుతోంది.ఇంకా అమ్మ దగ్గరనుండి వస్తున్న సుప్రభాతం వినలేక హాల్లోకి వచ్చి నా పిజి అడ్మిషన్ లెటర్ తెరిచి ఒకసారి చూస్కున్నాను.
కొత్త ప్రదేశాలకి వెళ్ళడం అన్నా,అక్కడి చరిత్ర,సంస్కృతి-సాంప్రదాయాలు,ఆచార- వ్యవహారాలు తెలుసుకోవడమంటే నాకు ఎంతో ఇష్టం.మనకి తెలియని ప్రపంచం బోలెడు వుంది బయట.నా వరకు నేను,దీన్నిప్రపంచాన్నిఇంకో కోణంలో చూసేందుకు వచ్చిన అవకాశం అనుకుంటున్నాను.ఎప్పుడెప్పుడు వెళ్తానా అనీ ఆసక్తి గా వుంది.
మనకు తెలిసిన బాష,మన మనుషులు,మన పద్ధతులలో పెరిగి ఇప్పుడు కొత్తగా ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం అంటే మనసు ఒకలాంటి ఆసక్తితో వింత అనుభూతికి లోనవుతోంది.ఇలా ఎన్నో ఆశలు, సంశయాలు, అతిశయాల నడుమ నాన్నతో తంజావూరు ప్రయాణానికి బయలుదేరాను.తంజావూరు ..ఆ ఊర్లో దిగగానే నాకు వేరే ప్రపంచం లోకి వచ్చినట్టు అనిపించింది.
ఫ్యాక్షన్ సినిమా షూటింగ్ లాగా సగం మంది తెల్లటి పంచల్లో ఉన్నారు.విభూతి బొట్లతో ,తాంబూలం తో పండిన ఎర్రని పెదాలతో మగవాళ్ళు, మెడలో లావుపాటి గొలుసులతో ముక్కుకి చెవులకి రాళ్ల దుద్దులతో, జడలో పూలతో నిండుగా, కచేరి చేస్తున్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మి లాగా వున్న ఆడవాళ్ళూ , ఎక్కడ చూసినా పూల దుకాణాలు, పళ్ళ దుకాణాలు, అడుగడుక్కి చిన్నదో పెద్దదో ఒక గుడి, అంతా సందడి సందడిగా ఏదో రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టు,”యుగానికోక్కడు” సినిమా సెట్టింగ్ లోకి వచ్చినట్టు అనిపించింది.
హాస్టల్లో సామాను పెట్టేసి నాకు కావలసిన వస్తువుల కోసం బజార్ కెళ్ళాము. అసలు జనాలు తమిళ్ బాష తప్పితే ఇంకో బాష మాట్లాడట్లేదు.చచ్చి చెడి సైగలతో ఎలాగో అలా మానేజ్ చేసి హాస్టలుకి కావలసిన సామాను కొన్నాం.నాన్న నాకు ఒక గంట పాటు జాగ్రతలు చెప్పి బయలుదేరాడు. మెల్లగా రూమ్మేట్స్ తో పరిచయాలు అయ్యాయి.ముగ్గురం తెలుగు వారమే. హలో హాయ్ లతో మెల్లగా మొదలైన స్నేహం ఏమే, ఒసేయ్ వరకు చేరింది. మూడు గంటల్లో ఒకరి చరిత్ర ఒకళ్ళకి తెలిసిపోయి, చిన్ననాటి స్నేహితుల్లాగా కలిసిపోయాం.
ఇలా హాస్టలుకి అలవాటు పడ్డాం.కాలేజికి బస్సు ప్రయాణం ఇంకో చిత్రమైన అనుభవం. మొదటి రోజు బస్సు స్టాండుకి వెళ్ళినప్పుడు చదువు రాని దద్దమ్మలా అనిపించాను.అన్ని బస్సుల పైనా తమిళ్ బాషలోనే రాసుంది. మా కాలేజి రూటు బస్సుని ఎలాగా కనుక్కోవడం? మాలో ఎవరికీ బాష రాదు. ఒకరి మొహాలు ఒకరం చూస్కోను సరిపోయింది..చేసేదేం లేక అక్కడ వున్న వాళ్ళని అడుక్కుని చివరికి మా రూటు బస్స్సుని పట్టుకున్నాం.
సాయంత్రం మా హాస్టలు ఇంజనీరింగ్ అమ్మాయిలని దొంగల్లాగా వెంబడించి వాళ్ళు ఏ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కి హాస్టలు చేరాం.ఇలా లాభం లేదని ఆ రోజు రాత్రి పక్క రూము అమ్మాయి దగ్గరికి వెళ్లి, మా రూటు బస్సు పేరుని తమిళ్ లో రాయించుకుని గుర్తుపెట్టుకోడానికి ప్రయత్నిచ్చాము. అబ్బే ఏమి లాభం లేదు. జపాన్ వాళ్ళు అందరు ఒకేలా అనిపిస్తారు కదా, అలాగే ఈ అక్షరాలు కుడా అన్ని ఒకలాగే ఉన్నాయ్. గజిబిజిగా జిలేబిల్లాగా, వాన పాముల గుంపులాగా అనిపించాయి.
రోజూ చూస్తూ చూస్తూ వుంటే ఆ అక్షరాలన్నీ నన్ను వెక్కిరిస్తున్నట్టు,నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించేది. ఎలాగైనా సరే వీటి అంతు చూడాలి అని డిసైడ్ అయ్యాను.
బాచిలర్స్ డిగ్రి అయితే క్లాసు రూము మన ఊర్లో ఉండే టూరింగ్ టాకీస్ లాగా నిండుగా, గోల గోలగా వుండేది.కాని పిజి కొచ్చేసరికి క్లాసు రూము పలచగా మల్టీ ప్లెక్ష్ ధియేటర్ లాగా అయిపొయింది.ఉన్న పన్నెండు మందిలో సగం మంది నాలాగా వలస వచ్చిన వాళ్ళే.నలుగురే తమిళ్ వాళ్ళు వుండే వాళ్ళు. అందులో ఒకడు రాజ్ కుమార్. వారానికి ఒకసారి మొహం చూపించేవాడు. పైగా తెలుగోల్లంటే కచ్చి. మనమంతా వచ్చి వాళ్ళని దోచేస్తున్నామని వాడి ఫీలింగు. మాట్లాడితే కరిచేటట్లు ఉంటాడు.
ఇంకో అమ్మాయి కాత్యాయని. సెంట్రల్ సిలబస్సట, తమిళ్ రాయడం రాదు అంది. ఇంకో అమ్మాయ్ ఫాతిమా ఆ అమ్మాయికి డిగ్రీ లో తెలుగు ఫ్రెండ్సు ఉన్నారట..”నాకు తెలుగు బాగా వస్తుంది. నాకు పెద్ద ఫామిలీ వుంది. ఇద్దరు అన్న వుంది, మూడు అక్క వుంది, అందరు జాలీగా వుంది..”అంటూ తెలుగుకి తెగులు పుట్టిస్తూ వుంటుంది.
ఇట్ట కాదని ఈ ఆప్షన్ కూడా వదిలేసుకున్నాను.చివరికి మిగిలింది ఇంకో అబ్బాయ్ మాత్రమే. పేరు చక్రపాణి. క్లాసులు మొదలెట్టి పది రోజులు అవుతున్నా, ఇంకా దర్శనం కాలేదు.ఈ అబ్బాయైనా నేర్పిస్తాడెమో చూడాలి అనుకున్నాను.
ఇలా ఓ పది రోజుల తర్వాత ఇక తమిళ బాష గురించి మరచిపోయాను అనుకునే టైం లో వచ్చాడు చక్రపాణి. పక్క పాపిడి, అడ్డ బొట్టుతో రాముడు మంచి బాలుడు అనేటట్లు వున్నాడు.ఇన్ని రోజులు ఎందుకు రాలేదని లెక్చరర్లు అడిగితే, “మంచి రోజులు లేవని మా ఇంట్లో పంపలేదు,”అని చెప్పాడు.
“ఏంటి, కాలేజికి రావడానికి కుడా ఇంకా వారాలు ,వర్జ్యాలు చూస్తున్నారా?,” అని ఆశ్చర్య పోయాం. వాళ్ళ నాన్న గారు కుంభకోణంలో గుడి పూజారి అంట. చాలా నెమ్మదస్తుడిలా అనిపించాడు. నేర్చుకుంటే ఈ పిల్లోడి దగ్గరే నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొత్త సిలబస్సు,సెమిస్టర్ ఎగ్జామ్స్ తో చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి.
ఇలా కొత్తదనం పోయి ఊరు అలవాటు పడ్డాక మెల్లగా తంజావూరుతో ప్రేమలో పడిపోయాను. వెయ్యేళ్ళ క్రితం కట్టిన భ్రుహదీస్వరాలయం, చోళ రాజుల కాలం నాటి కోటలు, గుళ్ళు, పాత కాలం నాటి డాబా ఇల్లులు, తంజావూరు బొమ్మలు, వీణలు, ఆ ఊరిలోనే ప్రాణం పోసుకున్న భరత నాట్య కళ, ఆ ఊరికే ప్రత్యేకమైన పెయింటింగులు, ఇలా ఎన్నో వింతలు విశేషాలతో ఎప్పుడు కొత్తగా గమ్మత్తుగా వుండేది.
ఇవన్ని కళ్ళకి విందైతే,నోటికి , కడుపుకి పసందు కలిగించడానికి మా ఆర్య విలాస్ ఎప్పుడు తయారుగా వుండేది. హాస్టలు తిండికి ఎడారిలా మారిపోయిన జిహ్వకి పన్నీటి జల్లులా వుండేది మా ఆర్య విలాస్.ఎప్పుడు సాంబ్రాణి ధూపం తో ఫ్రెష్ గా వుండేది హోటల్. అక్కడ అన్ని అద్భుతాలే .నీర్ దోస,పనీర్ దోస,ఉల్లి దోస,రవ దోస ఇలా ఓహ్ ఇరవై దోస రకాలు, సాదా ఇడ్లి,చిల్లి ఇడ్లి,ఇడ్లి 65, ఇడ్లి మంచురియన్,మినీ ఇడ్లి ఇలాగ ఇడ్లి లో ఓహ్ ఇరవై రకాలు, ఇదియప్పాలు, పొంగళ్ళు, తైర్ వడలు, మూడు రకాల చట్నీలు అబ్బో…. బ్రహ్మాండం.నోట్లో పెడితే రుచుల విస్పోటనమే లోపల.ఏది ఆర్డర్ చేసినా కుడా స్టీలు ప్లేటులో చక్కగా అరటి ఆకు వేసి వేడి వేడి గా పొగలు కక్కే టిఫిన్లు మన ముందు పెట్టేవాళ్ళు.చివరికి చైనీస్ నూడుల్స్ కుడా అరటాకు వేస్కుని చక్కగా సాసు పోసుకుని చేత్తో తినేవాళ్ళు అక్కడి పెద్దాళ్ళు.
రోజులు గడిచేకొద్దీ క్లాసులో అందరం బాగా కలిసిపోయాం. ఒకరోజు మా బయో టెక్నాలజీ లెక్చరర్ గారి అబ్బాయి మొదటి పుట్టిన రోజుకి మమ్మల్ని పిలిస్తే క్లాసు మొత్తం వెళ్ళాం. అక్కడ భోజనాల దగ్గర చక్రపాణి నా పక్కనే కూర్చున్నాడు. అవి ఇవీ మాట్లాడాక ఇంక అసలు విషయం అడిగాను. నాకు తమిళ్ నేర్పుతావా అని.”అయ్యో,ఎదుకు అంత కష్టం,”అని అన్నాడు.
“లేదు కొత్త బాష నేర్చుకోవాలని నాకు ఇంటరెస్టు.” అని చెప్పాను.”తమిళ్ బాష ,”అంటే ఇష్టమని ఒక రాయి కుడా వేసాను, అంతే అతని మొహం ఒక్కసారి మతాబులాగా వెలిగిపోయింది. అసలు తమిళ్ బాష ఎలా పుట్టింది,అందులో ఎన్ని రకాలు వున్నాయి,దాని చరిత్ర మొత్తం చెప్పి,కండిపా(కచ్చితంగా) నేర్పిస్తానని చెప్పాడు.
అప్పటినుండి నేను తనని వాజ్యారు(మేష్టారు) అని పిలిచేదాన్ని. చాలా చక్కగా చెప్పేవాడు. ఎప్పుడు అంటూ వుండేదాన్ని, “వాజ్యారు నువ్వు లెక్చరుర్ అయితే పిల్లలు బాగు పడతారు”, అని.
పాణి చాలా ఒద్దికైన కుర్రాడు. అనవసరంగా ఏమి మాట్లాడడు. చాల సున్నితమైన మనసు. తన స్థాయికి మించన దాని గురించి ఆశ పడడు. తనవల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అనుకుంటాడు. అలాగే ఎవరి వల్లనైనా తనకి ఇబ్బంది కలిగినా బాధ వేసినా, తనలో తానే మధనపడతాడు తప్పించి, ఎదుటి వారిని ఒక్క మాట అనడు. తనతో ఉన్నంత సేపు జాగ్రతగా మాట్లాడాల్సి వచ్చేది. తెలుగు వారికి వెటకారం అలవాటు కదా, ఒక్క మాట తమాషా కి అన్నా చిన్నబుచ్చుకునే వాడు. మంచితనం, మన్నన, సున్నితత్వం ప్రోది చేస్తే ఎలా వుంటుందో అలా ఉంటాడు. ఈ రోజుల్లో చాలా అరుదైన వ్యక్తిత్వం, పాణిది.
మొత్తానికి ఒక నెలలో కూడబలుక్కుని చదవడం వచ్చేసింది. ఆ మాత్రం చాలు, చెలరేగిపోయాను. ఇక చూడండి బస్సులో వచేటప్పుడు , వెళ్ళేటప్పుడు దార్లో కనిపించిన ప్రతి బోర్డుని , హోర్డింగులని చదివే దాన్ని. షాపుల పేర్లు అన్నీ చదివి మా వాళ్ళ ప్రాణం తినేసేదాన్ని. హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం మా వాళ్ళకి నేనే దిక్కు.ఏ బస్సేక్కాలో ఏ వీధోలో ఉన్నామో నేనే చదివి చెప్పాలి. అప్పుడు నేనే వాళ్ళకి మార్గదర్శి , శ్రీ రామ్ చిట్స్ అన్నీనూ.
ఇలా మా ఫ్రెండ్సులో నాకు ఇంత గొప్ప పేరు తెచ్చినందుకు మా వాజ్యారుకి ఒక రోజు పార్టి కూడా ఇచ్చాను. అర్యవిలాస్ కి తీస్కెళ్ళి మాంచి స్పెషల్ ఉల్లిదోస, వెన్ పొంగల్ ఇప్పించాను.
కాకపోతే నా తమిళ్ బాషా పరిజ్ఞానం కేవలం చదవడానికి మాత్రమే, దాని అర్ధం తెలిసేది కాదు. ఊరిపేర్లు, షాపు పేర్లు, సినిమా పోస్టర్లు మాత్రమే అర్ధం అయ్యేవి మిగతావి చదివేదాన్ని కాని ఎం చదివానో తెలిసేది కాదు.
మళ్లీ పరీక్షలు,ప్రాక్టికల్స్ తో బిజీ అయిపోయాము.చూస్తుండగానే మొదటి సంవత్సరం అయిపోవచ్చింది. సెకండ్ ఇయర్ అంతా ప్రాజెక్ట్ వర్క్. ఇంకా మేమంతా కలిసి చదవడానికి నెల రోజులు మాత్రమే వుంది.
ఇలా వుండగా ఒక రోజు మా హాస్టల్లో ఒకమ్మాయి మెస్సు లో ఒక తమిళ మ్యాగజిన్ చదువుతూ కనిపించింది. ఎప్పుడు బస్సు బోర్డులు, షాపు పేర్లే చదువుతానని మా వాజ్యారు ఏడిపిస్తుంటాడు. ఫైనల్ గా నా తమిళ్ పైత్యాన్ని నిరూపించుకుందామని ఆ అమ్మాయిని అడిగి ఆ మ్యాగజైన్ తీస్కున్నాను.
గురువు మెచ్చని విద్య విద్యే కాదనీ, ఎలాగైనా సరే మా వాజ్యారు దగ్గర మెప్పు పొందాల్సిందే అని, తీర్మానించుకున్నాను. రాత్రంతా కూర్చుని ఒక పద్యాన్ని సెలెక్టు చేసుకుని భట్టీయం వేసాను. మరుసటి రోజు లంచ్ టైములో పాణి నీ బలవంతంగా కాంటీన్ కి లాకెళ్ళి కూర్చోపెట్టాను.
నాకు తమిళ్ నేర్పించినందుకు గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నాను అనీ, తమిళ బాషలో ఒక పద్యం తనకు అంకితమివ్వాలని అనుకుంటున్నానని చెప్పి, కళ్ళు మూసుకుని, అక్కడికి అదేదో నా సొంత పద్యం అన్నంత ఇదిగా, తల ఊపుతూ, తన్మయత్వంతో చెప్తున్నట్టు, మొత్తం అప్పజేప్పేసాను.
కళ్ళు తెరిచి చూసేసరికి వాజ్యారు, అదో లాంటి ఆశ్చర్యంతో, ఆనందంతో నన్నే చూస్తూ వున్నాడు. నా పాండిత్యానికి నేనే మురిసిపోయాను.
“ఎలా వుంది వాజ్యారు. నీ అభిప్రాయం ఏంటి ?,”అని అడిగాను.
కాసేపయ్యాక,”నాక్కొంచం టైం కావాలి దివ్యా”,అని చెప్పి వెళ్ళిపోయాడు పాణి. అంత గొప్ప కవిత చదివానన్నమాట అనుకుని నేను వెళ్ళిపోయాను.
తర్వాత ఎగ్జామ్స్ హడావిడి లో ఉండిపోయాము. ఎక్కువ మాట్లాడుకునే అవకాశం రాలేదు. ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరం క్లాసులో కలుసుకున్నాము. తన ఆటోగ్రాఫ్ కోసం బుక్కు తనకి ఇచ్చాను, ఆటోగ్రాఫ్ తీసుకుని వచ్చేస్తుంటే, “దివ్యా ..అని పిలిచాడు,”ఏంటని అడిగే సరికి, “ఏమి లేదులే”, అని చెప్పాడు.
క్లాస్ అందర్నీ తరువాత రోజు కుంభకోణం రమ్మనమని చెప్పాడు. వాళ్ళ నాన్న పనిచేసే గుడి, చుట్టూ పక్కల వుండే ప్రదేశాలు చూపిస్తానని చెప్పేసరికి అందరం సరేనన్నాం.
మరుసటి రోజు అందరం కుంభకోణం బయల్దేరం.తంజావూరు నుండి గంట ప్రయాణం. రొజూ ఇంత దూరం వచ్చేవాడా అని ఆశ్చర్యపోయాం.ఈ ఊరు కూడా బ్రహ్మాండంగా వుంది.అడుగడుక్కి ఒక గుడి ఉంది. ప్రతి గుడికి ఒక కోనేరు. అన్ని గుడులు సుమారు 500 సంవత్సరాల ముందువే. చాలా అందమైన గుడులు. రాళ్ళకి ప్రాణం పోసినట్టు వున్నాయి శిల్పాలు. ఇన్ని ఏళ్లయినా జీవ కళ ఉట్టిపడుతున్నాయ్ వాటిలో..ప్రతి శివాలయం పక్కన ఒక వైష్ణవాలయం ఉంది. ఒకదాని గోపురం తో ఇంకోటి పోటి పడుతున్నట్లు ఉన్నాయి, ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా. చోళులూ పాండ్యులు పోటీలు పడి మరీ కట్టారట. చూడగలిగినన్ని గుడులు చూసాక చివరికి మళ్లీ చక్రపాణి వాళ్ళ గుడికి చేరుకున్నాం. అందరికీ కమ్మని చక్కర పొంగలి,పులిహోర పెట్టించాడు.గబా గబా తినేసి అందరం మంటపం లో కూర్చున్నాం. నాకెందుకో కోనేటి దగ్గరకు వెళ్ళాలనిపించింది.
మా వాళ్ళని అడిగితే వల్ల కాదని చెప్పారు. సరే అని నేనే వెళ్ళాను. పెద్ద కోనేరు. ఒక వైపు రావి చెట్టు . చెట్టు నీడ వైపు వెళ్లి చివరి మెట్టు పై కుర్చుని కాళ్ళని నీటిలో ఉంచాను చల్లని నీళ్ళు తాకేసరికి ప్రాణం లేచోచినట్టు అయ్యింది.
కోనేరు నిశ్చలంగా వుంది. ఎంతో నిర్మలంగా వున్న కోనేరుని చూస్తుంటే మనసంతా పవిత్ర భావంతో, ప్రశాంతతతో నిండిపోయింది. ఇంతలో అటువైపు గట్టు నుండి ఒక ఆకతాయి ఒక పెద్ద రాయి విసిరాడు. నిశ్చలంగా వున్న కోనేరులో అలజడి నెలకొంది. చేపలన్నీ చెల్లా చెదురై పోయాయి. ఆ అబ్బాయి మీద పట్టరాని కోపం వచ్చింది. మన లోకం తీరే అంత, పచ్చగా వున్న వారిని కెలికితే కానీ జనాలకి తృప్తి వుండదు కాబోలు అనుకున్నాను…కాసేపటికి కోనేటి అలజడి సద్దుమణిగింది.
కదలకుండా కూర్చునేసరికి కొంచేపటికి చిన్ని చిన్ని చేపలు కాళ్ళ దగ్గరికి వచ్చాయి. చక్కలిగింతలు పుట్టి కాళ్ళు బయటికి తీసేసాను.అన్ని చేపలు రివ్వున పారిపోయాయి.
“అవి ఏమి చెయ్యవు,”అంటూ ఇంగ్లీషులో ఒక గొంతు వినిపించింది. అలవాటైన గొంతే, అది మా వాజ్యారుది. చూసి నవ్వాను.
వచ్చి నాకు కాస్త ఎడంగా ఒక మెట్టు పైన కూర్చున్నాడు. వెంట తెచ్చిన మరమరాలను నీటిలో వేస్తుంటే చేపలు చిన్ని చిన్ని నోటితో వాటిని గుట్టుక్కున మింగుతున్నాయి. నాకు కొన్ని ఇచ్చాడు.ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది.అదే అన్నాను, “నువ్వు చాలా లక్కీ పాణి,ఇంత అందమైన ప్రదేశం లో పెరిగినందుకు ,”అని.చిన్నగా నవ్వాడు.
నాకైతే అలాగే అక్కడే ఇంకాసేపు వుండాలనిపించింది.
“దివ్యా”…
“దివ్యా”…
” ఊ..”
“చెట్లు చాలా పచ్చగా ఉన్నాయ్ కదా ..”
ఒక్కసారి ఉలిక్కి పడ్డాను…
ఎం చెప్పాలో తెలియక ,”నా చిన్నపటి నుండి చెట్లు పచ్చగానే ఉన్నాయ్ పాణి ,”అన్నాను.
“ఇంకా నన్ను ఏడిపించకు దివ్య,” అన్నాడు.
“నేనా,నిన్ను ఏడిపిస్తున్నానా?,”అన్నాను ఏమీ అర్ధం కాక,తనని చూస్తూ..
నా చూపులు తప్పించుకోవాలని నీటిలో చేపలని దీక్షగా చూస్తూ,”కంటికి నచ్చిన చోట్ల కల్లా మనసు వెళ్ళకూడదు దివ్యా..”అన్నాడు.
“కరెక్టే కొటేషన్ చాలా బాగుంది.ఇంగ్లీషులో చాలా మంచి ప్రొవెర్బ్స్ తెలుసు నీకు..ఈసారి వాటికి ట్యూషన్ చెప్తావా?,”అని అన్నాను, ఎందుకో వేడెక్కుతున్న వాతావరణాన్ని చల్లబరుద్దామని.
“చాలు దివ్యా ,నేన్ చెప్పేది విను,”…హటాత్తుగా వచ్చిన ఈ వడగాలి ఏంటో అర్ధం కాక అలా వింటూ ఉండిపోయాను.
“దివ్యా,కొలనులో వున్న చేపకు బయటి ప్రకృతి అందంగా ఉండొచ్చు.బయట వున్న పక్షికి కొలనులో స్వేచ్చగా ఈతకొట్టే చేప నచ్చవచ్చు”,..
“కానీ చేప బయటికి వచ్చి సుఖపడలేదు,పక్షి నీటిలోకి వెళ్లి ఈత కొట్టలేదు”…
“నేను ఆ కొలనులో చేప అయితే నువ్వు పక్షివి”..
“మనం పెరిగిన వాతావరణాలు వేరు.నన్ను మర్చిపో. నీ పై నాకు ఎలాంటి కోపం లేదు.కొన్ని అనుభవాలు, అనుభూతులు, వాస్తవాలయ్యేకంటే ,జ్ఞాపకాల లాగానే బాగుంటాయ్”..
“మన పరిచయం ఒక అందమైన జ్ఞాపకం అనుకో ..”అని ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడు.
నేనేం వింటున్నానో నాకేమి అర్ధం కాలేదు…అలా చూస్తూ ఉండిపోయాను.
అసలు ఈ ఆంగ్ల సూక్తి ముక్తావళి ఎందుకు ఉపదేశిoచాడో తెలుసుకుందామని అడిగే లోపు, మా ఫ్రెండ్స్ వచ్చారు, బస్సు టైం అవుతోంది వెళ్ళాలని. మా వాజ్యారు కూడా తరువాత ఒక్కడే దొరక లేదు. అందరితో పాటు టాటా చెప్పి,చివరిగా నా వైపు జాలిగా ఒక చూపు చూసాడు.
నాకేంటో కొరియన్ సినిమాని చైనీస్ సబ్ టైటిల్స్ తో చూసినట్టు అనిపించింది. రూములోఅన్ని సర్దుకుని బస్సు స్టాండ్ కి బయల్దేరే సమయంలో పక్క రూమ్ అమ్మాయ్ వచ్చింది. తన దగ్గర తీస్కున్న మ్యగజైన్ కోసం.
“ఏమి అనుకోకు దివ్యా..మాములు మ్యగజైన్ అయితే అడిగే దాన్ని కాదు. ఇది స్పెషల్ ఎడిషన్, ప్రేమకి సంభందించి ఓల్డ్ తమిళ్ లో రాసిన కవితలు ఉన్నాయ్. ఎన్నోపాత తమిళ్ పదాలను ఇందులో వాడారు.అందుకే తిరిగి తీసుకుంటున్నాను,” అంది.నా మట్టి బుర్రకు అప్పుడు బల్బు వెలిగింది. అనుమానం వచ్చి నేను పాణికి చదివి వినిపించిన చిన్న కవిత చూపించి అర్ధం అడిగాను.
“వావ్ మంచి టేస్ట్ దివ్యా నీది.ఇది నచ్చిందా నీకు ..గోదా దేవి శ్రీ రంగనాథ స్వామి కోసం పాడిన పాశురాలలో ఇది ఒకటి.నీకోసం నీ సాన్నిత్యం కోసం ఎదురుచూస్తుంటాను అని అర్ధం వస్తుంది,”అని చెప్పి వెళ్ళింది.
చివరికి ఇదన్నమాట విషయం. నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు నాకు.
బస్సులో తిరుగు ప్రయాణం మొత్తం ముభావంగా ఉండిపోయాను. ఏమైంది అని మా ఫ్రెండ్స్ అడిగితే తలనొప్పి అని తప్పించుకున్నాను.
మనసంతా ఎవరో కెలికేసినట్టు వుంది. ఎంత పొరపాటు చేసాను.ఇందాక కోనేటిలో రాయి విసిరిన అబ్బాయిని చూసి ఎంత తిట్టుకున్నాను.
చూస్తుంటే వాడికి నాకు అట్టే తేడా లేదనిపించంది. నిర్మలంగా వుండే పాణి మనసులో కలకలం సృష్టించాను.ఎంత మధనపడి ఉంటాడు ఇన్ని రోజులు.
కాస్త కూడా ఆలోచించకుండా ఎంత పొరపాటు చేసాను.
పాణి నా గురించి తప్పుగా అనుకున్నాడనే బాధ కన్నా,ఒక మంచి స్నేహాన్ని నిలుపుకోలేక పోయానన్న బాధే ఎక్కువగా వుంది. తెలిసి చేసే తప్పులకన్నా, తెలియకుండా చేసే తప్పులకి పడే శిక్ష మనల్ని ఎంతో బాధ పెడ్తుంది.
జరిగిన పొరపాటుని అతనికి చెప్పి క్షమాపణ అడుగుదామంటే అది మరీ మూర్ఖంగా ఉంటుందేమో అనిపించింది. తను నమ్మొచ్చు, నమ్మక పోవచ్చు. తనపై నాకు అటువంటి అభిప్రాయం లేదని చెప్తే, తనని ఇంకా బాధపెట్టిన దాన్ని అవుతాను.
చేసేదేమీ లేదు. జీవితం లో ఒక పెద్ద తప్పు చెయ్యకుండా నన్ను కాపాడానని అనుకుంటున్నాడు పాణి..అలాగైనా తనని సంతోషపడనీ. తనన్నట్టే ఇదో జ్ఞాపకంగా మిగిలిపోనీ..నాకు చేదుదీ, తనకు తియ్యనిదీ అని మనసుకి సర్దిచెప్పుకున్నాను.
No Comments